Abn logo
Dec 1 2020 @ 03:03AM

రైతులకు తోడుగా!

వారితో నాకు ఆత్మీయ అనుబంధం.. ఆదుకోవడానికి వేగంగా చర్యలు

సహాయ శిబిరాల్లో ఉన్నవారికి రూ.500.. ప్రతి కుటుంబానికీ 2 వేలు

పంట నష్టపోయిన సీజన్లోనే పరిహారం.. దేశంలో తొలిసారిగా అమలు

నెల రోజుల్లో ‘నివర్‌’ నష్ట పరిహారం.. 16వ తేదీకల్లా అంచనాలు పూర్తి

31కల్లా రైతులకు పరిహారం చెల్లింపు.. రంగు మారిన ధాన్యం కొంటాం

1,227 కోట్ల బీమా చెల్లిస్తున్నాం.. అర కోటి మందికి రైతు భరోసా

బాబుది మొసలి కన్నీరు.. రైతుల తరఫున పోరాడుతున్నట్లు డ్రామాలు

శాసనసభలో ముఖ్యమంత్రి జగన్‌ ధ్వజం


అమరావతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘ఇది మనసున్న ప్రభుత్వం. రైతులకు మంచి చేయాలన్న ఆలోచనతో ఉన్నాం. రైతుల కష్టం తెలిసిన ప్రభుత్వంగా... రైతులకు తోడుగా ఉండాలని, వారిని ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన అడుగులు వేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. పత్రికల్లో రాశారనో, ప్రతిపక్షం ఆరోపించిందనో తాము రైతులకు చేయడం లేదని.. రైతులకు, తనకు ఉన్న ఆత్మీయ అనుబంధంతోనే తమది రైతు పక్షపాత ప్రభుత్వమని గర్వంగా చెబుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఏ రెతూ కన్నీరు పెట్టకూడదని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామన్నారు.


సోమవారం శాసనసభలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా సహాయ శిబిరాల్లో ఉన్న వారికి రూ.500 ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశామన్నారు. ‘ఏడాది పిల్లవాడి నుంచి పెద్ద వారి వరకూ ప్రతి ఒక్కరికీ రూ.500 చొప్పున ఇచ్చాం. ప్రతి కుటుంబంలో సుమారు నలుగురు ఉంటారు. శిబిరాల నుంచి ఇంటికివెళ్లే సమయంలో రూ.2,000 వరకూ ఇచ్చాం. నెల్లూరు, చిత్తూరు, కడపలో ఇళ్లకు వెళ్లి అందిస్తున్నాం. దీంతో పాటు నివర్‌ తుఫాన్‌ వల్ల జరిగిన పంట నష్టానికి కూడా నెల రోజుల్లోనే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తాం. డిసెంబరు 16లోపు నష్టం అంచనా తయారీ పూర్తిచేయాలని ఆదేశించాం. 31నాటికి నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తాం. వరద వల్ల నష్టపోయిన రైతులకు వచ్చే సీజన్‌కు 80 శాతం సబ్సిడీపై విత్తనాలు అందిస్తాం. వరదల్లో 8మంది మృతి చెందారు. వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ఇచ్చాం. రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని ఆదేశించాం’ అని చెప్పారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా రైతులంతా తమకు మంచి జరుగుతుందని ఆరాటపడుతున్నారని చెప్పారు.


‘మేం అధికారంలోకి వచ్చి 18 నెలలైంది. నవంబరు చివరి నాటికి రాష్ట్రంలోని రిజర్వాయర్లన్నీ నిండిఉన్నాయి. చంద్రబాబు హయాంలో ఎప్పుడూ లేనివిధంగా నిండుకుండల్లా ఉన్నాయి. భూగర్భ జలాలు రీచార్జ్‌ అయ్యాయి. కానీ దీపం వెలుగు కింద చీకటి మాదిరిగా ఆగస్టు నుంచి నవంబరు వరకూ అడపాదడపా కురిసిన వర్షాల వల్ల రైతులకు కొంచెం నష్టం జరిగింది. నష్టం జరుగుతుందని తెలియగానే వెంటనే నిజాయితీగా సమీక్ష చేపట్టాం. ఏ సీజన్లో జరిగిన పంటనష్టాన్ని అదే సీజన్లో అందించాలని నిర్ణయించాం. ఇలా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. వర్షాలు, వరదలకు జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకూ జరిగిన పంట నష్టం కింద రూ.143 కోట్లను అక్టోబరు 27న విడుదల చేశాం. అక్టోబర్లో కురిసిన అధిక వర్షాలకు జరిగిన నష్టానికి నవంబరు 17న రూ.132 కోట్లు విడుదల చేశాం. నివర్‌ తుఫాను వల్ల పంటలు, ఇళ్లు, రోడ్లు, చెరువులకు కూడా నష్టం వాటిల్లింది’ అని తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..


‘బీమా కంపెనీలు మానవత్వంతో స్పందించడం లేదు. వాటి తీరుతో సమయానికి రైతులకు బీమా రావడం లేదు. 2020 ఖరీఫ్‌ తర్వాత ఇన్సూరెన్స్‌ బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. జనవరిలో కోతలు పూర్తయ్యాక.. ఎంత దిగుబడి వస్తుందో చూసి.. నష్టాన్ని అంచనా వేస్తాం. ఫిబ్రవరిలో ప్లానింగ్‌ విభాగం రిపోర్టు ఇచ్చాక తర్వాత మార్చి, ఏప్రిల్‌లోనే క్లెయిమ్‌లు ఇచ్చేస్తాం. చరిత్రలో ఇంత వరకూ ఎప్పుడూ జరగలేదు. ఒక్క ఏడాదిలోనే మా ప్రభుత్వం 58.77లక్షల మందికి బీమా ప్రీమియం చెల్లించింది. రైతులు రూ.290 కోట్లు చెల్లిస్తే.. ప్రభుత్వం రూ.350 కోట్లు చెల్లించింది. రైతుల వద్ద బీమా కోసం కేవలం రూ.26 లక్షలే వసూలు చేశాం. మిగిలిన 1,030 కోట్ల ప్రీమియం ప్రభుత్వమే చెల్లించింది. మా ప్రభుత్వం కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు చూడడం లేదు. చెప్పిన మాట ప్రకారం ప్రతిదీ అమలు చేస్తున్నాం. అర కోటి మందికి రైతు భరోసా ఇస్తున్నాం. ఇప్పటి వరకూ రూ.13 వేల కోట్లు అందించాం. వైఎ్‌సఆర్‌ జలకళ కింద బోర్లు వేయించడంతో పాటు మోటార్లు, పైపులు ఇస్తున్నాం. ఏడాదికి 50వేల బోర్లువేసేందుకు రూ.4వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇకనుంచి ధాన్యం  కొనుగోలు చేసిన రెండు వారాల్లోనే రైతులకు డబ్బులు చెల్లించాలని అధికారులను ఆదేశించాం. డిసెంబరు 15 నాటికి 1,227 కోట్ల బీమా మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతుల తరఫున చంద్రబాబు మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. రైతుల తరపున తాను మాట్లాడుతున్నట్లుగా, పోరాటం చేస్తున్నట్లుగా డ్రామాలు చేస్తున్నారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ వరదలు వచ్చినా అక్కడ కనిపించేవాడిని. చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో ఉంటున్నారు. సీబీఎన్‌ అంటే కరోనాకు భయపడే నాయకుడిగా హైదరాబాద్‌ను వదిలిపెట్టి రాలేదు.’


మీడియాపై ఆరోపణలు..

చంద్రబాబుపై సస్పెన్షన్‌ వేటు వేశాక సభలో మాట్లాడిన జగన్‌.. మీడియాపై విమర్శలు గుప్పించారు. ‘చంద్రబాబు యాక్టింగ్‌ చేస్తే మీడియా కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నాయి. సభలో చర్చ ఒక పద్ధతి ప్రకారం జరగాలి. ఎవరంటే వాళ్లు లేచి మాట్లాడానికి లేదు. చంద్రబాబు పోడియం వద్ద కూర్చోవడం ఆశ్చర్యంగా ఉంది. నేను ప్రతిపక్షనేతగా ఎప్పుడూ పోడియం వద్దకు రాలేదు. 40ఏళ్లు ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు అందరినీ తోసుకుని కూర్చోవడాన్ని మీడియా ఎత్తుకుంటుంది. రైతుల గురించి సీఎం ఏం చెబుతారు.. దీనివల్ల ఎలాంటి ఉపయోగమన్న విషయం పేపర్లలో ఉండదు. చంద్రబాబు ఫ్లోర్‌ఫై కూర్చోవడం, మార్షల్స్‌ ఎత్తుకెళ్లడం.. దీనికి సంబంఽధించిన డ్రామా మొత్తం వస్తుంది. ఇలాంటి మీడియా, ప్రతిపక్ష నేత ఉండడం మన కర్మ’ అని అన్నారు.

Advertisement
Advertisement
Advertisement