ఈ-క్రాప్‌లోకి.. రైతులంతా రావలసిందే!

ABN , First Publish Date - 2021-04-21T08:29:21+05:30 IST

రానున్న ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ప్రతి రైతూ తప్పనిసరిగా ‘ఈ-క్రా్‌ప’లో నమోదు కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నా వడ్డీ రాయితీ లబ్ధి చేకూర్చాలన్నా.. పంట రుణాలకు.. కనీస మద్దతు ధరకు రైతుల నుంచి

ఈ-క్రాప్‌లోకి.. రైతులంతా రావలసిందే!

దాని డేటాయే ఇక ప్రామాణికం

ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నా వడ్డీ రాయితీ,

పంట రుణాలు, మద్దతు ధర కూడా

ఖరీఫ్‌ నుంచి కచ్చితంగా అమలు

ఆర్బీకేల్లో నమోదు చేసుకోవాలి

ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టీకరణ

2019 రబీకి సున్నా వడ్డీ రాయితీ

ఖాతాల్లో 128.47 కోట్లు జమ

అందులోకి వస్తేనే పంటల బీమా: సీఎం


అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): రానున్న ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ప్రతి రైతూ తప్పనిసరిగా ‘ఈ-క్రా్‌ప’లో నమోదు కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నా వడ్డీ రాయితీ లబ్ధి చేకూర్చాలన్నా.. పంట రుణాలకు.. కనీస మద్దతు ధరకు రైతుల నుంచి పంటలు కొనాలన్నా ఈ-క్రాప్‌ డేటా ఉపయోగపడుతుందని.. అందువల్ల ఇది కచ్చితంగా అమలు కావాలని తెలిపారు. ‘వచ్చే జూన్‌ నుంచి రైతులంతా ఈ-క్రాప్‌ ప్రక్రియలోకి రావాలి. ఈ-క్రాప్‌ డేటానే ప్రామాణికంగా తీసుకుంటాం’ అని తేల్చి చెప్పారు. దీనివల్ల ఏ రైతు, ఏ పంట, ఎన్ని ఎకరాల్లో వేశారనే అంశంపై స్పష్టత ఉంటుందని, ఈ-క్రా్‌పలో నమోదు కోసం దరఖాస్తు పెట్టుకుంటే, రైతు భరోసా కేంద్రా(ఆర్బీకే)ల్లో డేటా నమోదు చేస్తారని చెప్పారు.


వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం కింద 2019 రబీ సీజన్‌ పంట రుణాల వడ్డీ రాయితీ కింద 6.28 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.128.47 కోట్లు జమ చేసే ప్రక్రియను మంగళవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన మీట నొక్కి ప్రారంభించారు. ‘రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. కూలీలు బాగుంటారు. ఇద్దరూ బాగుంటే.. 62% జనాభాకు ఉపాధి కల్పించినట్లువుతుంది. ఏ రైతూ నష్టపోకుండా, లాభసాటి వ్యవసాయం చేయించాలని రైతు సంక్షేమ పథకాలతో ముందడుగు వేశాం. 22 నెలల్లోనే రూ.65 వేల కోట్లు రైతు సంక్షేమ పథకాలకు ఖర్చు చేశాం. ఈ-క్రా‌ప్‌లో నమోదు కాకపోయినా, డేటా ట్యాలీ కాకపోయినా.. 2019 రబీ పంట రుణాల సున్నావడ్డీ రాయితీని 2.50 లక్షల మంది రైతులకు ఉదారంగా వర్తింపజేస్తున్నాం. వేరే అవసరాలకు రుణం తెచ్చుకుని, సున్నా వడ్డీ రాయితీ కోసం వ్యవసాయానికి తెచ్చామని చూపడం సరికాదు. దీనివల్ల నిజమైన రైతులకు అన్యాయం జరుగుతుంది’ అని సీఎం వ్యాఖ్యానించారు.


ఏడాదిలో 10 వేల గ్రామాలకు అమూల్‌ 

పాడి రైతుకు గిట్టుబాటు ధర లభించేందుకు ప్రతి లీటరు పాలకు రూ.5-7 వరకు అదనంగా వచ్చేలా చేపట్టిన ‘ఏపీ-అమూల్‌ పాలవెల్లువ పథకం’ ప్రస్తుతం 674 గ్రామాలకు విస్తరించిందని, ఏడాదిలోగా 10 వేల గ్రామాలకు విస్తరిస్తుందని సీఎం చెప్పారు. వచ్చే నెల 13వ తేదీన 2020-21కింద రైతు భరోసా తొలి విడత సొమ్ముతోపాటు 2020 ఖరీఫ్‌ పంటల బీమా సొమ్మును కూడా రైతులకు చెల్లిస్తామని ప్రకటించారు. రైతు భరోసా కింద ఇప్పటి వరకు 51.55 లక్షల మంది రైతులకు రూ.13,101 కోట్లు, సున్నా వడ్డీ కింద 61.22 లక్షల మంది రైతులకు రూ.1,300 కోట్లు, పంటల బీమా కింద 15.67 లక్షల మంది రైతులకు రూ.1,968 కోట్లు, ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.1,055 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. విపత్తు నిధికి రూ.2 వేల కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ.3 వేలు కోట్లు కేటాయించామన్నారు. కనీస మద్దతు ధర లేని పంటలను రూ.4,761 కోట్లతో కొనుగోలు చేశామని, శనగ పంట నష్టపోతే రూ.300 కోట్లు బోన్‌సగా ఇచ్చామని తెలిపారు. ధాన్యం కొనుగోలు, విత్తన సేకరణ, సున్నా వడ్డీకి గత ప్రభుత్వ బకాయిలు చెల్లించామని చెప్పారు.


‘18.70 లక్షల పంపు సెట్లకు పగటిపూట 9గంటలు నాణ్యమైన కరెంటు ఇచ్చేందుకు రెండేళ్లలో రూ.17,430 కోట్లు ఖర్చు చేశాం. ఫీడర్ల బాగుకు మరో రూ.1,700 కోట్లు వెచ్చించాం. ఉచిత విద్యుత్‌కు 7.5 హెచ్‌పీ మోటారు వాడితే రోజుకు 45 యూనిట్లు, నెలకు 1,350 యూనిట్ల వాడకం జరుగుతుంది. ఆక్వా రైతులకు యూనిట్‌ కరెంటు రూపాయిన్నరకే ఇస్తున్నాం. దీనికి రెండేళ్లలో రూ.1,560 కోట్లు ఖర్చు చేశాం. ఆర్థిక సమస్యలతో రైతులు చనిపోతే, గత ప్రభుత్వం ఇవ్వని 434 కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సహాయం అందించాం. మా ప్రభుత్వం వచ్చాక 82 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, వారి కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున చెల్లించాం’ అని వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ మంత్రి కన్నబాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-21T08:29:21+05:30 IST