సేవల్లో లోటు రానివ్వొద్దు

ABN , First Publish Date - 2021-11-23T09:38:53+05:30 IST

‘వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండాలి. ముంపునకు గురైన ప్రతి ఇంటికీ పరిహారం అందాలి. ఎవ్వరికీ అందలేదన్న మాట రాకూడదు’’ అని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావతి సచివాలయం

సేవల్లో లోటు రానివ్వొద్దు

  • ఎలాంటి సమస్యైనా నాకు చెప్పండి
  • నాలుగు జిల్లాలకు మరో 40 కోట్లు
  • దెబ్బతిన్న ఇళ్లకు తక్షణ పరిహారం 
  • మరో అల్పపీడనంపై అప్రమత్తం 
  • వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్ల సమీక్షలో ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశం


అమరావతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘‘వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండాలి. ముంపునకు గురైన ప్రతి ఇంటికీ పరిహారం అందాలి. ఎవ్వరికీ అందలేదన్న మాట రాకూడదు’’ అని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావతి సచివాలయం నుంచి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఆయా జిల్లాల్లో సహాయ కార్యక్రమాలు సాగుతున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సహాయ శిబిరాల్లో ఉన్న వారికి మంచి వసతులు, సదుపాయాలు కల్పించాలన్నారు. కష్ట సమయంలో ప్రభుత్వం బాగా చూసుకుంటోందనే మాట వినిపించాలన్నారు. అధికారులంతా డైనమిక్‌గా పని చేయాలని, ఎలాంటి సమస్య ఉన్నా.. తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, లీటరు వంటనూనె తక్షణమే అందజేయాలని ఆదేశించారు. సహాయ శిబిరాల నుంచి ఇంటికి వెళ్తున్న వారికి రూ.2 వేల చొప్పున అందించాలన్నారు. పూర్తిగా ఇల్లు ధ్వంసమైన వారికి రూ.95,100, పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి రూ.5,200 చొప్పున సాయం చేయాలని సూచించారు. దీనికిగాను ప్రతి జిల్లాకు రూ.10 కోట్లు చొప్పున మరో రూ.40 కోట్లు ఇచ్చినట్టు తెలిపారు.  

ఆ కుటుంబాలకు 25 లక్షలు

వరదలు, వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇప్పటికే 90ు నష్టపరిహారం అందించినట్టు ముఖ్యమంత్రి జగన్‌ తెలిపారు. మిగిలిన బాధిత కుటుంబాలకు పరిహారం వెంటనే అందేలా చూడాలన్నారు. నెల్లూరులో చనిపోయిన కానిస్టేబుల్‌, గ్రామ సచివాలయ ఉద్యోగి, ఆర్టీసీ కండక్టర్‌ కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలన్నారు. వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పశువులకు దాణా కూడా అందించాలన్నారు. పశువులు మరణిస్తే నష్ట పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ, వైద్య శిబిరాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు. దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ, ప్రజా రవాణా సాధారణ స్థితికి చేరేలా అత్యవసర తాత్కాలిక పనులు వెంటనే చేపట్టాలన్నారు. ఇప్పుడు వచ్చిన వరదను దృష్టిలో పెట్టుకుని శాశ్వత పనులకు రూపకల్పన చేయాలన్నారు. పంటలు కోల్పోయిన రైతులకు 80ు రాయితీపై విత్తనాలు సరఫరా చేయాలని సూచించారు. జిల్లాల్లో 104కు ఎవరు ఏసమయంలో ఫోన్‌ చేసినా వెంటనే స్పందించాలన్నారు.

ఎలాంటి పరిస్థితి ఎదురైనా..

 మరో అల్పపీడనం హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. 


బాధితులను ఆదుకుంటున్నాం: కన్నబాబు

భారీ వర్షాలు, వరదల కారణంగా నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో నిరాశ్రయులైన బాధితులను ఆదుకుంటున్నట్టు మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీలో వివరించారు. ఈ అంశంపై కేబినెట్‌లో చర్చించామన్నారు. ఇప్పటి వరకు 34 మంది మృతి చెందగా, 10 మం ది గల్లంతయ్యారని తలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు. వరదలతో 5,33,345 మంది రైతులు నష్టపోయారని, 8 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా ఉందన్నారు. పాడి పశువులు చనిపోతే రూ.30 వేలు, గొర్రెలు, మేకలను నష్టపోతే రూ.3 వేల చొ ప్పున సాయం అందిస్తున్నట్టు తెలిపారు. 

Updated Date - 2021-11-23T09:38:53+05:30 IST