Advertisement
Advertisement
Abn logo
Advertisement

సంక్రాంతి తర్వాత వస్తా..!

  • పెన్నా పొర్లుకట్టల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తా
  • అదేరోజు సంగం, నెల్లూరు బ్యారేజీలు ప్రారంభిస్తా
  • మరమ్మతులకు తక్షణం 2 కోట్లు విడుదల
  • ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడి
  • నెల్లూరు జిల్లా, తిరుపతిల్లో పర్యటన
  • వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన
  • నెల్లూరులో అడుగడుగునా ఆంక్షలు
  • ఇళ్ల నుంచి బయటకు రాకుండా పహరా
  • ఇంటికో మహిళా పోలీస్‌ మోహరింపు
  • ఎంపిక చేసిన వారితోనే సీఎం మాటలు


నెల్లూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ తర్వాత మరోసారి నెల్లూరు జిల్లాకు వస్తానని, పెన్నా పొర్లుకట్టల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నెల్లూరు జిల్లాలో వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్రాంతి తరువాత పెన్నా నదికి ఇరువైపులా రక్షణ గోడ, సోమశిల ప్రాజెక్టు ఆప్రాన్‌ పనులకు శంకుస్థాపన చేస్తానని.. ఈలోగా పనులు పూర్తి చేసి పెన్నా, సంగం బ్యారేజీలను అదే రోజు ప్రారంభిస్తానని అన్నారు. మూడు గంటలు ఆలస్యంగా ఆయన పర్యటన ఆరంభమైంది. తిరుపతి నుంచి ఉదయం 10.30 గంటలకు నెల్లూరు చేరుకోవాల్సిన ముఖ్యమంత్రి మఽధ్యాహ్నం 1.30కి చేరుకున్నారు. తొలుత నెల్లూరు రూరల్‌ మండలం దామవరం వద్ద పెన్నా వరద కారణంగా దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ రోడ్డును పరిశీలించారు. అక్కడి నుంచి బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ వద్ద పెన్నా పొర్లుకట్టలు తెగిన ప్రదేశాలను చూశారు. ఈ సందర్భంగా అక్కడున్న రైతులతో మాట్లాడి వరద తీవ్రత వల్ల కలిగిన నష్టాలను తెలుసుకున్నారు. అక్కడి నుంచి పెనుబల్లికి చేరుకుని దెబ్బతిన్న పంట పొలాలను, పొలాల్లో పెట్టిన ఇసుక మేటలను బైనాక్యులర్‌లో వీక్షించారు. వరద కారణంగా కూలిపోయిన స్కూలు కాంపౌండ్‌ వాల్‌ను పరిశీలించి ఆ గ్రామ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.


ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. పొలాల్లో ఇసుక మేటలు తీయడానికి రెండు వేలిస్తున్నారని.. ఇది ఏమాత్రం సరిపోదని సీఎంకు తెలిపారు. ఒక ఎకరంలో ఇసుక మేటలు తీయాలంటే కనీసం రూ.50 వేలు ఖర్చవుతుందని, ప్రభుత్వం 10వేలివ్వాలని, ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించిన కారణంగా అన్ని వస్తువులూ పాడైపోయాయని, ఒక్కో కుటుంబానికి రూ.10వేల సాయం అందించి ఆదుకోవాలని కోరారు. సీఎం అక్కడి నుంచి 3.45 గంటలకు నెల్లూరు నగరం భగత్‌ సింగ్‌ కాలనీకి చేరుకున్నారు. అక్కడ పెన్నానది ప్రవాహ తీరును పరిశీలించారు. స్థానికుల నుంచి వినతులు స్వీకరించారు. వారినుద్దేశించి మాట్లాడుతూ.. పెన్నా పొర్లుకట్టల తక్షణ మరమ్మతుల కోసం రూ.2 కోట్లు మంజూరు చేశానన్నారు. తరచూ వరద తాకిడికి గురయ్యే భగత్‌సింగ్‌ కాలనీ తదితర ప్రాంతాల్లో సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.100 కోట్లతో రక్షణ గోడ నిర్మిస్తామన్నారు. వరదను ఎదుర్కోవడంలో జిల్లా అధికార యంత్రాంగం సమర్థంగా పనిచేసిందని కితాబిచ్చారు. ఇప్పటికే 99 శాతం మందికి వరద సాయం అందిందని, అందని వారు ఎవరైనా ఉంటే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


శిక్షణ ఇచ్చి సీఎం ముందుకు..

భగత్‌సింగ్‌ కాలనీకి వచ్చిన సీఎంకు తమ బాధలు చెప్పుకునే అవకాశం ఎక్కువమంది బాధితులకు లభించలేదు. ఆయనతో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో ఎంపిక చేసుకున్న కొంతమందికి.. అధికారులు ముందుగానే శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. వీరందరిని ఒక ఇంట్లో ఉంచి.. సీఎం రావడానికి ముందు బారికేడ్ల ముందుకు తీసుకొచ్చారు. అక్కడే నివాసం ఉన్న కుటుంబాలను ఇళ్లనుంచి బయటకు రానివ్వకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి ఇంటి ముందు మహిళా కానిస్టేబుల్‌ను కాపలా ఉంచారు. దీంతో వరద బాధితుల్లో అత్యధికులు సీఎంను కలిసి తమ బాధ చెప్పుకొనే అవకాశం లేకుండా పోయింది. ఎంపిక చేసుకున్న కొంత మందికే ఎలా మాట్లాడాలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి సీఎం సమక్షానికి తీసుకెళ్లారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు.


మురుగుకు మరుగు

నెల్లూరు-జొన్నవాడ రోడ్డులో ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి కూతవేటు దూరంలో మడుగులుగా ఏర్పడింది. ఆ ప్రాంతంలో విపరీతమైన దుర్వాసన వస్తోంది. అప్పటికప్పుడు ఆ మురుగును తొలగించడం సాధ్యం కాకపోవడంతో ఆ దారిన రాకపోకలు సాగించే సీఎంకు ఆ దృశ్యాలు కనిపించకుండా సుమారు 100 మీటర్ల పొడవున తెల్లటి పరదాలు కట్టి కవర్‌ చేసుకున్నారు. పెనుబల్లిలో పోలీసులు ఏకంగా ఒక ఇంట్లోని వ్యక్తులు బయటకు రావడానికి వీలులేకుండా గేటును ఇనుక కమ్మీతో కట్టేశారు. సీఎం ఆ ఇంటి ముందు నుంచే హైస్కూలులోకి వెళ్లాలి. అయితే ఆ కుటుంబ యజమాని నా ఇంటికే తాళం వేస్తారా అని తిరగబడడంతో పోలీసులు కమ్మీని తొలగించక తప్పలేదు. 

Advertisement
Advertisement