ఢిల్లీతో అమీతుమీ

ABN , First Publish Date - 2021-11-21T07:51:28+05:30 IST

వ్యవసాయ చట్టాల విషయంలో మోదీ సర్కారు వెనక్కి తగ్గిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూకుడు పెంచారు. రైతుల సమస్యలనే ఆలంబనగా చేసుకొని కేంద్రంపై ఎదురుదాడికి రంగం సిద్ధం చేశారు. శనివారం అందుబాటులో ఉన్న మంత్రుల్ని, పార్టీ ఎంపీలను ఆగమేఘాల మీద ప్రగతి భవన్‌కు ..

ఢిల్లీతో అమీతుమీ

  • ధాన్యం సేకరణపై ఎన్నాళ్లు నాన్చుతారు.. మంత్రులు, ఎంపీలతో వెళుతున్నాం
  • అవసరమైతే ప్రధానినీ కలుస్తాం..
  • సాగు చట్టాలపై రైతుల విజయం అద్భుతం
  • ఢిల్లీ ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు 3 లక్షల చొప్పున సాయం
  • కేంద్రమూ 25 లక్షల చొప్పున ఇవ్వాలి..
  • రైతులపై ఉద్యమ కేసులన్నీ ఎత్తేయాలి
  • మద్దతు ధరకు చట్టబద్ధత పోరాటంలో రైతు సంఘాలతో చేతులు కలుపుతాం
  • విద్యుత్తు బిల్లును వాపసు తీసుకోవాలి.. రాష్ట్ర నీటి వాటా తేల్చకుంటే ఉద్యమమే
  • ఏ లక్ష్యంతో ఏడేళ్లుగా నాన్చుతున్నారు..
  • కేంద్రంపై మండిపడ్డ సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ చట్టాల విషయంలో మోదీ సర్కారు వెనక్కి తగ్గిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూకుడు పెంచారు. రైతుల సమస్యలనే ఆలంబనగా చేసుకొని కేంద్రంపై ఎదురుదాడికి రంగం సిద్ధం చేశారు. శనివారం అందుబాటులో ఉన్న మంత్రుల్ని, పార్టీ ఎంపీలను ఆగమేఘాల మీద ప్రగతి భవన్‌కు పిలిపించి సమావేశయ్యారు. వెంటనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలానికి పైగా పట్టువదలకుండా పోరాటం చేసిన రైతులను కొనియాడారు. అద్భుత విజయం సాధించారని ప్రశంసించారు. ఢిల్లీ కేంద్రంగా సుదీర్ఘంగా సాగిన పోరాటంలో అసువులు బాసిన 700 మంది రైతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున రూ.22 కోట్లు సహాయం ఇస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చే ఈ సహాయాన్ని మంత్రులు నేరుగా బాధిత కుటుంబాలను కలిసి అందిస్తారని చెప్పారు.


అవకాశాన్ని బట్టి తానుకూడా బాధిత కుటుంబాలను కలిసే ప్రయత్నం చేస్తానన్నారు. ప్రజాగ్రహాన్ని అర్థం చేసుకొని వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ సారీ చెప్పి తప్పుకుంటే సరిపోదని, రైతు ఉద్యమ నేతలు డిమాండ్‌ చేసినట్లుగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. వారి పోరాటంతో టీఆర్‌ఎస్‌ చేయి కలుపుతుందని, పార్లమెంటు సహా అన్ని వేదికల మీద ఈ డిమాండ్‌ సాధనకు కృషి చేస్తుందని కేసీఆర్‌ ప్రకటించారు. అంతేకాకుండా, ఉద్యమానికి కారణమైన చట్టాలనే రద్దు చేసినందున, ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన దుర్మార్గపు కేసులను కూడా మోదీ సర్కారు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున సహాయం అందించాలని కోరారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో చర్చకు రానున్న విద్యుత్‌ బిల్లును కూడా మోదీ సర్కారు వెనక్కి తీసుకోవాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చే రాష్ట్రాలను బలవంతంగా సాగు మోటర్లకు మీటర్లు పెట్టించే నిబంధనలు ఈ బిల్లులో ఉన్నాయని చెప్పారు. వ్యవసాయ చట్టాల విషయంలో చేసినట్లే కేంద్రం విద్యుత్‌ బిల్లు విషయంలో మొండిగా ముందుకు వెళితే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోక తప్పదని, రైతులు మరోసారి వీధుల్లోకి వస్తారని హెచ్చరించారు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు విషయంలోనూ కేంద్రం దాటవేత వైఖరిని అవలంబిస్తోందని కేసీఆర్‌ మండిపడ్డారు. ఎంత కొంటారనే విషయమై కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానం రాబట్టేందుకే ఆదివారం ఢిల్లీకి వెళుతున్నట్లు సీఎం ప్రకటించారు. తనతోపాటు మంత్రులు, ఎంపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు వస్తారన్నారు.


కేంద్ర మంత్రిని, సంబంధిత అధికారులను, అవసరమైతే ప్రధానమంత్రిని కలిసి స్పష్టత ఇవ్వాలని కోరతామని చెప్పారు. ధాన్యం కొనుగోలుపై వార్షిక టార్గెట్‌ ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని, దానిని బట్టి ఇక్కడ సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు. కేంద్రం నుంచి సరైన పద్ధతుల్లో సమాధానం రాకపోవడం వల్లే ఒత్తిడి పెంచేందుకు తాము ఢిల్లీ వెళ్లాల్సి వస్తోందన్నారు. గురువారం ధర్నా రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని కేంద్రం చెప్పిందని వెల్లడించారు. చివరి ప్రయత్నంగా ఆదివారం ఢిల్లీకి వెళ్తున్నామని చెప్పారు. అనురాధ కార్తె శుక్రవారమే ప్రారంభమైందని, ఏదో ఒకటి తేల్చకపోతే రైతులు గందరగోళంలో పడిపోతారని అన్నారు. అనవసర  ఇబ్బందులు వస్తాయని చెప్పారు. మాకు ముందే చెబితే వేరే పంటను వేసుకునే వాళ్లం కదా... అనవసరంగా నష్టపోయామని రైతులే అంటారన్నారు. ‘‘మొన్న కేంద్రం నుంచి వచ్చింది నిజమా, అబద్ధమా? అధికారికంగా ఇచ్చిండ్రా, లీక్‌ చేసిండ్రా తెల్వదు. ఒక గాలి వార్త అయితే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతామని, టార్గెట్‌ నిర్ణయిస్తామని, ఉప్పుడు బియ్యం కొనబోమని చెప్పారు. అది నిజమో కాదో, అధికారికమో కాదో తెలుసుకోవడానికి వెళుతున్నాం. ఢిల్లీలో రెండు రోజులు పట్టొచ్చు. తర్వాత మన రైతాంగానికి ఏ విషయమూ తెలియజేస్తాం’’ అన్నారు.


రైతులపై కేసులన్నీ ఉపసంహరించుకోవాలి

‘‘గత 13 నెలలుగా భారత రైతాంగం గొప్ప పోరాటం చేసింది. అనేక కేసులు, ఒత్తిడులు, ప్రకృతి సృష్టించిన ఇబ్బందులను తట్టుకుని అద్భుతమైన విజయం సాధించిన రైతాంగానికి అభినందనలు తెలియజేస్తున్నాం. రైతాంగమంతా ముప్పు నుంచి తప్పించుకున్నట్లు ఫీల్‌ అవుతున్నారు. రైతు ఉద్యమాల దరిమిలా వేల కేసులు పెట్టారు. కొన్ని దేశద్రోహం కేసులు కూడా పెట్టారు. ప్రధాని సారీ చెప్పి చేతులు దులుపుకుంటే సరిపోదు. మొత్తం కేసులను ఒక్క నిమిషంలోఎత్తేయాలి. బెంగళూరుకు చెందిన దిశ రవి అనే అమ్మాయి రైతులకు సంఘీభావంగా ట్వీట్‌ చేస్తే ఆమె పైనా కేసులు పెట్టి వేధించారు. అలాగే అనేక మందిపై కేసులు పెట్టారు. ఇవన్నీ తక్షణమే ఎత్తేయాలి’’ అన్నారు.  మద్దతు ధర చట్టాన్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే పెట్టాలని కోరారు. కేంద్రం దీన్ని సానుకూలంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 140 కోట్లకు చేరిన దేశ జనాభాకు ఆహార కొరత ఏర్పడితే తిండి పెట్టగలిగే శక్తి ఏ బయటి దేశానికి లేదని, అందుకే వ్యవసాయ రంగాన్ని ఆత్మ నిర్భరం చేయాలని గత ఏడాది కొవిడ్‌ సంక్షోభం సందర్భంగా ప్రధానికి సూచించానన్నారు.  వ్యవసాయ చట్టాలను తాము పార్లమెంటు వేదికగా వ్యతిరేకించామని, అనుమానం ఉన్న వాళ్లు రికార్డులను తనిఖీ చేసుకోవాలని సూచించారు. 


నీటి వాటా తేల్చాల్సిందే 

గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ నీటి వాటాను కేంద్రం తేల్చాల్సిందేనని కేసీఆర్‌ అన్నారు. అందుకోసం ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని, మూడు లేదా నాలుగు నెలల కాలపరిమితి విధించాలని డిమాండ్‌ చేశారు. నీటి వాటాలు తేల్చకుంటే ఇతర రాష్ట్రాలను కలుపుకుని పెద్ద ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఏడేళ్లుగా ఎందుకు తేల్చడం లేదు? కేంద్రం చెప్పినట్లుగానే సుప్రీంలో కేసును ఉపసంహరించుకున్నాం కదా? అన్నారు. కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి నీటి వాటా తేల్చాలని కోరతామని చెప్పారు. కేంద్రం ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయకుంటే ఉద్యమాలు చేస్తామని, అడుగడుగునా నిలదీస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ‘‘మా ఓపికకు హద్దు ఉంటుంది’’ అని కేసీఆర్‌ హెచ్చరించారు. రాష్ట్రం ఏర్పడ్డాక నెల రోజుల్లోపే కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి కేంద్రానికి మొట్టమొదటి దరఖాస్తు ఇచ్చానని కేసీఆర్‌ గుర్తు చేశారు. నిర్ణయం తీసుకోవడానికి కేంద్రానికి ఏ అడ్డం వస్తోందని ప్రశ్నించారు. ట్రైబ్యునల్‌కు రిఫర్‌ చేయాల్సిన అవసరం ఏముందని అడిగారు. అసలు కేంద్రం ఏం చేయాలనుకుంటోందో, దేన్ని అడ్డుకోవాలనుకుంటోందో అర్థం కావడం లేదని చెప్పారు. కేంద్రం ట్రైబ్యునల్‌కు రిఫర్‌ చేస్తామన్నా తమకు అభ్యంతరం లేదన్నారు.  


గిరిజన రిజర్వేషన్‌ పెంచాల్సిందే

తమిళనాడు తరహాలో రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు పెంచుకొనేందుకు అనుమతించాలని  కేంద్రానికి 50 లేఖలు రాశామని, వ్యక్తిగతంగా కూడా కలిశామని కేసీఆర్‌ ప్రస్తావించారు. కేంద్రం స్పందించకుంటే  పెద్దఎత్తున గిరిజనుల పోరాటాలను ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ పైనా శాసనసభ తీర్మానం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే తాము చేయాల్సింది చేస్తామన్నారు. రాబోయే జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని కోరారు. రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను ప్రకటించడం గర్వంగా ఉందని కేటీఆర్‌ తెలిపారు. 


చివరిగింజ వరకు కొంటాం

వానాకాలం ధాన్యాన్ని చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇప్పటికే 6,600 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని ప్రస్తావించారు. అవసరమైతే మరిన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వర్షాలు ఉన్నందున తొందరపడి కోతలు పెట్టుకోవద్దని,  ధాన్యం ఎంత ఆలస్యంగా వచ్చినా మొత్తం ధాన్యాన్ని కొంటామని భరోసా ఇచ్చారు. యాసంగి రైతు బంధుకు డబ్బులు సిద్ధం చేస్తున్నామని కేసీఆర్‌ ప్రకటించారు.


కేంద్రం బియ్యం కొనాల్సిందే

దేశంలో గోధుమల కన్నా అన్నం తినేవాళ్లే ఎక్కువగా ఉంటారని, కేంద్రం కొర్రీలు వేయకుండా రైతులు తీసుకొచ్చిన మొత్తం ధాన్యాన్ని కొనాలని కేసీఆర్‌ కోరారు. రాష్ట్రంలో ఽవినియోగానికే ఏటా 60 లక్షల టన్నులు ఖర్చవుతుందని, తాము కోరినట్లు కేంద్రం 90 లక్షల టన్నులు తీసుకుంటే మిగిలిపోతుందని భయపడాల్సిన పని లేదని అన్నారు. రాజకీయాల్లో ఏ సందర్భంలో ఎవరిని కలుపుకొని పోవాలో వాళ్లను కలుపుకొని పోతామని, సందర్భం, పరిస్థితిని బట్టి నిర్ణయించుకుంటామని చెప్పారు. 


విద్యుత్‌ బిల్లును ఉపసంహరించాలి

కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన విద్యుత్‌ బిల్లును విరమించుకోవాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. సమైక్య రాష్ట్రంలో నలిగిపోయిన తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం తీసుకున్న అనేక సానుకూల చర్యల్లో భాగంగా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. కేంద్రం కొత్త కరెంటు బిల్లు ద్వారా బోర్ల వద్ద మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తోందన్నారు. ఉచిత విద్యుత్‌ భారాన్ని తట్టుకోగలిగిన రాష్ట్రాలను ఒత్తిడి చేయొద్దని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. కేంద్రం చెప్పినట్లు బోర్ల దగ్గర మీటర్లు పెట్టడానికి తాము సిద్ధంగా లేమని ప్రకటించారు. వచ్చే నిధులను నిలిపి వేస్తామనో, ఇంకో రకంగానో కేంద్రం ఒత్తిడి చేయడం సరైన పద్ధతి కాదని, నియంతృత్వం కిందకే వస్తుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రాలకు కొన్ని బాధ్యతలు ఉంటాయని, కేంద్రం విధానాలు రాష్ట్రాలపై రుద్దొద్దని, మంచివని భావిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ చట్టాల మాదిరిగా విద్యుత్‌ బిల్లునూ కేంద్రం వాపస్‌ తీసుకోవాలని కోరారు. పార్లమెంటులో తమ శక్తి మేరకు పోరాటం చేస్తామన్నారు. 

Updated Date - 2021-11-21T07:51:28+05:30 IST