యాదాద్రికి వచ్చినప్పుడల్లా ఏంటిది..! కేసీఆర్ ఆగ్రహం

ABN , First Publish Date - 2021-06-22T08:01:12+05:30 IST

యాదాద్రి కొండపై పనులు వెంటనే పూర్తి కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ‘‘వచ్చినపుడల్లా వంకలు చెబుతున్నారు.

యాదాద్రికి వచ్చినప్పుడల్లా ఏంటిది..!  కేసీఆర్ ఆగ్రహం

  • యాదాద్రి పనులు ఎంతకాలం చేస్తారు?
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం 
  • సాధ్యమైనంత త్వరగా పూర్తి కావాలి
  • అవసరమైతే కాంట్రాక్టర్లను మార్చండి
  • రింగ్‌రోడ్డు లోపల ప్రైవేట్‌ ఆస్తులుండొద్దు
  • ఆలయ పర్యటనలో అధికారులకు నిర్దేశం
  • లైటింగ్‌ ఏర్పాట్లపైనా సీఎం అసంతృప్తి


యాదాద్రి, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి కొండపై పనులు వెంటనే పూర్తి కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ‘‘వచ్చినపుడల్లా వంకలు చెబుతున్నారు. ఎంతకాలం చేస్తారు? ఇకపై జాప్యం సహించేది లేదు’’ అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకేసారి 20 లక్షల మంది వచ్చినా సరిపోయే విధంగా సదుపాయాలు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. సోమవారం వరంగల్‌ జిల్లా పర్యటన తర్వాత సాయంత్రం యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. కొండపై బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు పూజల అనంతరం ఆశీర్వచనం చేసి స్వామివారి శేషవస్ట్రాలను అందజేశారు. తర్వాత ప్రధానాలయం వద్ద క్యూలైన్‌ మెటల్‌ బాక్స్‌లను, ఆలయ పరిసరాల్లో పనులను సీఎం పరిశీలించారు. కొండపై పనులు మందగమనంతో సాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూకాంప్లెక్స్‌ బిల్డింగ్‌, ఎస్కలేటర్లు, ల్యాండ్‌స్కేపింగ్‌, బీటీ రోడ్డు, పుష్కరిణి, కల్యాణకట్ట, కార్‌పార్కింగ్‌ నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి అనుబంధంగా చేపట్టిన పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. పనులు వేగంగా చేయకపోతే కాంట్రాక్టర్లను మార్చడానికి కూడా వెనుకాడవద్దని సూచించారు. 


కాటేజీల నిర్మాణానికి వైటీడీఏ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి వాటిని అద్భుతంగా నిర్మించే ఏజెన్సీలకు అప్పగించాలని సూచించారు. ప్రధానాలయ అంతర్‌ ప్రాకార మండపం నుంచి గోపురాలకు ఏర్పాటు చేసిన విద్యుత్తు దీపకాంతులను పరిశీలించిన ఆయన దానిపట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ‘ఎంతో గొప్పగా ఆశించాం. ఇదేం లైటింగ్‌?’ అని ఆర్కిటెక్ట్‌ ఆనందసాయిని ప్రశ్నించినట్టుగా తెలిసింది. అనంతరం ఆయన కొండపై వీవీవీఐపీ అతిథి గృహంలో మంత్రులు, ప్రభుత్వ విప్‌, అధికారులతో కలిసి ఆలయ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. కొండ కింద భూసేకరణ పూర్తయి, రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల పనులు బాగా సాగుతున్నాయని ప్రశంసించారు. కొండపైన పనులే ఎంత కాలం చేస్తారని అధికారులను నిలదీశారు. కొవిడ్‌ వంటి కారణాలను అధికారులు చెప్పగా ఇటువంటి వంకలు ఎంతకాలం చెప్తారన్నారు.  కొండకింద నిర్వాసితుల ప్రతినిధులతో మాట్లాడిన సీఎం అధికారులు ముందు చెప్పినట్టుగా న్యాయం చేస్తామన్నారు. 


తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్థలానికి స్థలం, పరిహారం అందజేస్తామని చెప్పారు. టెంపుల్‌ సిటీలో దుకాణాల కేటాయింపులో నిర్వాసితులకు ప్రాధాన్యం ఇచ్చే అంశాలను పరిశీలించాలని అధికారులను కోరారు. ఆర్టీసీ ఈడీ, డిపో మేనేజర్‌తో మాట్లాడుతూ బస్‌ టర్మినల్‌ ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టర్మినల్‌ ఏర్పాటుకు రూ.10 కోట్లు కావాలని కోరగా, అన్ని నిధులు అవసరం లేదని, పరిమితమైన నిధులతో నిర్మాణాలు చేపట్టాలని కోరినట్టుగా తెలుస్తోంది. డిపో నిర్మాణం కూడా వెంటనే చేపట్టాలని ఆదేశిస్తూ వీటికి రూ.3 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు.


అక్కడ ప్రైవేట్‌ ఆస్తులు ఉండొద్దు

కొండ చుట్టూ రింగ్‌రోడ్డు లోపల ఎటువంటి ప్రైవేటు ఆస్తులు, స్థలాలు ఉండవద్దని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది. సీఎం కొండచుట్టూ రింగురోడ్డును రెండు పర్యాయాలు కలియతిరిగారు. మధ్యమధ్యన మూడు ప్రదేశాల్లో కాన్వాయ్‌ దిగి పరిశీలించారు. మల్లాపురం మార్గంలో గౌడ సత్రం భవనం చూసి, ఇది ప్రైవేట్‌దా, ప్రభుత్వానిదా? అని ఆర్డీవో, తహసీల్ధార్‌, సర్వేయర్‌లను అడిగారు. ప్రైవేట్‌ స్థలమని, గౌడ కమ్యూనిటీ భవనమని వారు వివరించారు. రింగ్‌ రోడ్డు లోపల పూర్తిగా పవిత్ర స్థలంగా తీర్చిదిద్దాలని, లోపల ప్రైవేట్‌ ఆస్తులేవీ లేకుండా ఉండటానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాలని అధికారులకు సూచించారు. డీజీపీఎస్‌ సర్వే అత్యవసరంగా నిర్వహించాలని ఆదేశించారు. రింగ్‌రోడ్డు లోపల ఆలయానికి సంబంధించిన నిర్మాణాలు మాత్రమే ఉండాలని సూచించారు. గండి చెరువు వద్ద కొనసాగుతున్న నిర్మాణాలు, రహదారి విస్తరణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. రింగ్‌రోడ్డు లోపల ఐదు వేల కార్లు నిలిపేలా పార్కింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. 


ఆద్యంతం ఆగ్రహంగా

మార్చి 4న పర్యటించినపుడు కొండపై భక్తులకు మౌలిక సదుపాయాలకు అనుగుణంగా పనులు పూర్తి కావాల్సిందేనని, ప్రధానాలయ తుది మెరుగులు సైతం పూర్తి కావాలని ఆదేశించారు. అవేవీ పూర్తికాకపోవడం సీఎంకు కోపం తెప్పించింది. దీంతో ఆర్కిటెక్ట్‌ ఆనందసాయితో పాటు అధికారులపై పలుసార్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అధికారులతో రెండు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. సాయంత్రం 6గంటల 18 నిమిషాలకు చేరుకున్న సీఎం కేసీఆర్‌ రాత్రి 10.02 వరకు యాదాద్రిలో ఉన్నారు. హెలికాప్టర్‌లో వరంగల్‌ నుంచి వచ్చిన సీఎం యాదాద్రి నుంచి కారులో తిరిగి తన ఫామ్‌హౌ్‌సకు వెళ్లిపోయారు. 



Updated Date - 2021-06-22T08:01:12+05:30 IST