Advertisement
Advertisement
Abn logo
Advertisement
Mar 9 2021 @ 17:06PM

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి రావత్ రాజీనామా

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు గురించి బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో రావత్ గవర్నర్ బేబీ రాణి మౌర్యకు రాజీనామా సమర్పించారు. 


రాజీనామా చేసిన అనంతరం త్రివేంద్ర సింగ్ రావత్ మీడియాతో మాట్లాడుతూ, తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామాను గవర్నర్ బేబీ రాణికి సమర్పించినట్లు తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి నాలుగేళ్ళపాటు సేవ చేసే సువర్ణావకాశాన్ని పార్టీ తనకు ఇచ్చిందన్నారు. ఈ అవకాశం తనకు లభిస్తుందని తాను ఎన్నడూ అనుకోలేదన్నారు. ముఖ్యమంత్రిగా సేవ చేసే అవకాశం మరొకరికి ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు. బీజేపీ శాసన సభా పక్ష సమావేశం బుధవారం ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయంలో జరుగుతుందని తెలిపారు. 


త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామాతో ఆయన వారసుడిగా రాష్ట్ర మంత్రి ధన్ సింగ్ రావత్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యంవహిస్తున్న అజయ్ భట్, అనిల్ బలూనీ కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీలో ముందు వరుసలో ఉన్నారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం, కుమావూ ప్రాంతానికి చెందిన ఓ నేతను ఉప ముఖ్యమంత్రిగా నియమించేందుకు బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 


త్రివేంద్ర సింగ్ రావత్ ముఖ్యమంత్రిగా అనుసరించిన వైఖరి పట్ల ఉత్తరాఖండ్ బీజేపీలో అసంతృప్తి ఉన్నట్లు బయటపడటంతో ఆ పార్టీ అధిష్ఠానం ఇటీవల ఇద్దరు పరిశీలకులను పంపించింది. బీజేపీ ఉపాధ్యక్షుడు రమణ్ సింగ్, జనరల్ సెక్రటరీ దుష్యంత్ కుమార్ గౌతమ్‌లను పరిశీలకులుగా పంపించి, ఉత్తరాఖండ్‌లోని బీజేపీ నేతల అభిప్రాయాలను సేకరించింది. 


త్రివేంద్ర సింగ్ రావత్‌ను ఢిల్లీకి రావాలని బీజేపీ అధిష్ఠానం అంతకుముందు కోరినట్లు తెలుస్తోంది. ఆయన నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం నాలుగేళ్ళ పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. షెడ్యూలు ప్రకారం శాసన సభ ఎన్నికలు 2022లో జరగవలసి ఉంది. 


Advertisement
Advertisement