ముఖ్యమంత్రి గారూ.. సమస్యలను పరిష్కరించరూ!

ABN , First Publish Date - 2021-06-20T05:44:22+05:30 IST

కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ ఆదివారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లావాసులు కేసీఆర్‌ హామీలపై కొండంత ఆశలు పెట్టు కున్నారు.

ముఖ్యమంత్రి గారూ.. సమస్యలను పరిష్కరించరూ!
కొనసా..గుతున్న కాళేశ్వరం పనులు

జిల్లాలో మరుగున పడ్డ సీఎం కేసీఆర్‌ హామీలు
గత ఎన్నికల సమయంలో మెడికల్‌ కళాశాల, కాళేశ్వరం నీరు ఇస్తామని హామీ
మెడికల్‌ కళాశాలకు మొండిచేయి చూపిన టీఆర్‌ఎస్‌ సర్కారు   
ఆరేళ్లు అవుతున్నా కామారెడ్డి, ఎల్లారెడ్డిలకు అందని కాళేశ్వరం సాగు నీరు
నాగమడుగు ఎత్తిపోత ప్రాజెక్టును ప్రారంభించేది ఎప్పుడు?       
నిత్యం రోగులు, గర్భిణుల తాకిడితో కిక్కిరిసిపోతున్న జిల్లా కేంద్ర ఆసుపత్రి       
మూడేళ్లుగా నత్తనడకన కొనసాగుతున్న ఎంసీహెచ్‌ పనులు


కామారెడ్డి, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి):
కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ ఆదివారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లావాసులు కేసీఆర్‌ హామీలపై కొండంత ఆశలు పెట్టు కున్నారు. కొత్తగా కామారెడ్డి జిల్లా ఏర్పాటైంది. ఇక్కడి ప్రజలంతా వ్యవసాయంపైనే ఆధారపడుతుంటారు. టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కామారెడ్డి జిల్లా ఆవి ర్భవించింది. గత 6 సంవత్సరాల కాలంలో జిల్లా అభివృద్ధి అంతంత మాత్రమే. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు ప్రాజెక్టులు మంజూరు చేసినప్పటికీ సకాలంలో పూర్తికాక అసంపూర్తిగానే ఉండి పోయాయి. గత రెండు పర్యాయాల ఎన్నికల్లో జిల్లాలోని పలు అభివృద్ధి పనులపై స్వయంగా సీఎం కేసీఆర్‌ హామీల వర్షం కురిపించారు. ఆ హామీల్లో జిల్లాను ఎడ్యుకేషన్‌హబ్‌గా మారుస్తామని, మె డికల్‌ కళాశాలను ఏర్పాటు చేస్తామని, కామారెడ్డి, ఎల్లారె డ్డి రైతాంగానికి సాగునీరు అందిస్తామని, దోమకొండ డిగ్రీ కళాశాల మంజూరు చేస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చా రు. వీటిలో సాగునీటి ప్రాజెక్టుల హామీ నెరవేరుస్తున్నప్పటికీ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. మెడికల్‌ కళాశాల, ఎడ్యుకేషన్‌హబ్‌ హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. మరోవైపు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ప్రతిపక్ష పార్టీలతో పాటు విద్యార్థి సంఘాలు గత కొన్ని రోజలుగా ఆందోళనకు దిగుతున్నారు. నూతన కలెక్టరేట్‌ భవనం ప్రారంభోత్సవం సం దర్భంగా ఆదివారం జిల్లాకు వస్తున్న సీఎం కేసీఆర్‌ ఈ హామీలను నెరవేరుస్తారని ఏదో ప్రకటన చేస్తారని జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు ఎదురు చూస్తున్నారు.
కాళేశ్వరం పరుగులు పెట్టించేనా.. నాగమడుగుకు భూమి పూజ చేసేనా?
జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో రైతులు వర్షధార పంటలను సాగు చేస్తూనే బోరుబావులను నమ్ముకుని పంట లను పండిస్తున్నారు. వర్షాలు సమయానికి కురవకపోవడం బోరుబావులు ఎత్తిపోవడంతో, ప్రాజెక్టులు లేకపోవడంతో సాగు నీరు అందక వేసిన పంటలు ఎండి పోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలోని ఎల్లారె డ్డి, కామారెడ్డి డివిజన్‌లోని 2.50లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం రిజర్వాయర్‌ల పనులను గతంలోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టింది. టీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం కన్నా ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాణహిత -చేవేళ్ల ప్రాజెక్ట్‌లో భాగంగా 21,22 ప్యాకేజీల కాలువ పనులను ప్రారంభించింది. ఆ పనులను కాస్తా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం కింద చేర్చి రీ డిజైన్‌ పేరిట పనుల ను చేపట్టింది. ఈ రెండు డివిజన్లలో 5 రిజార్వాయర్‌లను నిర్మించి బీడు భూములకు సాగు నీరు అందించేందుకు పనులు కొనసాగుతున్నాయి.  కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగం గా జిల్లాలోని 21,22 ప్యాకేజీ పనులు టీఆర్‌ఎస్‌ అధికారం లోకి రాగానే రెండు సంవత్సరాల కాలంలోనే పూర్తి చేస్తామని ఈ రెండు నియోజకవర్గాల్లోని 2.50లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని కేసీఆర్‌ 2014, 2018 ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. కేసీఆర్‌ కోరిక మేరకు జిల్లా ప్రజలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించారు. కానీ ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న కాళేశ్వరం పనుల పరిస్థితి చూస్తే ఇంకా సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది ఇక జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం జుక్కల్‌ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌ మండలంలో నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ ఉన్నప్పటి కీ సాగునీరు అందని పరిస్థితి. దీంతో మద్నూర్‌, పిట్లం, పెద్దకొడప్‌గల్‌, నిజాంసాగర్‌ మండలాల్లోని సుమారు 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మంజూరు చేసింది. మరోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే పెండిం గ్‌లో ఉన్న నాగమడుగు ప్రాజెక్టును పూర్తి చేసి తానే ప్రారంభానికి వస్తానని కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో హా మీ ఇచ్చారు. జుక్కల్‌ నియోజకవర్గ ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టి హన్మంత్‌షిండేను గెలిపించారు. దీంతో నాగమ డుగు ఎత్తిపోతల ప్రాజెక్టును వీలైనంత త్వరగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తి చేయాలని నియోజకవర్గ ప్రజలు కేసీఆర్‌ పై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు రూ.470కోట్లతో చేపట్టనున్న నాగమడుగు ప్రాజెక్టుకు భూమి పూజ చేసి త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఏది ఏమైనా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం పనులు పూర్తి చేసి జిల్లాకు సాగునీటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజలకు వైద్యసేవలు మెరుగుపడేదెప్పుడో?
కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఏర్పడిన ప్రజలకు మాత్రం వైద్యసేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. కామారెడ్డి ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా పేరు మార్చారే తప్ప ఇంకా 100 పడకలతోనే ఆసుపత్రి కొనసాగుతోంది. ప్రస్తుతం ఆసుపత్రికి రోగులు, గర్భిణుల తాకిడి పెరిగిపోయింది. మాతాశిశు సంరక్షణకు సంబంధించి 2018లో అప్పటి వైద్యఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా దేవునిపల్లి శివారులోని డిగ్రీ కళాశాల వద్ద నిర్మాణం చేస్తున్న భవనం ఇంకా నత్తనడకనే కొనసాగుతోంది. ఈ భవన  నిర్మాణానికి రూ.17కోట్లు అంచనా వేయగా కేంద్రప్రభుత్వం రూ.7కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.10కోట్ల భాగస్వామ్యంతో నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కేంద్రం నిధులు మాత్రమే విడుదల కాగా భవనం సగం వరకే పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇంకా విడుదల కాకపోవడంతో పనులు 3 సంవత్సరాల నుంచి సాగుతునే ఉన్నాయి. అయితే బాన్సువాడ ప్రాంతంలో ఇప్పటికే మతాశిశు సంరక్షణ ఆసుపత్రి నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న ఎంసీహెచ్‌పై మాత్రం దృష్టి సారించడం లేదని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి ఇరుకుగా మారడంతో సిటీస్కాన్‌, ఎంఆర్‌ఐ ఏర్పాటు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.  
ఎడ్యుకేషన్‌ హబ్‌ ఏమాయే.. మెడికల్‌ కళాశాల మంజూరు చేసేనా?
గత 2014 ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడితే కామారెడ్డి జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి నెరవేర్చుకున్నారు. 2018ఎన్నికల సభలో మరోసారి గెలిపిస్తే కామారెడ్డికి మెడికల్‌ కళాశాలతో పాటు ఎడ్యుకేషన్‌లు హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు. గతంలో లాగే కేసీఆర్‌ ఈ సారి కూడా మాట నిలబెట్టుకుంటారని ఆశతో కామారెడ్డి ప్రజలు మరోసారి గంప గోవర్ధన్‌కు అవకాశం ఇచ్చి గెలిపించారు.

Updated Date - 2021-06-20T05:44:22+05:30 IST