ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2021-06-22T06:38:38+05:30 IST

జిల్లాలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రానున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనకు సర్వం సిద్ధం చేయాలని, స్వాగత ఏర్పాట్లు ఘనంగా ఉండాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో కేసీఆర్‌ పర్యటనపై సమీక్ష నిర్వహించారు.

ముఖ్యమంత్రి పర్యటనకు సర్వం సిద్ధం చేయాలి
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

సిరిసిల్ల, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి):  జిల్లాలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రానున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనకు సర్వం సిద్ధం చేయాలని, స్వాగత ఏర్పాట్లు ఘనంగా ఉండాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో కేసీఆర్‌ పర్యటనపై సమీక్ష నిర్వహించారు.  ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి వచ్చే సమయానికి అభివృద్ధి పనుల వద్ద అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా శ్రద్ధ తీసుకోవాలన్నారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సముదాయం, అంతర్జాతీయ డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రం, ఇందిరమ్మ కాలనీ వద్ద బైపాస్‌ రోడ్డ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సిరిసిల్లలోని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించి విద్యుత్‌ సౌకర్యం, కల్పించాలన్నారు. ఇళ్ల చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసి మొక్కలు నాటాలన్నారు. సమీకృత కలెక్టరేట్‌ భవనంలో పూర్తిగా ప్లాంటేషన్‌ చేయాలని ఆదేశించారు. సిరిసిల్ల పట్టణం పద్మశాలి భవన నిర్మాణ పనులకు కేసీఆర్‌ శంకుస్థాపన  చేయనున్నట్లు తెలిపారు.  ఎగువ మానేరు నుంచి దిగువ మానేరు వరకు చెక్‌డ్యాంల నిర్మాణం దసరా వరకు పూర్తి చేసి మానేరు నది జీవనదిలా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సీఎం కేసీఆర్‌ కార్యదక్షతతో వానాకాలం పంటకు నీళ్లు వచ్చాయన్నారు. జూలై మొదటి వారంలో ఎగువ మానేరు నుంచి నీటిని విడుదల చేయాలని  అధికారులను ఆదేశించారు. 13 వేల ఎకరాలకు చివరి అయకట్టు వరకు నీరు అందాలన్నారు. ప్రాజెక్ట్‌ చరిత్రలోనే మొదటి సారిగా మండు వేసవిలో కాళేశ్వరం జలాలతో ఎగువ మానేరు నిండిందని ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 2.2 టీఎంసీల నీరు ఉందని అన్నారు. సిరిసిల్ల రైతాంగం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యావాదాలు తెలిపారు. దసరా నాటికి మల్కపేట రిజర్వాయర్‌, ఇతర ఇరిగేషన్‌ పనులు పూర్తి చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అరవింద్‌కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ,  కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎస్పీ రాహుల్‌హెగ్డే, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఆర్డీవో శ్రీనివాసరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, ఆర్‌అండ్‌బీ ఈఈ కిషన్‌రావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T06:38:38+05:30 IST