Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరద బాధితులను ఆదుకోండి

  • విజ్ఞప్తులపై ఉదారంగా స్పందించండి
  • పంటల నష్టం అంచనా వేయండి
  • గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోండి
  • కలెక్టర్లతో జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ 
  • ఉదారంగా సాయం చేయండి
  • కేంద్ర బృందానికి సీఎం జగన్‌ విజ్ఞప్తి
  • నిరాశ్రయులకు తాత్కాలిక వసతి కల్పించాలి.. కలెక్టర్లతో ముఖ్యమంత్రి 


అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): వరద ప్రాంతాల్లో  క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు బాధితుల విజ్ఞప్తులపై ఉదారంగా స్పందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇళ్లు లేని వారికి తాత్కాలిక వసతి ఏర్పాటు చేయాలని, కనీస సదుపాయాలు ఉండేలా చూడాలని సూచించారు. సోమవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వరద బాధిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై ఆరా తీశారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించారు. ‘‘పంట నష్టంపై అంచనా వేసి సోషల్‌ ఆడిట్‌ కూడా నిర్వహించాలి. పూర్తిగా ధ్వంసమైన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లను మంజూరు చేయాలి. వెంటనే పనులు కూడా మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలి. చెరువుకు, చెరువుకు మధ్య అనుసంధానం ఉండాలి. చెరువులు నిండగానే అదనంగా వచ్చే నీటిని నేరుగా కాల్వలకు పంపించే వ్యవస్థ ఉండాలి. భవిష్యత్‌లో దీనిపై దృష్టి పెట్టండి.  అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే చాలా చోట్ల తాగునీటి సరఫరాకు ఆధారమైన చెరువులకు గండ్లు పడ్డాయి. వీటిపై ఆధారపడిన పట్టణాలు, గ్రామాల్లో తాగునీటి కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. వచ్చే వేసవిని కూడా దృష్టిలో ఉంచుకుని, ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలి. నిత్యావసరాలు అందించిన ప్రతి కుటుంబానికి అదనపు సహాయం రూ.2 వేలు అందించాలి. ఆర్బీకేల్లో విత్తనాలు ఉంచి, రైతులకు వెంటనే పంపిణీ చేసేలా చర్యలు చేపట్టండి’’ అని సీఎం ఆదేశించారు. 


గతంలో ఎన్నడూ ఇలా చర్యలు తీసుకోలేదు 

వరద  ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు ఇంతటి శరవేగంగా చర్యలు తీసుకోవడమన్నది గతంలో ఎన్నడూ జరగలేదని సీఎం అన్నారు. గతంలో కనీసం నెల రోజులు పట్టేదని, ఇప్పుడు వారంలోనే బాధితులకు సహాయం అందించగలిగామని చెప్పారు. కలెక్టర్లు, ఇతర అధికారులు బాగా పని చేసి, పరిహారాన్ని ఇంత వేగంగా అందిస్తే, దానిపైనా కూడా బురద జల్లుతున్నారని విమర్శించారు. ‘‘ఆ పెద్ద మనిషివి బురద రాజకీయాలు. నష్టం రూ.6 వేల కోట్లు అయితే, ఇచ్చింది రూ.34 కోట్లేనని విమర్శలు చేస్తున్నారు. జరిగిన నష్టంలో 40ు రోడ్లు, 30ు పంటలు, 18ు ప్రాజెక్టులకు నష్టం జరిగింది. హుద్‌హుద్‌ తుఫాన్‌కు రూ.22 వేల కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. కానీ ఇచ్చింది రూ.550 కోట్లే. అదంతా కేంద్రం నుంచి వచ్చిందే’’ అని జగన్‌ అన్నారు.

Advertisement
Advertisement