Abn logo
May 1 2021 @ 17:28PM

కరోనా బారిన పడ్డ ముఖ్యమంత్రులు వీరే.. ఆ సీఎంకు రెండు సార్లు!

ఇంటర్నెట్ డెస్క్: ప్రజల నిర్లక్ష్యం..ప్రభుత్వ వైఫల్యం.. కారణమేదైనా గానీ కరోనా ‘అల’జడి మళ్లీ మొదలైంది. వదల బొమ్మాళీ వదలా అంటూ కరోనా మరోమారు దేశ ప్రజలను పీడిస్తోంది. ఎవ్వరూ ఊహించని స్థాయిలో ప్రస్తుతం వ్యాధి వ్యాప్తి జరుగుతోంది. రోజులు గడుస్తున్న తీవ్రత పెరుగుతూనే ఉంది. రోజువారి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ప్రపంచ రికార్డులు బద్దలుకొడుతోంది. ఆస్పత్రులో బెడ్లు దొరకక, దొరికినా.. ఆక్సిజన్ అందక..కొవిడ్ రోగులు నానా అగచాట్లు పడుతున్నారు.


సరైన చికిత్స అందక కొందరు అంబులెన్సుల్లో, మరి కొందరు ఆస్పత్రుల్లో మరణిస్తున్న హృదయ విదారక దృశ్యాలు సాధారణమైపోయాయి. తొలి అలలోపడి సామాన్యులు కొట్టుకుపోతే.. ఈ మారు పెద్దలు, ప్రముఖలు కూడా టార్గెట్‌గా మారారు. పలువురు రాజకీయ నాయకులతో పాటూ అరడజనుకు పైగా ముఖ్యమంత్రులు కరోనా కాటుకు గురయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఏకంగా రెండు మార్లు కరోనా బారినపడ్డారు. అసలు సీఎంలు..ఎప్పుడు కరోనా బారినపడ్డారు? ఎప్పుడు కోలుకున్నారు? ఈ వివరాలు మీకోసం..

తెలంగాణా సీఎం కేసీఆర్..

తెలంగాణా సీఎం కే. చంద్రశేఖర్ రావు..కొవిడ్ 2.0లో కరోనా బారినపడ్డారు. ఏప్రిల్ 18న ఆయన కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉండటంతో సీఎం ఎర్రవెల్లిలో ఉన్న తన ఫామ్‌హస్‌లోనే ఉంటూ  చికిత్స తీసుకున్నారు. ఒకటి రెండు దఫాలు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకున్నారు. కాగా.. బుధవారం నాడు సీఎం కేసీఆర్‌కు మరోమారు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు జరపగా.. నెగిటివ్ అని తేలింది. వైద్యులు ఆయనకు ఆర్‌టీపీసీఆర్ పరీక్ష నిర్వహించారు. దీని ఫలితాలు త్వరలో తెలుస్తాయి. అయితే..ర్యాపిడ్‌లో నెగెటివ్ అని రావడంతో..సీఎం రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్

తాను కరోనా బారినపడ్డట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏప్రిల్ 14న ప్రకటించారు. అంతకుముందు తనను కలిసిన అధికారుల్లో కొందరికి కరోనా పాటిజిట్ అని తేలడంతో..ఏప్రిల్ 13న ఆయన ఐసోలేషన్‌లోని వెళ్లారు. ఆ మరుసటి రోజే సీఎం కూడా కరోనా బారినపడ్డట్టు తేలింది. కాగా.. ప్రస్తుతం  సీఎం కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఏప్రిల్ 30న జరిగిన  పరిక్షల్లో నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. ఐసోలేషన్‌లో ఉండగా ముఖ్యమంత్రి తన విధులను ఆన్‌లైన్ ద్వారానే నిర్వర్తించారు.

కేరళ సీఎం పినరయి విజయన్

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఏప్రిల్ 8న కరోనా బారినపడ్డారు. అంతకుమునుపే అంటే..దాదాపు నెల రోజుల క్రితమే ఆయన టీకా తొలి డోసు తీసుకున్నారు. ఆ తరువాత సీఎం.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 8న కరోనా బారినపడ్డట్టు వెల్లడైంది.  అనంతరం.. చికిత్స కోసం సీఎం కోజికోడ్ ఆస్పత్రిలో చేరారు. ఏప్రిల్ 14న మరోసారి జరిపిన కరోనా పరీక్షలో ఆయనకు నెగెటివ్ అని తేలింది. దీంతో.. వైద్యులు ఆయన్ను డిశ్చార్జ్ చేశారు. ఇది మరో వివాదానికి దారితీసింది. కరోనా చికిత్స ప్రొటోకాల్ ఉల్లంఘించారంటూ సీఎంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆస్పత్రిలో చేరిన ఆరు రోజులకే డిశ్చార్చ్ ఎలా అవుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే..వైద్యులు మాత్రం ఇది అవాస్తవమని స్పష్టం చేశారు. ఏప్రిల్ 4నే ఆయనలో కరోనా లక్షణాలు కనిపించాయినే అందుకే ఏప్రిల్ 14న అంటే..నిబంధనల ప్రకారం 10 రోజుల తరువాతే పరిక్షలు నిర్వహించామని స్పష్టం చేశారు.

త్రిపుర సీఎం బిప్లాబ్ కుమార్ దెబ్

ఏప్రిల్ 7న కరోనా బారిన పడిన త్రిపుర సీఎం బిప్లాబ్..ఆ తరువాత కోలుకున్నారు. కొద్దిరోజుల తర్వాత జరిపిన పరిక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చిందని, దీంతో ముఖ్యమంత్రి పూర్థి స్థాయిలో కోలుకున్నారని సీఎం కార్యాలయం ప్రత్యేకాధికారి ప్రకటించారు. కాగా.. సీఎంతో పాటూ ఆయన భార్య కూడా నెగెటివ్ అని తేలింది. కాగా..కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో సీఎం భార్య రెండు సార్లు కరోనా బారినపడ్డారు. గతేడాది ఆగస్టులో తొలిసారిగా ఆమె కరోనా పాజిటివ్ అని తేలిసింది. ఈ మారు భర్తతో పాటూ మరోసారి కరోనా బారిన పడి ఆ తరువాత కోలుకున్నారు. 

కర్ణాటక సీఎం యడియూరప్ప..

కర్ణాటక సీఎం యడియూరప్ప ఏకంగా రెండుసార్లు కరోనా బారినడ్డారు. ఏప్రిల్ 16న సీఎంకు కరోనా నిర్ధారణ పరిక్షలు జరపగా పాజిటివ్ అని తేలింది. అనంతరం ముఖ్యమంత్రి..ఆస్పత్రిలో చికిత్స పొంది ఏప్రిల్ నెల చివరిలో డిశ్చార్జ్ అయ్యారు. అయితే..మార్చి నెలలోనే సీఎం కరోనా టీకా తొలి డోసుతీసుకున్నారు. అంతేకాకుండా..యడియూరప్ప కరోనా బారిన పడటం ఇది రెండోసారి. గతేడాది ఆగస్టులో సీఎంకు తొలిసారిగా కరోనా సోకింది. ఆ తరువాత ఆస్పత్రిలో తొమ్మిది రోజుల చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఐసీఎమ్మార్ అధ్యయనం ప్రకారం..కరోనా బారినపడి కోలుకున్న వారికి రెండో మారు కరోనా సోకే అవకాశం 4.5 శాతంగా ఉంది. ఇది అత్యంత అరుదుగా మాత్రమే జరిగే ఘటన అని నిపుణులు చెబుతున్నారు. 

రాజస్థాన్ ముఖ్యమంత్రి ఆశోక్ గెహ్లాట్

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఏప్రిల్ 29న కరోనా బారినపడ్డారు. ఆయన భార్యకు కరోనా పాజిటివ్ అని తేలిన మరుసటి రోజే సీఎంకు పాజిటివ్ అన్న విషయం వెలుగులోకి వచ్చింది. అయితే..తనకు కరోనా వ్యాధి లక్షణాలేవీ లేవని, ఐసోలేషన్‌లో ఉంటూనే ఆన్‌లైన్ విధానంలో తన విధులు నిర్వర్తిస్తానని సీఎం పేర్కొన్నారు. 

హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్

హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ గతేడాది ఆగస్టు 25న కరోనా బారినపడ్డారు. స్వల్పంగా జ్వరం, ఒళ్లునెప్పులూ కలగడంతో ఆయన ముందుజాగ్రత్తగా ఆస్పత్రిలో చేరారు. 17 రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం.. కొద్ది రోజుల పాటు ఇంటిలోనే విశ్రాంతి తీసుకుని అనంతరం తన అధికారి విధుల్లో నిమగ్నమయ్యారు. 

Advertisement
Advertisement