మోగిన నగారా..!

ABN , First Publish Date - 2021-02-27T15:29:09+05:30 IST

రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆసక్తిగా ఎదురు చూసిన ముహూర్తం రానే వచ్చింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్‌ అరోరా శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో విడుదల...

మోగిన నగారా..!

ఎన్నికల షెడ్యూల్‌...

నామినేషన్ల స్వీకరణ ప్రారంభం ........ మార్చి 12

ముగింపు .......................................  మార్చి 19

నామినేషన్ల పరిశీలన  ...................... మార్చి 20

ఉపసంహరణ ................................ మార్చి 22

పోలింగ్‌......................................... ఏప్రిల్‌ 6

కౌంటింగ్‌, ఫలితాలు....................... మే 2


చెన్నై(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆసక్తిగా ఎదురు చూసిన ముహూర్తం రానే వచ్చింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల  సంఘం ప్రధానాధికారి సునీల్‌ అరోరా శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎన్నికల నిబంధనలు అమలులోకి వచ్చినట్లు ఆయన ప్రకటించారు. ఆ మేరకు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఏప్రిల్‌ ఆరున జరుగనున్నాయి. మే2న కౌంటింగ్‌ జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు. రాష్ట్రంలో జయలలిత మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి పళనిస్వామి నాయకత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వ పదవీ కాలం మే 24తో ముగియనుంది. గత రెండు నెలలుగా అన్నాడీఎంకే తరఫున  సీఎం ఎడప్పాడి, డీఎంకే తరఫున ఆ పార్టీ  అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ తదితర నాయకులు రాష్ట్ర మంతటా సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం సాగించారు.  


కన్నియాకుమారి ఉప ఎన్నిక 

రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు కన్నియాకుమారి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగనుంది. ఆ నియోజకవర్గ  ఎంపీ వసంత్‌కుమార్‌ కరోనాకు గురై మృతి చెందటంతో ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. కరోనా లాక్‌డౌన్‌, వైరస్‌ నిరోధక నిబంధనల ప్రకారం శాసనసభ ఎన్నికలు జరుగనుండటంతో రాష్ట్రంలో 88,936 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సునీల్‌ అరోరా ప్రకటించారు. ఇదే విధంగా నామినేషన్ల సమర్పణపై కఠిన నిబంధనలు విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. నామినేషన్‌ వేసేందుకు వెళ్లే అభ్యర్థితో ఇద్దరిని మాత్రమే లోనికి అనుమతిస్తామని, ఆన్‌లైన్‌లో కూడా అభ్యర్థులు నామినేషన్లు వేయవచ్చని ఆయన వివరించారు.  అభ్యర్థితో పాటు ఐదుగురు మాత్రమే ఇంటింటి ప్రచారం నిర్వహించాల్సి వుంటుందని చెప్పారు. ఎన్నికల సంధర్భంగా ఓటర్లకు నగదు పంపిణీ తదితర అక్రమాలను నిరోధించేందుకు కేంద్ర ఎన్నికల పర్యవేక్షకుడిగా అలోక్‌ వర్థన్‌, ప్రత్యేక పర్యవేక్షకుడిగా దేవేంద్రకుమార్‌, ఎన్నికల ఖర్చుల పర్యవేక్షకుడిగా మదుమాదన్‌ బాలకృష్ణన్‌ను నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర పాలితమైన పుదుచ్చేరిలో ఏప్రిల్‌ ఆరున ఒకే విడతగా ఎన్నికలు జరుగు తాయని ఆయన చెప్పారు. తమిళనాడులో ఎన్నికల తేదీల ప్రకారమే ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-02-27T15:29:09+05:30 IST