చిన్నారి పెళ్లికూతురు

ABN , First Publish Date - 2021-06-24T07:04:24+05:30 IST

ఆటపాటలతో సరదాగా సాగాల్సిన పసిబాల్యం మూడు ముళ్లతో బందీ అయిపోతోంది. కడు పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, అభద్రతా భావంతో తల్లిదండ్రులు చిన్నారిని పెళ్లి కూతురును చేసి చేతులు దులుపుకుంటున్నారు.

చిన్నారి పెళ్లికూతురు

కరోనా సమయంలో పెరిగిపోతున్న బాల్య వివాహాలు

మారుమూల గ్రామాల్లో గుట్టు చప్పుడు కాకుండా పెళ్లిళ్లు

తల్లిదండ్రుల్లో పెరుగుతున్న అభద్రతా భావం

జిల్లాలో కొరవడుతున్న అవగాహన


ఆదిలాబాద్‌: ఆటపాటలతో సరదాగా సాగాల్సిన పసిబాల్యం మూడు ముళ్లతో బందీ అయిపోతోంది. కడు పేదరికం, ఆర్థిక ఇబ్బందులు, అభద్రతా భావంతో తల్లిదండ్రులు చిన్నారిని పెళ్లి కూతురును చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదనే సదుద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. దీంతో బాల్య వివాహాలు కొంత తగ్గుముఖం పట్టినట్టే పట్టి మళ్లీ కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నమై పోవడంతో బాల్య వివాహాలు తరచూ వెలుగు చూస్తునే ఉన్నాయి. దీనికి తోడు పాఠశాలల్లో, కళాశా లలు ఏడాదిన్నర కాలంగా మూతబడి పోవడంతో చదువులపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఉన్నత చదువులు చదివించే స్థోమత లేక సమాజం పట్ల అభద్రత భావంతో చిన్నారి పెళ్లి కూతుళ్లను పెళ్లి పీటలెక్కిస్తున్నారు. తాజాగా ఏదో మారుమూల గ్రామంలో బాల్య వివాహం జరిగిందంటే పొరపడినట్లే. ఏకంగా ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని స్థానిక అశోక్‌రోడ్డులో గల కన్యకాపరమేశ్వరి ఆలయంలో బాల్య వివాహానికి ఏర్పాట్లు జరగడం అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. బాల్య వివాహం సమాచారం తెలుసుకున్న పోలీసులు, చైల్డ్‌ ప్రోటక్షన్‌ అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది హుటాహుటిన ఆలయానికి వెళ్లి వివాహాన్ని అడ్డుకున్నారు. ఇలా కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు విధించిన లాక్‌డౌన్‌ సమయంలో జిల్లాలో మరెన్నో బాల్య వివాహాలు జరిగి ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో గడిచిన రెండేళ్లలో 155 బాల్య వివాహాలు జరగగా ఈ ఏడు జనవరి నుంచి జూన్‌ వరకు 3 బాల్య వివాహాలు జరిగినట్లు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. అవగాహన లేక పోవడం, మంచి సంబంధాలు రావడం, ఆర్థిక ఇబ్బందులతోనే తల్లిదండ్రులు తమ పిల్లలకు వివాహాలు చేసేందుకు తొందరపడుతున్నట్లు తెలుస్తోంది.


బాధ్యత తీరి పోతుందని..

ఆడపిల్ల అనగానే కొంత మంది తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు. దీంతో చేతికొచ్చిన ఆడపిల్లకు మూడు ముళ్లు వేసి బాధ్యతను తీర్చు కునేందుకు ఆరాటపడుతు న్నారు. తల్లిదండ్రుల అభ ద్రత భావంతో ఎక్కు వ మంది ఆడపిల్లలు చదువులకు దూరమవుతున్నారు. ఏటా పెరిగిపోతున్న ధరలతో పెళ్లిలు చేయడం మరింత కష్టమవుతుందన్న ఉద్దేశ్యంతో 18 ఏళ్లలోపు పిల్లలకు పెళ్లిలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే సమాజంలో జరుగుతున్న అత్యాచారఘటనలతో మరింత భయాందోళనకు లోనవుతున్నారు. పెళ్లి చేయడం ఆలస్యమైతే ఎప్పుడు ఏం జరుగుతుందోననే భావన తల్లిదండ్రులను వెంటాడుతూనే ఉంది. పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందనే భావనతో ఎక్కువ మంది తల్లిదండ్రులు చిన్న వయస్సుల్లోనే తమ పిల్లలకు పెళ్లీలు చేస్తున్నారు.


వెలుగు చూడనివి మరెన్నో..

జిల్లాలోని మారుమూల గ్రామాల్లో ఏటా ఎన్నో బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం. కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో బంధుమిత్రులతో పెళ్లీలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పెళ్లి పత్రికలు ముద్రించకుండానే పెళ్లిలు చేస్తున్నారు. కేవలం దగ్గరి బంధువులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందిస్తూ ఎలాంటి హడావిడి లేకుండానే పెళ్లిలు జరుపుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు, పోలీసుల దృష్టికి రాక పోవడంతో గుట్టుచప్పుడు కాకుండా బాల్య వివాహాలు జరిగి పోతూనే ఉన్నాయి. ఎవరైనా సమాచారం అందిస్తేనే అధికారులు హడావిడి చేస్తున్నారే తప్ప క్షేత్ర స్థాయిలో నిఘా సారించ డం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. పర్యవేక్షణ లేక పోవడంతోనే బాల్య వివాహాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడడం లేదంటున్నారు. ప్రేమ వ్యవహారాలతో ఎక్కడ పరువు పోతుందనే ఉద్దేశ్యంతో మైనర్‌ బాలికలకు తొందరపడి పెళ్లిలు చేస్తున్నారు. అలాగే మంచి సంబంధాలను వదులుకునేందుకు ఇష్టం లేక తమ పిల్లలను పెళ్లి పీటలెక్కించేందుకు కొందరు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు.


అవగాహన ఏది..?

సమాజం పట్ల అవగాహన ఉండి విద్యావంతులైన పట్టణవాసులే బాల్య వివాహాలకు సిద్ధమవుతున్నారంటే ఏ మేరకు అవగాహన ఉందో తెలుస్తూనే ఉంది. అధికారులు కేవలం మారుమూల గ్రామాలపైనే దృష్టి సారిస్తున్నా పట్టణ ప్రజల్లో అవగాహన లేకుండానే పోయింది. గ్రామాల్లో ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివిధ కార్యక్రమాల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాల్సి ఉంది. స్థానిక భాషల్లోనూ అవగాహన కార్యక్రమాలు చేపడితే మంచి ఫలితాలుంటాయి. బాల్య వివాహాల ద్వారా దారి తీసే అనర్థాలపై ప్రజలకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాల్సి ఉంది. సమాజం పట్ల బాధ్యత కలిగి ఎవరైనా బా ల్య వివాహాలపై 1098-100 నెంబర్‌లకు సమాచారం అందించాలి. తల్లిదండ్రుల్లో అభద్రత భావాన్ని పొగొట్టే విధంగా కౌన్సెలింగ్‌ ఇస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - 2021-06-24T07:04:24+05:30 IST