Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆంధ్రా ఆసుపత్రిలో 30 మంది చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు

విజయవాడ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రా హాస్పిటల్స్‌లోని 22వ చిన్నపిల్లల ఉచిత గుండె శస్త్రచికిత్సల శిబిరంలో వారం పాటు 30 మంది పేద చిన్నారులకు అతిక్లిష్టమైన గుండె ఆపరేషన్లు చేశామని ఆసుపత్రి చిల్డ్రన్స్‌ సర్వీసెస్‌ చీఫ్‌ డాక్టర్‌ పీవీ రామారావు తెలిపారు. ఆసుపత్రిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆపరేషన్లు చేసిన చిన్నారులను చూపిస్తూ.. కొంతమందికి అత్యంత కష్టతరమైన ట్రాన్స్ఫోసిషన్‌ ఆఫ్‌ గ్రేట్‌ ఆర్టెరీస్‌, టెట్రాలజీ ఆఫ్‌ ఫాలో, టోటల్‌ ఎనమలస్‌ పల్మనరీ వీనస్‌ కనెక్షన్‌, ఆలకాపా, కంప్లీట్‌ ఏవీఎస్డీ, డబుల్‌ అవుట్‌లెట్‌ రైట్‌ వెంట్రికల్‌కు సంబంధించిన ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించినట్లు వివరించారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, యూకేకు చెందిన హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌ చారిటీ సహకారంతో 2015 నుంచి ఇప్పటివరకు 22 దఫాలుగా 2,200 మంది చిన్నపిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లను చేశామన్నారు. ఇంగ్లండ్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లివర్‌పూల్‌, బ్రామ్‌టన్‌, ఆక్స్‌ఫర్డ్‌తో పాటు లండన్‌ నుంచి వైద్యనిపుణులు వచ్చి తమ ఆసుపత్రిలో చిన్నారులకు గుండె ఆపరేషన్లను వందశాతం విజయవంతంగా చేస్తున్నారని తెలిపారు. ఇక మీదట ప్రతి మూడు నెలలకోసారి ఆపరేషన్లు చేస్తారని చెప్పారు. ప్రస్తుతం నెలకు 50 ఆపరేషన్ల చొప్పున సంవత్సరానికి 600 మంది పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని, ఈ సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేస్తామన్నారు. తమ ఆసుపత్రిలో పీడియాట్రిక్‌ కార్డియాలజీ టీమ్‌, పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ టీమ్‌లు సమన్వయంతో పనిచేస్తుండటం వల్లే రాష్ట్రంలోనే తొలిసారిగా పెద్దఎత్తున చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లను నిర్వహిస్తున్నామన్నారు. ఆంధ్ర ఆసుపత్రి పీడియాట్రిక్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ విక్రమ్‌, కార్డియాక్‌ సర్జన్‌ డాక్టర్‌ దిలీప్‌, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రీమన్నారాయణ, కార్డియాక్‌ ఎనస్తిటిస్ట్‌ డాక్టర్‌ రమేశ్‌, పీడియాట్రిక్‌ కార్డియాక్‌ ఇంటెన్సివిస్ట్‌ డాక్టర్‌ కృష్ణప్రసాద్‌, విదేశాల నుంచి వచ్చిన వైద్యనిపుణులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement