హతవిధీ! రెండు కుటుంబాల మధ్య కొట్లాట.. చివరికి..

ABN , First Publish Date - 2021-01-17T06:08:15+05:30 IST

వివాదం చినికిచినికి గాలి వానలా మారింది..

హతవిధీ! రెండు కుటుంబాల మధ్య కొట్లాట.. చివరికి..
గ్రామంలో విచారిస్తున్న పోలీసులు

రెండు కుటుంబాల మధ్య కొట్లాటలో చిన్నారి మృత్యువాత
మురపాకలో ఘటన


లావేరు(శ్రీకాకుళం): చిన్నపాటి వివాదం చినికిచినికి గాలి వానలా మారింది. ఇరు కుటుంబాల మధ్య కొట్లాటకు దారితీసింది. రెండేళ్ల బాలుడి ఉసురు తీసింది. లావేరు మండలం మురపాకలో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి.  మురపాకలో నివాసముంటున్న కాకి సత్యవతి ఇంటికి శుక్రవారం రాత్రి ఆటోపై బంధువులు వచ్చారు. ఆటోను రహదారిపై పెట్టి ఇంటికి వెళ్లిపోయారు. ఇంతలో అదే గ్రామానికి చెందిన వడ్డి కామయ్య వచ్చి ఆటో రహదారికి అడ్డంగా పెట్టినందుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు. సత్యవతితో వాదనకు దిగాడు. అది తీవ్రమై ఇరు కుటుంబాల మధ్య కొట్లాటకు దారి తీసింది.


అదే సమయంలో సత్యవతి చెల్లెలు సంతు తన కుమారుడు ప్రవీణ్‌కుమార్‌ (2)ను ఎత్తుకొని అక్కడకు వచ్చింది. కోపంతో ఉన్న కామయ్య చెక్కతో కొట్టడంతో ప్రవీణ్‌కుమార్‌కు తీవ్ర గాయమైంది. అపస్మారకస్థితికి చేరుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో రాగోలు జెమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ప్రవీణ్‌కుమార్‌ మృతిచెందాడు. దీంతో తల్లి సంతు గుండెలలిసేలా రోదిస్తోంది. సంతుకు కొన్నేళ్ల కిందట పొందూరు మండలం కొంచాడకు చెందిన ముగడ శ్రీనుతో వివాహమైంది.


ఇటీవల దంపతుల మధ్య గొడవలు జరుగుతుండడంతో కన్నవారింట్లోనే ఉంటోంది. అక్క సత్యవతి ఇంటికి రాగా..ఇంతలోనే వివాదం జరగడం...కుమారుడు మృత్యువాత పడడంతో కన్నీరు మున్నీరవుతోంది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం శ్రీకాకుళం డీఎస్సీ మహేంద్ర, జేఆర్‌పురం సీఐ చంద్రశేఖర్‌, లావేరు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌లు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు. 

Updated Date - 2021-01-17T06:08:15+05:30 IST