కడుపులో బిడ్డ క్షేమం!

ABN , First Publish Date - 2020-04-14T05:30:00+05:30 IST

గర్భిణి నుంచి గర్భస్థ శిశువుకు, తల్లి నుంచి పసికందులకు కరోనా వైరస్‌ సోకే వీలు ఉందా? అనే అంశాల గురించి ఇప్పటివరకూ వెలుగులోకి వచ్చిన కేసుల ఆధారంగా కొన్ని విషయాలు...

కడుపులో బిడ్డ క్షేమం!

గర్భిణి నుంచి గర్భస్థ శిశువుకు, తల్లి నుంచి పసికందులకు కరోనా వైరస్‌ సోకే వీలు ఉందా? అనే అంశాల గురించి ఇప్పటివరకూ వెలుగులోకి వచ్చిన కేసుల ఆధారంగా కొన్ని విషయాలు స్పష్టం అవుతున్నాయి. అవేంటంటే....


కరోనా వైరస్‌ విషయంలో గర్భిణి నుంచి గర్భస్థ శిశువుకు వైరస్‌ సోకే వీలు లేకపోయినా, ప్రసవం తర్వాత తల్లి నుంచి బిడ్డకు వైరస్‌ సోకే వీలు లేకపోలేదు. గర్భస్థ శిశువుకు ఇన్‌ఫెక్షన్లు సోకకుండా సహజసిద్ధమైన రక్షణ వ్యవస్థలు పని చేస్తాయి. కానీ ప్రసవం తర్వాత ఆ రక్షణ తల్లి చేపట్టక తప్పదు. 


గర్భిణుల నుంచి గర్భస్థ పిండానికి ఇన్‌ఫెక్షన్లు సోకకుండా సహజసిద్ధమైన రక్షణ వ్యవస్థ పని చేస్తూ ఉంటుంది. ఎలాంటి వైరస్‌ మనిషికి సోకాలన్నా కణాలలోని ‘రిసెప్టార్స్‌’ అవసరం. ప్రస్తుత కరోనా వైరస్‌ ‘ఎ.సి.ఇ 2’ అనే యాంజియోటెన్సిన్‌ కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ 2 అనే రిసెప్టార్ల ద్వారా సంక్రమిస్తోంది. అయితే గర్భస్థ పిండాన్నీ, గర్భిణినీ కలిపే మాయలో ఈ రిసెప్టార్లు తక్కువ. కాబట్టే గర్భిణి నుంచి గర్భస్థ పిండానికి ఈ వ్యాధి సోకడం లేదని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. అయితే గర్భిణుల మీద జరిపిన అధ్యయనం ద్వారా ఒక విషయం స్పష్టమైంది. బిడ్డ చుట్టూ ఉన్న ఉమ్మనీరు, బిడ్డ గొంతులోని శ్వాబ్‌ (నమూనా), బిడ్డ రక్తపరీక్ష చేసినప్పుడు తల్లి ద్వారా గర్భంలోని బిడ్డకు కరోనా సోకలేదని నిర్ధారణ అయింది. అయితే ప్రసవం జరిగిన తర్వాత తల్లి నుంచి బిడ్డకు ఈ వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రసవం తర్వాత తల్లి నుంచి బిడ్డను  వేరు చేయడం ద్వారా వైరస్‌ సోకకుండా చేయవచ్చు.

 

డాక్టర్‌ ఫమీదా బాను,

సీనియర్‌ గైనకాలజిస్ట్‌ 


Updated Date - 2020-04-14T05:30:00+05:30 IST