Advertisement
Advertisement
Abn logo
Advertisement

పిల్లల పాలకూ కటకటే!

బిల్లుల చెల్లింపులో జగన్‌ సర్కారు విఫలం 

ఇకపై సరఫరా చేయలేమన్న కాంట్రాక్టు సంస్థ 

సీఎంవోకు కర్ణాటక మిల్క్‌ సొసైటీ లేఖ

అప్పటికప్పుడు 120 కోట్లు చెల్లింపు


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

వృద్ధులు, వితంతువులకు ఇచ్చే పింఛన్లలో భారీగా కోతపెట్టిన జగన్‌ సర్కారు... అంగన్‌వాడీల్లో పిల్లలనూ వదలడం లేదు. అక్కడ వారికిచ్చే పాలతో పాటు పౌష్టికాహారానికీ కోత పెడుతోంది. వైఎస్సార్‌ సంపూర్ణ పౌష్టికాహారం, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్‌ అంటూ రకరకాల పథకాలతో ఊదరగొట్టిన ప్రభుత్వం... సకాలంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. దీంతో పాలు, గుడ్లు తదితరాల సరఫరా అరకొరగా సాగుతోంది. పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందకపోవడంతో అంగన్‌వాడీ చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడేళ్లలోపు చిన్నారులు 15.64లక్షల మంది, 3-6ఏళ్ల లోపు పిల్లలు 11.47లక్షల మంది ఉన్నారు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, పోషణ్‌ ప్లస్‌ కింద ప్రతి పిల్లవాడికి రోజుకి 200 గ్రాముల పాలు ఇవ్వాల్సి ఉంది. ప్రతి నెలా మొదటి వారంలోనే పాలు అంగన్‌వాడీ కేంద్రాలకు రావాల్సి ఉండగా ఆగస్టులో మూడో వారం దాటిన తర్వాత సరఫరా చేశారు. సెప్టెంబరు, అక్టోబరుకు కలిపి 2.20కోట్ల లీటర్లకు గాను 1.60కోట్ల లీటర్లే అందాయి. ఈ రెండు నెలల్లో కోతపడిన 60 లక్షల లీటర్లను నవంబరు ఇచ్చే పాలతో కలిపి సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించకపోవడంతో కాంట్రాక్టు సంస్థ ఈ నెలలో యథాప్రకారం గానే సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. 


కోడిగుడ్లు, కూరగాయల బిల్లులూ పెండింగే 

అంగన్‌వాడీలకు పంపే కోడిగుడ్లు, కూరగాయల బిల్లుల చెల్లింపులు కూడా సక్రమంగా జరగడంలేద ని సరఫరాదారులు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయలు నెలల తరబడి చెల్లించకపోతే ఎలా సరఫరా చేయాలంటున్నారు. బకాయిలు పెరిగిపోతుండటంతో పలు జిల్లాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా సక్రమంగా జరగడంలేదనే విమర్శలు వస్తున్నాయి. 

ఇక మధ్యాహ్న భోజనానికి అవసరమైన కూరగాయలను అంగన్‌వాడీ కార్యకర్తలే అప్పొ సొప్పో చేసి తీసుకొస్తున్నారు. పెరిగిన ధరల కారణంగా కూరగాయల కోసమే నెలకు 4, 5వేల వరకు అప్పుచేయాల్సి వస్తోంది. కొనుగోళ్లకు సంబంధించిన బిల్లులు ఎప్పుడొస్తాయో తెలియడం లేదని, ప్రభుత్వ వైఖరితో అప్పులపాలవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


బకాయిల చెల్లింపుల్లో జాప్యం

అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రతినెలా 1.10 కోట్ల లీటర్ల పాలను కర్ణాటక మిల్క్‌ సొసైటీ సరఫరా చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఆ సంస్థకు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో ఆగస్టు నెలాఖరు వరకు పాలు సరఫరా చేయలేదని, సెప్టెంబరు, అక్టోబరుల్లోనూ అరకొరగానే పంపారని చెబుతున్నారు. బకాయిలు చెల్లిస్తేనే పాలు సరఫరా చేస్తామంటూ సీఎంవో కార్యదర్శికి కర్ణాటక సొసైటీ లేఖ రాయడంతో ప్రభుత్వం రూ.120 కోట్ల బకాయిలు చెల్లింది. దీంతో నవంబరు నుంచి పాల సరఫరా పూర్తి స్థాయిలో మొదలైనట్లు తెలిసింది. 

Advertisement
Advertisement