బాల్యం.. బలహీనం!

ABN , First Publish Date - 2022-09-15T05:58:19+05:30 IST

జిల్లాలో బాల్యం బలహీనమవుతోంది. వారి సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలు సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు సరైన పోషకాహారం అందక బక్కచిక్కుతున్నారు. వయసుకు తగ్గ ఎత్తు, ఎత్తుకు తగిన బరువులేక చిన్నారులు అనేక రుగ్మతలకు గురవుతున్నారు.

బాల్యం.. బలహీనం!

బరువులేరు... ఎత్తు పెరగరు

చిన్నారుల్లో పౌష్టికాహారలోపం

వయస్సుకు తగ్గ ఎత్తు, బరువు ఉండని వైనం

సత్ఫలితాలు ఇవ్వని చైతన్య కార్యక్రమాలు

జిల్లాలో 2861 మంది చిన్నారులకు పౌష్టికాహార లోపాలు

నిజామాబాద్‌అర్బన్‌, సెప్టెంబరు 14: జిల్లాలో బాల్యం బలహీనమవుతోంది. వారి సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలు సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు సరైన పోషకాహారం అందక బక్కచిక్కుతున్నారు. వయసుకు తగ్గ ఎత్తు, ఎత్తుకు తగిన బరువులేక చిన్నారులు అనేక రుగ్మతలకు గురవుతున్నారు. చిన్నారులకు సరైన పోషకాహారం అందక శారీరకంగా, మానసికంగా ఎదుగుదలను కోల్పోతున్నారు. తోటి పిల్లలతో కలిసిమెలిసి ఆడుకోలేక, చురుగ్గా ఉండలేక, నిసృహ, నీరసించి చిన్నారులు అనారోగ్యంతో ఇబ్బం దులు పడుతున్నారు. ప్రభుత్వం పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహిస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఆశించిన మేర ఫలితాలు ఇవ్వడంలేదు. ఫలితంగా ఎంతోమంది చిన్నారులు వయసుకు తగిన విధంగా బరువు, ఎత్తు ఉండడంలేదు. గర్భిణులు సైతం పౌష్టికాహార లోపం కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణుల సంఖ్య జిల్లాలో అధికంగా ఉంటుంది. జిల్లాలో మొత్తం 86వేల 938 మంది చిన్నారులు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో ఉండగా సుమారు 3వేల మంది చిన్నారులో వివిధ రుగ్మతలతో బాధపడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం కోసం గుడ్లు, పాలు పంపిణీ చేస్తున్నా మార్పు మాత్రం కనిపించడంలేదు. గర్భిణుల్లో పౌష్టికాహార లోపం వల్ల పుట్టే పిల్లలు బలహీనంగా పుట్టి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పుట్టుకతోనే తక్కువ బరువుతో పుట్టడం, పౌష్టికాహారం సరిగ్గా అందక వయసుకు తగ్గ బరువు, ఎత్తు పెరగడంలేదు. పౌష్టికాహారం లోపం వల్ల రక్తహీనత, శారీరక ఎదుగుదల వల్ల ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నారు.  

జిల్లా వ్యాప్తంగా 1500 అంగన్‌వాడీ కేంద్రాలు

జిల్లా వ్యాప్తంగా 5ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉండగా 1500 అం గన్‌వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. 1500 అంగన్‌వాడీ కేంద్రాల్లో సుమారు లక్ష మంది ఒక్క సంవత్సరం నుంచి 3 సంవత్సరాలలోపు వయసు గల చిన్నారులు నిత్యం ఉంటున్నారు. జిల్లాలో 5 ప్రాజెక్టుల పరిధిలో 86938 మంది చిన్నారులు ఉన్నట్లు ఐసీడీఎస్‌ అధికారుల రికార్డు చెబుతున్నాయి. ఇందులో ఎత్తుకు తగిన బరువు అతితీవ్ర లోపభూషణ ఉన్నవారు 557 మందికాగా ఎత్తుకు తగిన బరువు తీవ్రలోపం పోషణ ఉన్న వారు 1749 మంది, వయసుకు తగిన బరువు తక్కువగా ఉన్న వారు 555 మంది ఉన్నట్లు అధికారులు ఇటీవల చేసిన సర్వేలో తెలిసింది. దాదాపుగా వెయ్యిమందికి పైగా చిన్నారులు వయసుకు తగిన ఎత్తులేనట్లు సర్వేలలో తేలింది.

పౌష్టికాహార లోపాలకు కారణాలు ఇవే..

చిన్నారుల్లో పౌష్టికాహార లోపానికి అనేక కారణాలు ఉన్నాయి. బాల్య వివాహాలు, పేదరికం, అవగాహనలేమి, చిన్నవయసులోనే గర్భందాల్చడం, నెలలు నిండకుండానే ప్రసవించడం వంటి కారణాల వల్ల పుట్టే పిల్లల్లో పౌష్టికాహారలోపం స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూలి పనులు చేసేవారు, పేదరికంతో ఇబ్బందులు పడేవారు వారి పిల్లలకు సరైన పౌష్టికాహారం అందక ఇబ్బం దులు పడుతున్నారు. వలస కూలీల పిల్లలు, మురికివాడ ల్లో ఉండేపిల్లలు ఎక్కువగా పౌష్టికాహార లోపంతో కనిపిస్తున్నారు. అంగన్‌వాడీ ఆయాలు, టీచర్లు, ఐసీడీఎస్‌ అధికారులు, ఏఎన్‌ఎంలు పౌష్టికాహారం విషయంలో ప్రచారాలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వడంలేదు. 

ఫలితాలు ఇవ్వని చైతన్య కార్యక్రమాలు

చిన్నారులు, బాలింతలు, గర్భిణుల్లో పౌష్టికాహారం పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహిస్తున్నా ఆశించిన మేర ఫలితాలు మాత్రం కనిపించడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో పౌష్టికాహారం విషయంలో సరైన అవగాహన, పర్యవేక్షణలేక ఎన్ని చైతన్య కార్యక్రమాలు నిర్వహించినా ఆశించిన ఫలితాలు మాత్రం ఇవ్వడంలేదు. అంగన్‌వాడీల్లో సిబ్బంది కొరత, సరైన వేతనాలు ఇవ్వకపోవడం, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతోనే చిన్నారులు పౌష్టికాహార లోపంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చిన్నారులు, బాలింతలు, గర్భిణుల్లో పౌష్టికాహార లోపం విషయంలో ప్రత్యేక దృష్టిపెడితే తప్ప ఈ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి కనిపించడంలేదు.

అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం..

ఫ సౌందర్య, ఇన్‌చార్జి ఐసీడీఎస్‌ పీడీ

అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహార లోపం గురించి తెలుసుకునేందుకు తరచూ బరువు, ఎత్తు కొలతలు తీసుకుంటున్నాం. బలహీనంగా ఉన్న పిల్లల్లో బలవంతులుగా చేసేందుకు వారిపై ప్రత్యేక దృష్టిపెడుతున్నాం. పౌష్టికాహార వారోత్సవాల పేరుతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 

Updated Date - 2022-09-15T05:58:19+05:30 IST