చిన్నారులే టార్గెట్‌

ABN , First Publish Date - 2021-08-03T07:05:35+05:30 IST

శ్రీవారి దర్శనార్థం వచ్చే కుటుంబాల్లో ఐదేళ్ల పిల్లలను టార్గెట్‌ చేస్తాడు.

చిన్నారులే టార్గెట్‌
నిందితుడు అనంతరాజు (ఫైల్‌ ఫొటో)

తిరుమలలో బంగారు గాజుల అపహరణ 

నిందితుడిని అరెస్టు చేశామన్న ఏఎస్పీ 


తిరుమల, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనార్థం వచ్చే కుటుంబాల్లో ఐదేళ్ల పిల్లలను టార్గెట్‌ చేస్తాడు. వారు నిద్రిస్తున్న సమయంలో.. తల్లిదండ్రులు ఏమరపాటుగా ఉండటాన్ని గమనించి పిల్లల చేతుల్లోని బంగారు గాజులు తస్కరిస్తాడు. ఇలా తిరుమలలో దొంగతనానికి పాల్పడుతున్న కర్నూలుకు చెందిన అనంతరాజును గత నెల 27న అరెస్టు చేసినట్లు అదనపు ఎస్పీ మునిరామయ్య తెలిపారు. తిరుమల పోలీసు కాంప్లెక్సులో సోమవారం ఆయన వీజీవో బాలిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. శుక్ర, శనివారాల్లో అనంతరాజు తిరుమలకు వచ్చి అన్నదానం వద్ద రద్దీలో భక్తుల్లో కలిసిపోయేవాడన్నారు. నిద్రస్తున్న పిల్లలను తల్లిదండ్రులు భుజంపై ఎత్తుకుని ఉన్న సమయంలో ఓ చేతి గాజును అపహరించి నెమ్మదిగా జారుకుంటాడన్నారు. గతంలో ఏడుసార్లు బంగారు గాజులను అపహరించినట్టు తమ విచారణలో తేలిందన్నారు. చిన్నపిల్లలతో వచ్చే భక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ సూచించారు. 


భక్తులను మోసగించిన దళారీ అరెస్ట్‌

నకిలీ సిఫార్సు లేఖతో భక్తులను మోసగించిన దళారీని అరెస్ట్‌ చేశామని ఏఎస్పీ మునిరామయ్య తెలిపారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనాలను తక్కువ సంఖ్యకే పరిమితం చేయడంతో కొందరు దళారులు ప్రజాప్రతినిధుల లేఖలను ఫోర్జరీ చేసి వాటిని అమాయకులైన భక్తులకు అధిక ధరకు విక్రయిస్తున్నారన్నారు. ఇలా తిరుపతికి చెందిన కేశవులు విజయనగరానికి చెందిన ఓ ఎంపీ సిఫార్సు లేఖను ఫోర్జరీ చేశాడన్నారు. దీనిని విశాఖపట్నంకు చెందిన భక్తులకు రూ.6,500కు విక్రయించాడన్నారు. ఫోర్జరీ లేఖలను భక్తులకు అందజేసి జేఈవో కార్యాలయంలో బ్రేక్‌ దర్శనానికి నమోదు చేసుకోవాలని వారిని పంపడంతో ఈ మోసం వెలుగు చూసిందన్నారు. ఇతడిపై ఆదివారం టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులెవరూ దళారులను ఆశ్రయించవద్దని ఏఎస్పీ కోరారు. టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా టికెట్ల కోటా విడుదల చేసినప్పుడే నమోదు చేసుకుని దర్శనానికి రావాలన్నారు.  


మాస్కులు ధరించని భక్తులపై కేసులు పెడతాం 

‘శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. లేదంటే ఏపీ పబ్లిక్‌ హెల్త్‌ యాక్ట్‌ ప్రకారం జరిమానా లేదా 188 ఐపీసీ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేస్తాం’ అని తిరుమల ఏఎస్పీ మునిరామయ్య స్పష్టంచేశారు. సోమవారం ఉదయం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. థర్డ్‌ వేవ్‌ పుంజుకుంటున్న క్రమంలో భక్తులు అప్రమత్తంగా ఉండటంతోపాటు కొవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించాలన్నారు. రద్దీ ప్రాంతాల్లో, ఫొటోలు దిగే సమయంలో మాస్కులు తొలగించడం మంచిది కాదన్నారు. టీ, భోజనం కోసం వెళ్లే భక్తులు పరిసరాలను పరిశీలించి మాస్కులు తీయాలన్నారు. వ్యాపారులూ మాస్కులు ధరించేలా చర్యలు తీసుకున్నామన్నారు. టీటీడీపై సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలను షేర్‌, ఫార్వర్డ్‌ చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-08-03T07:05:35+05:30 IST