పిల్లలు మాట వినడంలేదా!

ABN , First Publish Date - 2021-05-15T05:30:00+05:30 IST

ఇది లాక్‌డౌన్ల కాలం. బడులు మూతపడ్డాయి. పిల్లల ఆట... పాట... ఏదైనా నాలుగు గోడల మధ్యే పరిమితమైపోయింది. కాస్త పెద్ద వయసు పిల్లలైతే పరిస్థితులు అర్థం చేసుకోగలుగుతారు

పిల్లలు మాట వినడంలేదా!

ఇది లాక్‌డౌన్ల కాలం. బడులు మూతపడ్డాయి. పిల్లల ఆట... పాట... ఏదైనా నాలుగు గోడల మధ్యే పరిమితమైపోయింది. కాస్త పెద్ద వయసు పిల్లలైతే పరిస్థితులు అర్థం చేసుకోగలుగుతారు. మరి లోకం తెలియని చిన్నారుల మాటేమిటి? ఎటూ కదలడానికి లేక వారిలో ఆందోళన మొదలవుతుంది. మొండిగా ప్రవర్తిస్తారు. ఇలాంటప్పుడు వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడడం ఎలా? దీనికి ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌’ కొన్ని సూచనలు చేసింది.  


భరోసా: ఈ సమయంలో పిల్లలకు తల్లితండ్రుల భరోసా చాలా ముఖ్యం. ఏం కావాలన్నా తామున్నామనే భావన వారిలో కల్పించాలి. వారి అవసరాలను అడిగి తెలుసుకోవాలి. వేసే ప్రశ్నలకు ఓపికగా జవాబు చెప్పాలి. లాక్‌డౌన్‌లో మీరూ ఫోన్లు, టీవీల్లో మునిగిపోకుండా... పిల్లల కోసం సమయం కేటాయించాలి. పుస్తకాలు చదివే అలవాటు చేయడానికి ఇదే సరైన సమయం.  


స్నేహం: రోజూ బడికి వెళ్లే పిల్లల్ని ఇంటికే పరిమితం చేయడంవల్ల ఇబ్బంది పడతారు. స్కూల్లో స్నేహితులను కలవలేకపోతున్నామనే భావన వారిని ప్రశాంతంగా ఉండనివ్వదు. అందుకే స్కూల్‌ ఫ్రెండ్స్‌తో, అలాగే బంధువులతో తరచూ ఫోన్‌లో, వీలైతే వీడియో కాల్‌లో మాట్లాడించండి.  


సున్నితంగా: ఒక్కసారిగా లోపల బంధించి బయటకు వెళ్లొద్దంటే వారు వినరు. అలాగే ఏదైనా ముట్టుకున్నప్పుడల్లా చేతులు కడుక్కోమన్నా వాళ్లకు ఎక్కదు. పైగా పదే పదే ఒకే విషయం చెబితే మొండికేస్తారు. ఏదో ఆర్డర్‌ వేసినట్టు కాకుండా... బయటి పరిస్థితులు వాళ్లకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయండి. చికాకు పడో, కోపంలో తిట్టడమో, కొట్టడమో చేస్తే వాళ్ల మనసు గాయపడుతుంది. ఆందోళన పెరుగుతుందని గుర్తుంచుకోండి. 


భయం: పెరుగుతున్న కరోనా కేసులు, మరణాల గురించి రోజూ అప్‌డేట్స్‌ ఇవ్వకండి. అలాంటివి చెబితే వారు భయపడతారు. కానీ దాని తీవ్రతను వారికి అర్థమయ్యేలా వివరించాలి. వారి మనసు ఎంతో సున్నితంగా ఉంటుంది. అది గ్రహించి మసలుకోవాలి. 


ఆటలు: ఈ విపత్కర పరిస్థితుల్లో పిల్లలకు ఇంట్లోనే రకరకాల ఆటలు ఆడే వాతావరణం కల్పించాలి. ఎప్పుడూ టీవీలు, స్మార్ట్‌ఫోన్లకు అతుక్కుపోకుండా చూసుకోవాలి. స్కూల్లో మాదిరిగా రకరకాల యాక్టివిటీస్‌ చేయించాలి. క్లే, పెయింటింగ్స్‌, డ్రాయింగ్‌ వంటి వాటిపై పిల్లలకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. బోర్‌ కొట్టకుండా కొత్త కొత్త బోర్డ్‌ గేమ్స్‌ వంటివి ఆడించాలి. వాళ్ల దారిన వాళ్లని వదిలేయకుండా పెద్దవాళ్లు కూడా పిల్లలతో కలిసి ఆడాలి. దీనివల్ల వారు ఎంతో ఆనందపడతారు.

Updated Date - 2021-05-15T05:30:00+05:30 IST