గురుకుల సంక్షేమం గాలికి!

ABN , First Publish Date - 2021-04-15T09:14:57+05:30 IST

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారింది. బడ్జెట్‌ కేటాయింపులు లేక, ప్రభుత్వం పట్టించుకోక అవి అనాథ పాఠశాలలుగా మారుతున్నాయి.

గురుకుల సంక్షేమం గాలికి!

50కి పైగా పాఠశాలల్లో వైద్య సిబ్బంది కరువు

కరోనాకేసులు పెరుగుతున్నా పట్టించుకోని వైనం

కొరవడిన పర్యవేక్షణ.. పాము కాటుకు పిల్లలు బలి

అన్నపూర్ణ యాప్‌పై ఉన్నతాధికారుల శీతకన్ను

వంట సరుకుల సరఫరా లేక చప్పిడి మెతుకులు

ఇంటిదారి పడుతున్న విద్యార్థులు


ఒకప్పుడు సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పిల్లలకు విద్యా భద్రత.. ఆరోగ్య భద్రత.. ఆహార భద్రత దక్కేవి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుందనే భరోసాతో ఉండేవారు. సంక్షేమ గురుకుల సొసైటీ సెక్రటరీలుగా పనిచేసిన అధికారుల ప్రత్యేక శ్రద్ధ, కృషి వలన ఈ విద్యార్థులు అనేక పోటీ పరీక్షల్లోనూ ముందుండేవారు. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ఈ పాఠశాలలు తయారయ్యాయి. ఈ పాఠశాలల్లో సీట్లు కావాలంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సిఫారసులు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అవుతోంది. అరకొర బడ్జెట్‌ కేటాయింపుల కారణంగా గురుకులాల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది!


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారింది. బడ్జెట్‌ కేటాయింపులు లేక, ప్రభుత్వం పట్టించుకోక అవి అనాథ పాఠశాలలుగా మారుతున్నాయి. వారికి నాణ్యమైన ఆహారం అందండం లేదు. మరోవైపు కరోనా కల్లోలం కమ్మేస్తుంటే ఈ పేద విద్యార్థుల దీన స్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభించిన తర్వాత వారి పరిస్థితి దయనీయంగా మారింది. కొన్ని గురుకులాల్లో చిత్తశుద్ధి కలిగిన అధికారులున్నప్పటికీ ప్రభుత్వం నిధులివ్వడంలో అలసత్వం వహించడంతో వాటిని నిర్వహించలేని నిస్సహాయతలో ఉన్నారు. పలు జిల్లాల్లో మెనూ రేట్లను మార్చకుండా పాత కాంట్రాక్టర్లకే ప్రొవిజన్స్‌ సరఫరా హక్కులు కొనసాగిస్తున్నారు.


వారికి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ప్రొవిజన్స్‌ సరఫరా నిలిపేశారు. దీంతో కొన్నిచోట్ల ప్రిన్సిపాళ్లు వారి సొంత పూచీకత్తుతో అప్పులు తీసుకొచ్చి నెట్టుకొస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాల్లో బిల్లులివ్వలేదని కాంట్రాక్టర్‌ సరఫరా నిలిపేయడంతో జిల్లా వ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో ప్రొవిజన్స్‌ నిండుకున్నాయి. దీంతో నీళ్ల అన్నం తినలేక విద్యార్థులు ఇంటిదారి పడుతున్నారు.


అన్నపూర్ణ యాప్‌పై శీతకన్ను

సంక్షేమ గురుకులాల్లో పిల్లలకందించే ఆహారాన్ని పర్యవేక్షించేందుకు అన్నపూర్ణ యాప్‌ను ఆవిష్కరించారు. ఎంత మంది విద్యార్థులు భోజనం చేస్తున్నారు, ఏయే రకాల కూరలు అందిస్తున్నారు అనే విషయం ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేసే ఫోటోల ద్వారా పర్యవేక్షించే వెసులుబాటు ఉంది. ఈ యాప్‌ ఆధారంగానే డైట్‌ చార్జీలు కూడా అందిస్తారు. గురుకుల సొసైటీ అధికారులు వాటిని పర్యవేక్షిస్తూ మానిటర్‌ చేస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు చప్పిడి మెతుకులు తింటున్నా, పస్తులంటున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. యాప్‌లో గురుకులాల దుస్థితి ఉన్నతాధికారులకు తెలుస్తున్నా ఆర్థిక కేటాయింపులు లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.


పెరుగుతున్న కరోనా కేసులు

రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాల్లో కరోనా అలజడి కనిపిస్తోంది. ఈ పాఠశాలల్లో ప్రొటోకాల్‌ ప్రకారం కొవిడ్‌ టెస్ట్‌లు నిర్వహించకపోవడంతో కేసులు వెల్లడి కావడం లేదు. ఏ పాఠశాలలోలైనా కరోనా కేసులొస్తే దాన్ని మూసేయాలని విద్యాశాఖమంత్రి ఇప్పటికే ఆదేశాలిచ్చారు. అయితే సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఇది అమలు కావడం లేదు. హిందూపురం గర్స్‌ గురుకులంలో ముగ్గురు విద్యార్థులకు, మల్లవరంలో ఇద్దరు, పూతలపట్టులో ఒకరు, కోడూరు, ఏలేశ్వరం గురుకుల పాఠశాలల్లో ఇద్దరికి వైరస్‌ సోకింది. కోడూరులో ఐదుగురు విద్యార్థులకు, శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు గురుకులంలో ఇద్దరు, శ్రీకృష్ణాపురంలో ఒకరు, చింతలపూడిలోఇద్దరు, బాపట్లలోఒకరు, సబ్బవరం లో ఆరుగురు, కర్నూలుజిల్లా దిన్నెదేవరపాడు లో ఆరుగురువిద్యార్థులు కరోనా బారినపడ్డారు. 


హెల్త్‌ సూపర్‌వైజర్లు లేరు..

రాష్ట్రంలోని 192 గురుకులాలకు గాను 50కి పైగా పాఠశాలల్లో హెల్త్‌ సూపర్‌వైజర్లు లేరు. గురుకులాల్లో పలు చోట్ల భవనాలు, ఫ్లోరింగ్‌ దెబ్బతిని పాములు, తేళ్లుకు నిలయంగా మారాయి. మరమ్మత్తులు చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. పట్టించుకోవడంలేదు. చిత్తూరు జిల్లా బూరకాయలకోట గురుకులంలో జూనియర్‌ ఇంటర్‌ చదువుతున్న సి.మౌనిక ఫిబ్రవరి 23న ఆరేసిన దుస్తులు తెచ్చుకోవడానికి వెళ్లినప్పుడు పాము కాటేసింది.


పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి గురుకులంలో డి.నవీన్‌ అనే 8వ తరగతి విద్యార్థి మార్చి 10న బాత్‌రూంలో పాము కాటుకు గురయ్యాడు. కడప జిల్లా మడకలవారిపల్లి గురుకులంలో 8వ తరగతి విద్యార్థిని జాస్మిన్‌ స్కూల్‌ ఆవరణలో యోగా చేస్తుండగా పాము కాటేసింది. కడప జిల్లాలోని గండిక్షేత్రంలో గత నెల 25న డి.ఉపేంద్ర అనే జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థిని పాము కరిచింది.

Updated Date - 2021-04-15T09:14:57+05:30 IST