పిల్లల మేకప్‌ ఇలా...

ABN , First Publish Date - 2021-11-29T09:05:59+05:30 IST

‘మమ్మీ! నాకూ లిప్‌స్టిక్‌ వేయవా?, మమ్మీ... నేనూ నెయిల్‌ పాలిష్‌ వేసుకుంటా!’ ఆడపిల్లలున్న ప్రతి తల్లినీ ఇరకాటంలో పడేసే మాటలివి....

పిల్లల మేకప్‌ ఇలా...

‘మమ్మీ! నాకూ లిప్‌స్టిక్‌ వేయవా?, మమ్మీ... నేనూ నెయిల్‌ పాలిష్‌ వేసుకుంటా!’ ఆడపిల్లలున్న ప్రతి తల్లినీ ఇరకాటంలో పడేసే మాటలివి. చిన్న పిల్లలకు పెద్దల కాస్మెటిక్స్‌ వాడచ్చా? లేక పిల్లల సున్నిత చర్మానికి తగిన సౌందర్యసాధనాలను ఇంట్లోనే తయారుచేసుకోవాలా? 

మార్కెట్లో దొరికే కాస్మటిక్స్‌ పెద్దల కోసం ఉద్దేశించినవి. కాబట్టి వాటిని పిల్లలకు ఉపయోగించడం సరి కాదు. ఎంతో అరుదుగా, తప్పనిసరి పరిస్థితుల్లో వాడవలసి వచ్చినా, వారానికోసారి నెయిల్‌ పాలిష్‌, లిప్‌గ్లాస్‌ లాంటి వాటిని అనుమతించవచ్చు. మేకప్‌ అనేది కేవలం పుట్టినరోజులు లాంటి ప్రత్యేకమైన సందర్భాల్లోనే వేసుకోవాలని ఆడపిల్లలకు చెప్పడం కూడా అవసరమే! అన్నిటికంటే ముఖ్యంగా పిల్లల కోసం సహజసిద్ధమైన, సేంద్రీయ పదార్థాలతో తయారైన కాస్మటిక్స్‌ వాడడం ఉత్తమం.


ఇవి వద్దు

కోల్‌, కాజల్‌, సుర్మా, సింథూర్‌లలో హెవీ మెటల్స్‌, లెడ్‌ ఉంటాయి. కాబట్టి వాటిని పిల్లలకు వాడకూడదు. వీటికి బదులుగా కర్పూరంతో తయారయ్యే కాటుక ఉత్తమం. 

 నెయిల్‌ పాలి్‌షలో ఉండే ఫార్మాల్‌డిహైడ్‌, టోలీన్‌ లాంటి రసాయనాలు పిల్లలకు హాని కలిగిస్తాయి. కాబట్టి అలాంటి కొన్ని రసాయనాలను వాడలేదని నిర్ధారించే వివరాల కోసం లేబుళ్లను వెతకాలి. ‘5 ఫ్రీ, 7 ఫ్రీ, 9 ఫ్రీ’ లేబుళ్లతో కూడిన నెయిల్‌ పాలిష్‌ ఎంచుకోవాలి.


 లిప్‌స్టిక్‌లకు బదులుగా పిల్లలకు లిప్‌గ్లాస్‌ వాడుకోవచ్చు. 

హోమ్‌మేడ్‌ 

పిల్లలకు కాస్మెటిక్స్‌తో ఎటువంటి చర్మ సమస్యలూ రాకుండా ఉండాలంటే వాటిని ఇంట్లోనే తయారుచేసుకోవాలి.

లిప్‌స్టిక్‌: తాజా కొబ్బరినూనె, బీట్‌రూట్‌ రసాలను కలిపి లిప్‌స్టిక్‌గా వాడుకోవచ్చు. దీన్నే బ్లష్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు.

కాజల్‌: సంప్రదాయ పద్థతిలో మసి, కర్పూరాలతో తయారుచేసుకున్న కాటుక సురక్షితమైనది.

ఐ షాడో, ఫేస్‌ పౌడర్‌: బీట్‌రూట్‌ ముక్కలను ఎండబెట్టి పొడి చేసుకుని, షియా బటర్‌ కలుపుకొని వాడుకోవచ్చు. కోకోపౌడర్‌ కూడా ఐ షాడోగా పనికొస్తుంది.

ఐ లైనర్‌: యాక్టివేటెడ్‌ చార్కోల్‌ ముద్దగా మారే వరకూ, దాన్లో చుక్కలు చుక్కలుగా డిస్టిల్డ్‌ వాటర్‌ కలుపుతూ ఉండాలి. కావలసిన చిక్కదనం వచ్చాక, డబ్బాలో నిల్వ చేసుకోవాలి.

లిప్‌స్టిక్‌: బీస్‌ వ్యాక్స్‌, షియా బటర్‌ లేదా కోకో బటర్‌, కొబ్బరినూనె.. ఈ మూడు లిప్‌స్టిక్‌ బేస్‌ ఇంగ్రిడియెంట్స్‌. కావలసిన రంగును బట్టి అడిటివ్స్‌ జోడించని ఫుడ్‌ కలర్‌ లేదా బీట్‌రూట్‌ పౌడర్‌లను కలుపుకోవచ్చు. మైనం, బటర్‌, కొబ్బరినూనెలను ఓ గిన్నెలో వేసి, చిన్న మంట మీద వేడి చేయాలి. కరిగిన తర్వాత స్టవ్‌ మీద నుంచి దింపి, రంగును కలుపుకోవాలి. చల్లారిన తర్వాత నిల్వ చేసుకోవాలి.

Updated Date - 2021-11-29T09:05:59+05:30 IST