చిలీ చైతన్య తరంగం విక్టర్ జారా

ABN , First Publish Date - 2021-04-04T05:56:55+05:30 IST

జోన్‌జారా రాసిన ‘విక్టర్ జారా :ఒక అసంపూర్ణ గీతం’ ఎందుకు చదవాలి? ఒక రాజకీయ భావజాల వ్యవస్థ ఎదిగి, బలపడటానికి, స్థిరపడటానికి సాంస్కృతిక...

చిలీ చైతన్య తరంగం విక్టర్ జారా

జోన్‌జారా రాసిన ‘విక్టర్ జారా :ఒక అసంపూర్ణ గీతం’ ఎందుకు చదవాలి? ఒక రాజకీయ భావజాల వ్యవస్థ ఎదిగి, బలపడటానికి, స్థిరపడటానికి సాంస్కృతిక వ్యవస్థ ఎలా తోడ్పాటునందిస్తుందో అర్థం కావాలంటే ఈ పుస్తకం చదవాలి. అలాగే ఆ రాజకీయ భావజాల వ్యవస్థ ఇంకొకరికి నష్టం, ప్రమాదం అనుకుంటే ఆ వ్యవస్థను ఎంత నిర్దాక్షిణ్యంగా, ఎంత నైపుణ్యంగా అణచివేస్తారో, అంతమొందిస్తారో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి. అప్పుడు అస్పష్టమైన భవిష్యత్తును స్పష్టం చేసుకోవటానికి ఈ పుస్తకాన్ని చదవాలి. పూర్వం బ్రిటిష్ సామ్రాజ్యవాదం, ఇతర దేశాల్ని తమ కాలనీలుగా చేసుకోవటానికి ఏ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ఎత్తుగడల్ని అనుసరించిందో మనకు తెలుసు. ఆ తర్వాత బ్రిటన్‌ స్థానంలో అమెరికా వచ్చి, కొత్త సామ్రాజ్యవాదానికి తెరతీసి ఎలా అనుసరిస్తోందీ, ఇతర దేశాల్ని తమ ఇంటి వెనకాల పెరడులుగా ఎలా మారుస్తోందీ, తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదివితీరాలి.


ఈ నేపథ్యంలో అమెరికా చేతికి చిక్కిన చిలీ ఎలా అయిందో ఇందులో, చెబుతుంది. ఈ పుస్తకం బ్రిటిష్‌ దేశస్థురాలైన రచయిత్రి జోన్‌ తన చిన్ననాటి లండన్‌ జీవితాన్ని చిత్రిస్తుంది. చిలీ బ్యాలేడాన్సు లండన్‌లో ప్రదర్శిస్తున్నప్పుడు దాన్ని చూసిన జోన్‌, అది ఎంత శక్తిమంతమైన కళారూపమో తెలుసుకుని ప్రభావితమవుతుంది. అలా బ్యాలేడాన్సు కళాకారుడైన చిలీ దేశస్థుణ్ణి లండన్‌లో పెళ్లి చేసుకుని చిలీ వస్తుంది. కూతురు పుట్టిన తర్వాత భర్తతో జోన్‌ విడిపోతుంది. తర్వాత విక్టర్‌ జారా ఆమె జీవితం తలుపు తట్టి, మనసులోకి ప్రవేశిస్తాడు. కార్మికవర్గ నేపథ్యం ఉన్న విక్టర్‌, పల్లెజీవన వాస్తవికతను లోకానికి చాటాలనుకుని, చిలీ అంతా తిరిగి జానపద సాహిత్యాన్ని సేకరించి పరిశోధిస్తాడు. పాబ్లోనెరూడా ప్రభావంతో వామపక్ష రాజకీయ, కళారంగాల్లో జీవిస్తాడు. ఇంకోపక్క చిలీ యూనివర్సిటీలోని థియేటర్‌ స్కూల్లో విద్యార్థిగా చేరి అభినయం నేర్చుకుని, జానపద గాయకుడిగా, నాట్యకారుడిగా, రచయితగా గుర్తింపు పొందుతూ, విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ, దేశాధ్యక్ష ఎన్నికల్లో నిమగ్నమై రాజకీయ పాఠాలు నేర్చుకుంటాడు. అలా జానపద సాహిత్యం, నాటకరంగం, సంగీతం, రాజకీయాలు అతడి జీవితంలో భాగమయ్యాయి. 


విక్టర్‌ లాటిన్‌ అమెరికా, యూరోపియన్‌ దేశాల్లో పర్యటించి ప్రదర్శనలు ఇచ్చాడు. అంతర్జాతీయ థియేటర్‌ ఫెస్టివల్స్‌కి వెళ్లాడు. చిలీలో సాల్వడార్‌ అలెండీ దంపతుల్ని కలిశాడు. లాటిన్‌ అమెరికా దేశాల సాంస్కృతిక ఐక్యత కోసం, ‘పాట ఉద్యమం’ ద్వారా పని చేశాడు. చిలీ జానపద సాహిత్యాన్ని యూరోపియన్‌ ప్రపంచానికి పరిచయం చేసిన వయొలెటా పారాతో కలిసి పని చేశాడు. ఇంకోపక్క విక్టర్‌ తన పనుల్ని విశ్లేషించుకున్నాడు. తన రచనల్లో వ్యక్తిగత ధోరణి తగ్గి సామూహికత స్థానం పొందడం గుర్తిస్తాడు. ఒకేసారి వందలాది వేలాది మందిని స్పందింపచేయటం నాటకం ద్వారా కంటే పాట ద్వారానే సాధ్యం అని విక్టర్‌ అనుభవం ద్వారా రుజువు పర్చుకున్నాడు. ప్రజా ఉద్యమాల్లో ఒంటరి గాయకుడి కంటే ఒక బృందం ఎక్కువ ప్రభావాన్ని చూపగలదని విక్టర్‌ గ్రహించాడు.


చిలీలో విప్లవ భావాల్ని, ఉద్యమాల్ని అణచడానికి అమెరికా తన సాంస్కృతిక దురాక్రమణ మొదలుపెట్టింది. ప్రచార సాధనాల్లో అమెరికన్‌ జీవన విధానాల్ని వినసొంపుగా వినిపించారు. చిలీ పత్రికల స్థానంలో, చౌకబారు అమెరికన్‌ కామిక్‌లు ప్రత్యక్షమయ్యాయి. రేడియోలో అమెరికన్‌ పాప్‌ సంగీతాన్ని హోరెత్తించారు. టీవీల్లో హాలీవుడ్‌ సినిమాలు రంగప్రవేశం చేశాయి.


1970లో చిలీలో అధ్యక్ష ఎన్నికలు వచ్చాయి. సోషలిస్టు పార్టీకి చెందిన సాల్వడార్‌ అలెండీని సంకీర్ణ సముదాయం తరపున అభ్యర్థిగా ప్రకటించారు. దీనిలో భాగంగా సోషలిస్టు కార్యాచరణ ప్రణాళికను కూడ ప్రకటించారు. ఉమ్మడి లక్ష్యం కోసం వివిధ రకాల కళాకారులు కలిసి కళాప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నికలకు విక్టర్‌ మార్చింగ్‌సాంగ్‌ రాశాడు. అది ప్రచారసభలో మారుమోగిపోయింది. చివరికి అలెండీ గెలిచాడు. అతడి విజయంతో, సోషలిజాన్ని ఎన్నికల ద్వారా కూడా సాధించవచ్చుననే భావన ఇతర లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లో కూడా కలుగుతుందని అమెరికా ఆందోళన చెందింది. దాంతో చిలీలోకి సీఐఏ ఏజెంట్లు దిగారు. అలెండీని అంతం చేసే పథకాలు మొదలుపెట్టారు. చిలీ నెమ్మదిగా నడక సాగించింది. ఆ సందర్భానికి అనుగుణంగా విక్టర్‌ ‍‘మారుతున్నకాలం’ అనే పాట రాశాడు. అలెండీ వ్యతిరేక శక్తులు అతి వేగంగా వాళ్ల వ్యతిరేక కార్యక్రమాలు మొదలుపెట్టారు. దాంతో విక్టర్‌ ‘మానవుడే సృష్టికర్త’ అనే మరోపాట రాశాడు. ఈ పాటకు పేపరు, దువ్వెన వాయిద్యాలయ్యాయి. 


సోషలిస్టు వ్యతిరేక శక్తులు వస్తువుల కొరతను సృష్టించాయి. దీని ఆధారంగా స్త్రీలను సమీకరించారు. సోషలిస్టుల ‘పాట ఉద్యమ’ ప్రభావాన్ని వ్యతిరేక శక్తులు కూడా గుర్తించి, పాటల కరపత్రాల్ని విరివిగా సృష్టించి ప్రచారం చేశారు. దీనిలో భాగంగా ‘అలెండీ అంటే అశాంతి’ అనే నినాదాన్ని ప్రచారం చేశారు. అలెండీ పదవీ కాలపరిమితి పూర్తి కాకుండానే ఆయన్ని గద్దె దించాలని వ్యతిరేక శక్తులు చేస్తున్న ప్రయత్నాల్ని అడ్డుకునే విధంగా విక్టర్‌ తన సరళమైన పద్ధతిలో ఉపన్యాసాలు ఇచ్చాడు. ప్రజాస్వామిక పద్ధతుల్లో అలెండీని ఓడించడం అసాధ్యమని వ్యతిరేకశక్తులకు అర్థమైంది. దాంతో సైనిక తిరుగుబాటు ద్వారా దించేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు పాబ్లో నెరూడా రంగంలోకి దిగి నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడవలసిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. దాంతో నియంతృత్వ వ్యతిరేక ఉద్యమాలు దేశవ్యాప్తంగా జరిగాయి. నియంతృత్వ ప్రమాదాన్ని గుర్తించిన విక్టర్‌ ఒక పాట రాశాడు. అప్పుడే అలెండీ అధ్యక్షుడిగా మూడవ వార్షికోత్సవాన్ని జరుపుతున్నారు. ఆయనకు మద్దతుగా పది లక్షలమంది ప్రజలు ఆనాడు ఊరేగింపు జరిపారు. అదే ఆయనకు తుది వీడ్కోలు అయిందా అన్నట్టు వారం రోజులకల్లా రాజకీయ సంక్షోభం మొదలైంది. అమెరికా సిఐఏ కుట్ర కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి. అమెరికా యుద్ధనౌకలు చిలీ చేరుకుంటున్నాయి. ప్రజాభిప్రాయసేకరణ మీద తర్జనభర్జన జరుగుతోంది. ఈలోపు, అనుకున్నంత పనీ అయింది. సైనిక తిరుగుబాటు జరిగింది. అప్పుడే అలెండీ ఆఖరిసారిగా రేడియోలో మాట్లాడుతున్నాడు. అనుకున్నట్టుగానే ఆయన ఉన్న అధ్యక్ష భవనం మీద బాంబులు వేసి తగలబెట్టారు. ఇంకోపక్క టీవీలో అలెండీ చనిపోయిన అధ్యక్ష భవనం అవశేషాల్ని పదేపదే చూపిస్తున్నారు. అలా మార్క్సిజం అనే కేన్సరు వ్యాధిని చిలీలో లేకుండా చెయ్యాలని సైనిక నియంతలు ఉవాచిస్తున్నారు. అందర్నీ బాధించినట్టే, చంపినట్టే విప్లవ సాంస్కృతిక ఉద్యమ నాయకుడైన విక్టర్‌ను కూడా హింసించి చంపారు. విక్టర్‌ మరణవార్తను వారం తర్వాత మోసుకొచ్చిన తీరు మర్చిపోలేం. మార్చురీలో విక్టర్‌ని గుర్తించటం భార్య జోన్‌కే కాదు, పాఠకులకు కూడా బాధాకరంగానే ఉంటుంది. విక్టర్‌ హత్య వార్త ప్రసార మాధ్యమాల్లో రాకుండానూ, వచ్చినా సంక్షిప్తంగా, వక్రీకరణలతోనే చేసి, వాళ్ల అమానుషత్వాన్ని చాటుకున్నారు. విక్టర్ మాయమై, హతమయ్యేంత వరకు అసలు ఏం జరిగిందో, ఏ ఒక్కరికో తెలియటం అసాధ్యం అని జోన్‌కి తెలుసు. అప్పుడు, తెలిసిన ఒక్కొక్క వ్యక్తినీ కలిసి, వాళ్ళు చెప్పిన మాటల్ని విని, అసలు ఏం జరిగిందో అర్థం చేసుకున్న జోన్ వాటిని కూర్చి ‘ఒక అసంపూర్ణ గీతం’ అనే పుస్తకం రాసింది. 


ఈ పుస్తకాన్ని అనువాదం చేసిన డా. నళిని హైదరాబాదులో పిల్లల డాక్టరు. పిల్లలకు ఎంత ప్రేమగా, శ్రద్ధగా వైద్యం చేస్తుందో అలానే ఈ అనువాదాన్ని చేశారు. డాక్టరుగా తన ప్రాణశక్తులన్నీ పిల్లల వైద్యానికి పెట్టినట్టు, ‘ఈ పుస్తకం పాపాయి’కి కూడా అందించింది. పిల్లలకు ప్రాణం పోసినట్టే, ఈ అనువాదానికీ ప్రాణం పోసింది. ఈ అనువాదంలో తను లీనమై, కార్చిన కన్నీళ్ల జాడలున్నాయి. దాంతో అచ్చు అక్షరాలకు ఉన్న కళ్లు కూడా ఇంకా చెమ్మగిల్లేఉన్న సందర్భాలున్నాయి. ఇలా మమేకమైన ఈ అనువాదాన్ని చదివినప్పుడు నిజంగా మనసు పారేసుకుంటాం. ఇలాంటి మానసిక స్థితికి రావడం మంచి రచనకు గానీ, మంచి అనువాదానికి గానీ గుర్తుగా భావిస్తాను. 

అత్తలూరి నరసింహారావు

(రేపు రాత్రి 7.30 గం.లకు జూమ్ వేదికగా పుస్తకావిష్కరణ)

Updated Date - 2021-04-04T05:56:55+05:30 IST