జో బైడెన్‌పై చైనా ఆగ్రహం

ABN , First Publish Date - 2021-11-20T19:35:20+05:30 IST

వచ్చే ఏడాది బీజింగ్‌లో జరిగే ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా

జో బైడెన్‌పై చైనా ఆగ్రహం

బీజింగ్ : వచ్చే ఏడాది బీజింగ్‌లో జరిగే ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరించే అంశాన్ని  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిశీలిస్తున్న నేపథ్యంలో చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.  బైడెన్ క్రీడలపై రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టింది. ఆయన ఒలింపిక్స్ స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించింది. ఆయన వైఖరి క్రీడాకారుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని పేర్కొంది. 


జో బైడెన్ గురువారం ఓవల్ ఆఫీస్‌లో విలేకర్లతో మాట్లాడుతూ, రానున్న వింటర్ ఒలింపిక్స్‌పై అమెరికా దౌత్యపరమైన బహిష్కరణ విధించడంపై పరిశీలిస్తున్నట్లు  ధ్రువీకరించారు. అంతకుముందు ఆయన కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడుతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. 


వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనాలోని బీజింగ్‌లో జరిగే ఒలింపిక్స్‌కు బైడెన్ హాజరయ్యే అవకాశం లేదని అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారి ఒకరు బుధవారం మీడియాకు చెప్పారు. ఈ క్రీడలపై దౌత్యపరమైన బహిష్కరణ విధించేందుకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. 


బైడెన్ వ్యాఖ్యలపై చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ స్పందిస్తూ, జింజియాంగ్‌లో చైనా నరమేధానికి పాల్పడుతోందని, బలవంతపు చాకిరీ చేయిస్తోందని అమెరికా తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు. బీజింగ్‌లో జరిగే వింటర్ ఒలింపిక్ గేమ్స్, పారాలింపిక్ గేమ్స్ ప్రపంచంలోని అన్ని ప్రాంతాల క్రీడాకారులకు ఓ వేదిక అని చెప్పారు. క్రీడాకారులు ఈ క్రీడలకు నిజమైన కథానాయకులు, ప్రతినిధులు అని చెప్పారు. క్రీడలపై రాజకీయాలు చేయడం ఒలింపిక్ స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని, అన్ని దేశాల క్రీడాకారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించడమేనని స్పష్టం చేశారు. 

 


Updated Date - 2021-11-20T19:35:20+05:30 IST