మా వ్యాక్సిన్ తీసుకున్నవారికే వీసాలిస్తాం : చైనా

ABN , First Publish Date - 2021-03-16T20:46:21+05:30 IST

చైనా తయారీ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను వేయించుకున్నవారికి మాత్రమే

మా వ్యాక్సిన్ తీసుకున్నవారికే వీసాలిస్తాం : చైనా

బీజింగ్ : చైనా తయారీ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను వేయించుకున్నవారికి మాత్రమే వీసాలను జారీ చేయనున్నట్లు న్యూఢిల్లీలోని చైనీస్ ఎంబసీ మంగళవారం ప్రకటించింది. అయితే మన దేశంలో చైనా తయారీ వ్యాక్సిన్‌ను తీసుకోవడానికి అనుమతి లేదు. దీంతో భారతీయులు చైనాలో పర్యటించడం కోసం వీసాలు పొందడం ఇకపై అంత సులభం కాదని తెలుస్తోంది. 


న్యూఢిల్లీలోని చైనీస్ ఎంబసీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, వ్యాపారం, ఉద్యోగం, బంధువులను కలుసుకోవడం వంటివాటి కోసం చైనా వెళ్ళే విదేశీయులకు చైనా ప్రభుత్వం వీసాలు జారీ చేస్తుంది. అయితే చైనా తయారీ కోవిడ్-19 వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి మాత్రమే వీసాలు జారీ చేస్తుంది. ఈ నిబంధనలను ‘‘ఫెసిలిటేటింగ్ మెజర్స్’’ అని ఈ ప్రకటన అభివర్ణించింది. 


భారతీయ విద్యార్థులకు చిక్కులు 

దాదాపు 22 వేల మంది భారతీయ విద్యార్థులు చైనాలో చదువుతున్నారు. వీరంతా ప్రస్తుతం మన దేశంలోనే ఉన్నారు. వీరిని తిరిగి చైనాలోకి అనుమతించడంపై చైనా ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. మంగళవారం ప్రకటించిన వీసా విధానంలో విద్యార్థుల కోసం సడలింపులు ఇవ్వడం గురించి వివరాలు లేవు. భారత ప్రభుత్వ అనుమతి లేకుండా చైనీస్ వ్యాక్సిన్లను చైనీస్ ఎంబసీ కానీ, కాన్సులేట్లు కానీ ఇవ్వడం సాధ్యం కాదు. ఈ అంశంపై భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయో, లేదో చైనా ప్రభుత్వం వెల్లడించ లేదు. 


చైనా వ్యాక్సిన్లపై అనాసక్తి

చైనా ప్రభుత్వం ఆ దేశంలో తయారైన కోవిడ్-19 వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. చైనాలో 65 మిలియన్ వ్యాక్సిన్ డోసులను ప్రజలకు ఇచ్చినట్లు చెప్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా చైనీస్ తయారీ వ్యాక్సిన్‌ను తీసుకునేవిధంగా గట్టి చర్యలు తీసుకుంటోంది. అయితే చైనా తయారీ వ్యాక్సిన్లపై జరిగిన క్లినికల్ ట్రయల్స్ సమాచారం పారదర్శకంగా లేదు. కాబట్టి చాలా దేశాలు చైనా వ్యాక్సిన్లపై ఆసక్తి చూపడం లేదు. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో తన వ్యాక్సిన్లను చైనా విజయవంతంగా ప్రవేశపెట్టగలిగింది. 


క్వాడ్ దేశాల చొరవ

క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డయలాగ్ (క్వాడ్) గ్రూపుగా ఏర్పడిన భారత దేశం, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ శుక్రవారం సమావేశమై, ఆసియా దేశాలకు వ్యాక్సిన్లను పంపిణీ చేయడానికి ప్రణాళికను రూపొందించాయి. కోవిడ్-19 మహమ్మారి అనంతరం కోలుకోవడానికి దోహదపడే చర్యల్లో భాగంగా ఆర్థిక వనరులు, తయారీ రంగంలో సామర్థ్యాలు, లాజిస్టికల్ బలాలను కూడగట్టుకుని కోవిడ్ వ్యాక్సిన్లను తయారీ చేసి, పంపిణీ చేయాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో 2022 జూన్‌నాటికి ఒక బిలియన్ డోసుల వ్యాక్సిన్లను తయారు చేయడానికి హైదరాబాద్‌లోని బయలాజికల్ ఈ లిమిటెడ్‌కు ఆర్థిక సహకారం అందించాలని అమెరికా అభివృద్ధి బ్యాంకు నిర్ణయించింది. 



Updated Date - 2021-03-16T20:46:21+05:30 IST