గల్వాన్ ఘర్షణ: అమరసైనికుల అంత్యక్రియలకూ అడ్డుపడుతున్న చైనా!

ABN , First Publish Date - 2020-07-14T20:19:33+05:30 IST

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. అమర సైనికుల బంధువులకు ఈ చర్య కొంతలో కొంత స్వాంతను చేకూరుస్తుంది.

గల్వాన్ ఘర్షణ: అమరసైనికుల అంత్యక్రియలకూ అడ్డుపడుతున్న చైనా!

 వాషింగ్టన్: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు సకల లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. అమర సైనికుల బంధువులకు ఈ చర్య.. కొంతలో కొంత స్వాంతను చేకూరుస్తుంది. అన్నిటికీ మించి..  వీర సైనికులకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందనే సందేశాన్ని పంపిస్తుంది. కానీ చైనా మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్టు అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి.


జూన్ 15న గల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన చైనా సైనికులకు సకల లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అక్కడి ప్రభుత్వం విముఖత చూపిస్తోందని అమెరికా నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఈ‌ ఘటనలో అమరులైన భారత సైనికులకు ఇక్కడి ప్రభుత్వం సకల సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వర్తించింది. సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా నిలిచింది. కానీ ఈ ఘర్షణ జరిగి నెల కావస్తున్నా కూడా చైనా మాత్రం అక్కడి సైనికులకు అంత్యక్రియలు జరిపేందుకు ఇప్పటికీ వెనకాడుతున్నది అమెరికా వర్గాలు చెబుతున్నాయి.


అంతే కాకుండా.. ఈ విషయంలో పట్టుబడుతున్న సైనికుల కుటుంబ సభ్యులపై కూడా కఠిన వైఖరి అవలంబిస్తున్నట్టు తెలిసింది. చివరి చూపుకు కూడా కుటుంబసభ్యులు ఎవరూ హాజరకాకూడదిని, ప్రభుత్వ లాంఛలేవీ ఉండవని వారికి తేల్చి చెప్పినట్టు సమచారం. అంత్యక్రియల ద్వారా గల్వాన్‌లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనే అంశం బహిర్గతమైతే చైనాకు చెడ్డపేరు వస్తుందని అక్కడి ప్రభుత్వం భావించడమే ఈ అమానవీయ వైఖరికి కారణమని నిపుణులు భావిస్తున్నారు.


కానీ.. కరోనా కారణంగానే ఇటువంటి నిబంధన విధించామని చైనా ప్రభుత్వం సైనికుల కుటుంబసభ్యులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. అయితే సైనికుల కుటుంబాలలో మాత్రం ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వారు.. చైనా సోషల్ మాధ్యమాల్లో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారట. దీంతో వారిని ఎలా శాంతింపచేయాలో తెలియక చైనా నానా అవస్థలు పడుతోందని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2020-07-14T20:19:33+05:30 IST