డబ్ల్యూహెచ్ఓకు షాకిచ్చిన చైనా

ABN , First Publish Date - 2021-08-13T19:22:37+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి మూలాలపై మరోసారి దర్యాప్తు జరపాలన్న ప్రపంచ

డబ్ల్యూహెచ్ఓకు షాకిచ్చిన చైనా

బీజింగ్ : కోవిడ్-19 మహమ్మారి మూలాలపై మరోసారి దర్యాప్తు జరపాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రతిపాదనను చైనా శుక్రవారం తోసిపుచ్చింది. ఈ వ్యాధి ఎలా ప్రారంభమైందో తెలుసుకోవడానికి రాజకీయ ప్రయత్నాలకు బదులుగా శాస్త్రీయ కృషికి మద్దతిస్తామని తెలిపింది. 


చైనా వైస్ ఫారిన్ మినిస్టర్ మా ఝఓక్సు శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ, కరోనా వైరస్ ప్రారంభం గురించి తెలుసుకోవడానికి రాజకీయంగా జరిగే ప్రయత్నాలను, తాము వ్యతిరేకిస్తామన్నారు. ఈ వైరస్ మూలాలను గుర్తించేందుకు సహకరించడానికి చైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. సహకరించడానికి ఎప్పుడూ తిరస్కరించలేదన్నారు. అయితే దర్యాప్తునకు రాజకీయ రంగు పులమడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ జాయింట్ రిపోర్టులో చెప్పినట్లుగా ఈ మహమ్మారి మూలాలపై ఫాలో-అప్, సప్లిమెంటరీ రీసెర్చ్ చేస్తున్నామని చెప్పారు. తదుపరి పరిశోధనను శాస్త్రవేత్తలు మాత్రమే నిర్వహించాలన్నారు. కేవలం జూనోటిక్ ఆరిజిన్స్‌, వ్యాప్తి మార్గాల గురించి మాత్రమే పరిశోధన జరగాలని చెప్పారు. 


డబ్ల్యూహెచ్ఓ గత నెలలో ఓ ప్రతిపాదన చేసింది. చైనాలో కరోనా వైరస్ మూలాలను గుర్తించే రెండో దశ అధ్యయనాలు జరగాలని పేర్కొంది. చైనాలోని వూహన్‌, బీజింగ్‌లలో ఉన్న ప్రయోగశాలలు, మార్కెట్ల ఆడిట్ జరగాలని తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ గురువారం విడుదల చేసిన ప్రకటనలో, ప్రస్తుత పరిస్థితిని అన్ని ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా చూడాలని పిలుపునిచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి మూలాలను వేగంగా గుర్తించేందుకు అన్ని ప్రభుత్వాలు సహకరించాలని కోరింది. భవిష్యత్తులో మహమ్మారులను సృష్టించగలిగే రోగ కారకాల విషయంలో చేపట్టవలసిన ఉమ్మడి కార్యాచరణను రూపొందించేందుకు ఏకతాటిపైకి రావాలని కోరింది. 


కోవిడ్-19 వైరస్ మొదట చైనాలోని వూహన్‌లో 2019లో కనిపించింది. ఆ తర్వాత యావత్తు ప్రపంచానికి విస్తరించింది. ఓ శతాబ్దంలో అత్యంత దారుణమైన మహమ్మారిగా ప్రపంచాన్ని వేధిస్తోంది. ఇప్పటి వరకు ఈ మహమ్మారి కారణంగా దాదాపు 43 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2021-08-13T19:22:37+05:30 IST