భారీగా తగ్గిన చైనా జీడీపీ వృద్ధి రేటు

ABN , First Publish Date - 2021-10-19T08:07:55+05:30 IST

ప్రపంచ ఆర్థిక చోదక శక్తి చైనా ఆర్థిక వ్యవస్థ మళ్లీ మందగమనంలోకి సాగుతోంది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంతో పోల్చితే సెప్టెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయింది.

భారీగా తగ్గిన చైనా జీడీపీ వృద్ధి రేటు

సెప్టెంబరు త్రైమాసికంలో 4.9 శాతంగా నమోదు... మున్ముందు మరింత తగ్గే చాన్స్‌ 

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక చోదక శక్తి చైనా ఆర్థిక వ్యవస్థ మళ్లీ మందగమనంలోకి సాగుతోంది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంతో పోల్చితే సెప్టెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి రేటు గణనీయంగా పడిపోయింది. జూన్‌ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.9 శాతంగా ఉండగా సెప్టెంబరు త్రైమాసికానికి ఇది 4.9 శాతానికి తగ్గింది. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, విశ్లేషకులు అంచనా వేసిన 5 నుంచి 6 శాతం కంటే ఇది తక్కువగా ఉండటం గమనార్హం. జనవరి-మార్చి, ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికాలతో పోల్చినా ఇది చాలా తక్కువ. చైనా ఈ ఏడాది జనవరి-మార్చి తొలి త్రైమాసికంలో 18.3 శాతం, ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 7.9 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. కొవిడ్‌ నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకున్నప్పటికీ ఎవర్‌గ్రాండ్‌తో రియల్టీ రంగంలో తలెత్తిన సంక్షోభం చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు డిసెంబరుతో ముగిసే నాలుగో త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి రేటు 3.2 శాతం మించకపోవచ్చని గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా వేస్తోంది. 


తగ్గిన నిరుద్యోగం:

సెప్టెంబరు త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి రేటు నీరసించినా నిరుద్యోగం మాత్రం తగ్గుముఖం పట్టింది. గత ఏడాది ఇదే కాలంలో పట్టణ ప్రాంతాల్లో 5.4 శాతంగా ఉన్న నిరుద్యోగ  రేటు సెప్టెంబరు త్రైమాసికంలో 4.9 శాతానికి తగ్గింది. దీనికి కారణం ఏంటో విశ్లేషకులకూ అంతుపట్టడం లేదు. గత తొమ్మిది నెలల్లో పట్టణ ప్రాంతాల్లో 104.5 లక్షల ఉద్యోగాలు కల్పించినట్టు  చైనా ప్రకటించింది.

Updated Date - 2021-10-19T08:07:55+05:30 IST