కేబుల్‌ వంతెనపై చైనా ఎఫెక్ట్‌.. పనులు పూర్తయినా ప్రారంభించలేని పరిస్థితి

ABN , First Publish Date - 2020-08-11T15:16:35+05:30 IST

కరోనా ప్రభావం దుర్గం చెరువు కేబుల్‌ వంతెన పనులపైనా పడింది. వైరస్‌ విజృంభణ, చైనా వస్తువు ల దిగుమతిపై ఆంక్షల నేపథ్యంలో విద్యుదీకరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. రెండు నెలల క్రితమే నిర్మాణ పనులు పూర్తయినా, పలు కారణాలతో పెండింగ్‌ పడిన ప్రారంభోత్సవం

కేబుల్‌ వంతెనపై చైనా ఎఫెక్ట్‌.. పనులు పూర్తయినా ప్రారంభించలేని పరిస్థితి

విద్యుదీకరణ పనుల్లో జాప్యం వల్లే

అక్కడి నుంచి సామగ్రి వస్తేనే.. 

బీఎస్ఐ అనుమతి తప్పనిసరి

కస్టమ్స్‌ క్లియరెన్స్‌ కూడా... 


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): కరోనా ప్రభావం దుర్గం చెరువు కేబుల్‌ వంతెన పనులపైనా పడింది. వైరస్‌ విజృంభణ, చైనా వస్తువు ల దిగుమతిపై ఆంక్షల నేపథ్యంలో విద్యుదీకరణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. రెండు నెలల క్రితమే నిర్మాణ పనులు పూర్తయినా, పలు కారణాలతో పెండింగ్‌ పడిన ప్రారంభోత్సవం తాజాగా మరోసారి వాయిదా పడింది. చైనా నుంచి విద్యుదీకరణ పనుల మెటీరియల్‌ ఇంకా రాకపోవడమే ఇందుకు కారణం. దీంతో ఆగస్టు 15న కేబుల్‌ వంతెన ప్రారంభోత్సవం జరిగే పరిస్థితి లేకుండా పోయింది. రూ.184 కోట్లతో దుర్గం చెరువుపై ఎక్స్‌ట్రా డోస్‌ అధునాతన ఇంజనీరింగ్‌ పరిజ్ఞానంతో కేబుల్‌ బ్రిడ్జి నిర్మించారు. వాహనాల రాకపోకలతోపాటు వంతెనను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ యోచన. దక్షిణ ఆసియాలోనే ఇంత పెద్ద తీగల వంతెన లేకపోవడం, అదనపు హంగులు అద్దితే చారిత్రక నగరంలో మరో ఐకానిక్‌ టూరిస్ట్‌ స్పాట్‌గా మారే అవకాశముండడంతో పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు ఆదేశాల మేరకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వాహనాలతోపాటు వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌లు ఉన్న వంతెనపై థిమటిక్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సందర్భోచితంగా వెలుగులు ప్రదర్శించేందుకు రూ.9 కోట్లతో ఎలక్ర్టిఫికేషన్‌ పనులు చేపడుతున్నారు. ఈ పనుల కోసం టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించగా, గతంలోనే ఓ సంస్థ ఎంపికైంది. 


చైనా నుంచి వస్తేనే...

ఎలక్ర్టిఫికేషన్‌కు సంబంధించిన మెటీరియల్‌ చైనా నుంచి తీసుకురావాల్సి ఉంది. కరోనా విజృంభణ, చైనా యాప్‌లను నిషేధించడంతోపాటు ఆ దేశం నుంచి వస్తువుల దిగుమతిపైనా సంబంధిత విభాగాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఎలక్ర్టిఫికేషన్‌ మెటీరియల్‌ చైనా నుంచి ఇక్కడికి తీసుకురావాలంటే బ్యూరో ఆఫ్‌ స్టాండర్డ్‌ (బీఎ్‌సఐ) అనుమతి ఉండాలి. బీఎ్‌సఐ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సర్టిఫికెట్‌ పంపిస్తేనే, అక్కడి నుంచి మెటీరియల్‌ రవాణా అవుతుంది. ‘చైనాలో మెటీరియల్‌ సిద్ధంగా ఉంది. బీఎ్‌సఐ ఓకే చేస్తే. ప్యాకింగ్‌ చేసి విమానంలో పంపుతారు’ అని జీహెచ్‌ఎంసీ ఎలక్ర్టికల్‌ విభాగం అధికారొకరు తెలిపారు. బీఎ్‌సఐలో పరిచయమున్న ఓ అధికారితో రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారి మాట్లాడారని, ఒకటి, రెండు రోజుల్లో క్లియరెన్స్‌ వస్తుందని చెప్పారు. మెటీరియల్‌ దేశానికి వచ్చిన అనంతరం కస్టమ్స్‌ క్లియరెన్స్‌ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. కేబుల్‌ వంతెన పనులు రెండు నెలల క్రితమే పూర్తయినా, ట్రాఫిక్‌ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-45లోని ఫ్లైఓవర్‌  నిర్మాణం  పూర్తయ్యాకే ప్రారంభించాలని నిర్ణయించారు. ఈలోపు ఎలక్ర్టిఫికేషన్‌ పనులు పూర్తి చేయాలనుకున్నా, కరోనా ప్రభావంతో ఆలస్యమైంది. రెండు వంతెనలు సిద్ధంగా ఉన్నా, విద్యుదీకరణ పూర్తయితే కానీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు.



Updated Date - 2020-08-11T15:16:35+05:30 IST