అమెరికా చర్యపై చైనా మండిపాటు

ABN , First Publish Date - 2021-08-28T22:06:15+05:30 IST

తైవాన్ జలసంధిలో అమెరికా నావికా దళ నౌకలు చక్కర్లు

అమెరికా చర్యపై చైనా మండిపాటు

బీజింగ్ : తైవాన్ జలసంధిలో అమెరికా నావికా దళ నౌకలు చక్కర్లు కొట్టడంతో చైనా శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్, ఓ కోస్ట్ గార్డ్ కట్టర్ నౌకలు ఈ ప్రాంతంలో ప్రయాణించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఈ జల సంధిలో శాంతి, సుస్థిరతల ప్రధాన ఉల్లంఘనదారు అమెరికాయేనని దుయ్యబట్టింది. 


చైనా మీడియా తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం అర్లీగ్ బుర్కే క్లాస్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యూఎస్ఎస్ కిడ్ లెజెండ్ క్లాస్, యూఎస్ కోస్ట్ గార్డ్ నేషనల్ సెక్యూరిటీ కట్టర్ మున్రో తైవాన్ జల సంధిలో రొటీన్ ట్రాన్సిట్స్ చేసినట్లు అమెరికా సెవెంత్ ఫ్లీట్ శుక్రవారం ప్రకటించింది. జూలైలో కూడా ఈ మార్గంలో అమెరికా గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రయాణించింది. 


చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి టాన్ కెఫీ శనివారం మీడియాతో మాట్లాడుతూ, అమెరికా ఇటువంటి మాయదారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందన్నారు. దీనినిబట్టి తైవాన్ జల సంధిలో శాంతి, సుస్థిరతల ఉల్లంఘనదారు ప్రధానంగా అమెరికాయేనని వెల్లడవుతున్నట్లు తెలిపారు. దీనివల్ల భద్రతాపరమైన నష్టాలు తీవ్రంగా జరుగుతాయని తెలిపారు. అమెరికా చర్యలను చైనా నిరసిస్తోందని, తన అంతర్గత వ్యవహారాల్లో విదేశాల జోక్యానికి చైనా పూర్తి వ్యతిరేకమని తెలిపారు. తైవాన్ విషయంలో కూడా ఇతర దేశాల జోక్యాన్ని సహించబోమని చెప్పారు. 


రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలని, ‘ఒకే చైనా’ విధానాన్ని గౌరవించాలని, యూఎస్-చైనా ప్రకటనలను గౌరవించాలని అమెరికాను చైనా డిమాండ్ చేస్తోందన్నారు. దేశాల సాయుధ దళాల మధ్య సంబంధాలను మరింత సంక్లిష్టం చేయడం, ఈ జల సంధిలో శాంతి, సుస్థిరతలను అణచివేయడం మానుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని, చైనా సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను దృఢంగా కాపాడుతుందని చెప్పారు. 


తైవాన్ దీవి-కాంటినెంటల్ ఆసియా మధ్య తైవాన్ జల సంధి దాదాపు 180 కిలోమీటర్ల మేరకు  ఉంటుంది. ఈ జల సంధి అంతర్జాతీయ జలాల్లో ఉంది. కానీ తైవాన్ తనదేనని చైనా చెప్తోంది. అమెరికా నావికా దళం ఈ ప్రాంతంలోకి రావడాన్ని తైవాన్ ప్రజాస్వామిక ప్రభుత్వానికి మద్దతివ్వడంగా చైనా పరిగణిస్తుంది.


Updated Date - 2021-08-28T22:06:15+05:30 IST