చైనా ఆట

ABN , First Publish Date - 2020-11-05T07:07:50+05:30 IST

దురాక్రమించుకున్నది కాక, రాష్ట్ర ప్రతిపత్తితో మీ దేశంలో కలిపేసుకుంటారా అని గిల్గిత్‌–బాల్టిస్థాన్‌ ప్రజలు పాకిస్థాన్‌మీద మండిపడుతున్నారు...

చైనా ఆట

దురాక్రమించుకున్నది కాక, రాష్ట్ర ప్రతిపత్తితో మీ దేశంలో కలిపేసుకుంటారా అని గిల్గిత్‌–బాల్టిస్థాన్‌ ప్రజలు పాకిస్థాన్‌మీద మండిపడుతున్నారు. తమ భూభాగంమీద ఏ విధమైన హక్కులూ లేని ఒక దురాక్రమణదారు ఇంతటి దుస్సాహసానికి ఒడిగడుతున్నందుకు స్థానిక నాయకులు, రాజకీయపక్షాలు నివ్వెరపోతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో అంతర్భాగంగా, అంతర్జాతీయ వేదికల్లో వివాదాస్పద ప్రాంతంగా ఉన్న గిల్గిత్‌–బాల్టిస్థాన్‌కు పూర్తిస్థాయి రాష్ట్రహోదా ఇచ్చి, నవంబరు 15న ఎన్నికలు నిర్వహించడానికి పాకిస్థాన్‌ సిద్ధపడుతోంది. సింధ్‌, పంజాబ్‌, బలూచిస్థాన్‌, ఖైబర్‌ ఫంక్తున్వాల సరసన ఐదో ప్రావిన్సుగా దీనిని హస్తగతం చేసుకొనే పాక్‌ కుట్రను భారత్‌ తీవ్రంగా ఖండించింది. దొడ్డిదారిన ఆక్రమించుకున్న మా ప్రాంతాలను తక్షణమే ఖాళీచేసి పొమ్మంటూ ఘాటుగా హెచ్చరికలు చేసింది.


సెప్టెంబరులోనే పాకిస్థాన్‌ నుంచి ఈ రీతిన సంకేతాలు వెలువడితే, అటువంటి ఆలోచనలకు తక్షణం స్వస్తిచెప్పాలనీ, చూస్తూ ఊరుకొనేది లేదని భారత్‌ ఘాటుగా ప్రతిస్పందించింది. గిల్గిత్‌ బాల్టిస్థాన్‌ను త్వరలోనే రాష్ట్రంగా మార్చియబోతున్నట్టు పాక్‌ ఆర్మీచీఫ్‌ విపక్ష నాయకులకు తెలియచేసినట్టు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. భారత్‌ హెచ్చరికలకో, భద్రతామండలి భయానికో ఈ ప్రక్రియ ఆగేదేమీ ఉండకపోవచ్చు. తమ విధేయులను నాయకులుగా నిలిపి, పలు పరిమితులతో ఇంతకాలం ఈ ప్రాంతంలో పాకిస్థాన్‌ కొనసాగించిన ప్రజాస్వామ్య నాటకం ఇక రక్తికడుతుంది. అణచివేతకు హద్దులుండవు. విభిన్న జాతులకు, సంస్కృతులకు నిలయమైన ఈ ప్రాంతం ఇప్పటికే తన విలక్షణతని కోల్పోయింది. 1980ల్లోనే జనరల్‌ జియా ఉల్‌హక్‌ పాకిస్థాన్‌లోని అన్ని ప్రాంతాల ప్రజలూ గిల్గిత్‌–బాల్టిస్థాన్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకొనేందుకు అనుమతించి పెనుమార్పులకు బీజం వేశారు. అప్పటినుంచి దురాక్రమణలు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అత్యధికుల ఆకాంక్షమేరకు ఈ ప్రాంతాన్ని మరో ప్రావిన్సుగా పాకిస్థాన్‌లో కలిపేసుకోబోతున్నట్టు ఇమ్రాన్‌ దాని స్వాతంత్ర్య దినవేడుకల్లో ప్రకటించగలిగారంటే స్థానికేతరుల ప్రాబల్యమే కారణం. 


నామమాత్రపు అధికారాలు, స్వేచ్ఛతో నడపడం తప్ప ఆక్రమిత కశ్మీర్‌, గిల్గిత్‌–బాల్టిస్థాన్‌‌లను నేరుగా విలీనం చేసుకుంటే ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్‌ను వివాదాస్పద ప్రాంతంగా కొనసాగించగలిగే వీలుండదని పాకిస్థాన్‌కు తెలుసు. కనుకనే ఇంతకాలమూ అటువంటి విపరీతానికి పాక్‌ సాహసించలేదు. అయితే, గత ఏడాది ఆగస్టులో నరేంద్రమోదీ ప్రభుత్వం 370 అధికరణను రద్దుచేసి, జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా భారత్‌లో కలిపివేయడం, ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ఉపేక్షించడం చూసిన తరువాత, పాకిస్థాన్‌కు ధైర్యం వచ్చినట్టుంది. గిల్గిత్‌–బాల్టిస్థాన్‌కు రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వడం అంటే జమ్మూకాశ్మీర్‌ వివాదాస్పద ప్రాంతం అన్న తన వైఖరిని పాకిస్థాన్‌ ఇకపై అంతర్జాతీయ వేదికల్లో వదులుకున్నట్టేనని కొందరి విశ్లేషణ. 370 అధికరణ రద్దు తెచ్చిపెట్టే అంతర్జాతీయ పర్యవసానాలను మన పాలకులు సరిగా ఊహించలేదన్న విమర్శలు అటుంచితే, భారత్‌ బాటలోనే తానూ నడుస్తున్నానని పాకిస్థాన్‌ ఇప్పుడు అనగలుగుతోంది. తెరవెనుకనుంచి పావులు కదుపుతున్న చైనా ఈ ఆటలో విశేషంగా లబ్ధిపొందనుంది. ‘చైనా పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌–సీపెక్‌’ ప్రవేశద్వారం గిల్గిత్‌. చైనా అధినేత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌’లో సీపెక్‌ అత్యంత కీలకమైనది. దాని భద్రత కోసం గిల్గిత్‌–బాల్టిస్థాన్‌ రాష్ట్రహోదాతో పూర్తిగా అధీనంలోకి తెచ్చుకోమంటూ చైనా ఎప్పటినుంచో పాకిస్థాన్‌ను పోరుతోంది. ఒకవైపు చైనా, మరోవైపు అప్ఘానిస్థాన్‌, ఉత్తరాన మధ్యాసియా దేశాలు సరిహద్దులుగా ఉన్న ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనది. ఇప్పటికే భారత్‌కు చెందిన విశాల భూభాగాలు చైనా నియంత్రణలోకి పోగా, గిల్గిత్‌–బాల్టిస్థాన్‌ విషయంలో పాక్‌ నిర్ణయంతో చైనా మనకు మరింత చేరువగా వచ్చినట్టయింది.

Updated Date - 2020-11-05T07:07:50+05:30 IST