ఇంటా బయటా.. వంచనా శిల్పం

ABN , First Publish Date - 2020-06-20T05:42:16+05:30 IST

గల్వాన్‌ లోయలో చైనా సైన్యం చొరబడడం మోదీకి జరిగిన గర్వభంగంగా భావించిన వాళ్లు ఇద్దరే ఇద్దరు. ఒకరు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. మరొకరు సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్.

ఇంటా బయటా.. వంచనా శిల్పం

గల్వాన్‌ లోయలో చైనా సైన్యం చొరబడడం మోదీకి జరిగిన గర్వభంగంగా భావించిన వాళ్లు ఇద్దరే ఇద్దరు. ఒకరు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. మరొకరు సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్. దేశం వెలుపల నుంచి చైనా వంచనకు పాల్పడుతుంటే,వీళ్లు దేశంలోనే ఉంటూ మన దేశాన్ని, ప్రజలనీ వంచిస్తున్నారు. భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో రాజ్ దీప్ వంటి జర్నలిస్టులు ఇలా గర్వభంగమని రాయడం దేశాన్ని, దేశ ఐక్యతా స్ఫూర్తిని అవమానించడమే.


ప్రపంచమంతా కరోనా వైరస్‌తో విలవిలలాడుతోంది. ఆ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలా అని అంతర్మథనం చెందుతోంది. భారతదేశం కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇటువంటి విపత్కర సమయంలోనే, చైనా మరోసారి తన వంచనా శిల్పాన్ని బయటపెట్టింది. లద్దాఖ్‌ను ఆక్రమించుకోవడమే ధ్యేయంగా తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో సైన్యాన్ని మోహరించింది. ఆయుధ సామగ్రిని అందుబాటులో పెట్టుకుంది. దీనిని గమనించిన భారత్ కూడా దీటుగా సైన్యాన్ని తరలించింది. ఇరు వర్గాల మధ్య వివిధ స్థాయిల్లో దాదాపు 20 సార్లు చర్చలు కూడా జరిగాయి. అయినా, అన్ని ఒప్పందాలనూ ఉల్లంఘించి చైనా గూండాగిరికి దిగింది. నిరాయుధులుగా ఉన్న భారతీయ సైనికులపై ఇనుప మేకులు వెల్డింగ్ చేసిన రాడ్‌లతో కిరాతకంగా, ఏకపక్షంగా దాడి చేసింది. దీనిని మన సైన్యం కూడా వీరోచితంగా తిప్పికొట్టింది. అయినా, కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది సైనికులు వీర మరణం చెందారు. ఈ ఘటనపై దేశం మొత్తం నిర్ఘాంతపోయింది. ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. చైనా తన ఆక్రమణ ఎజెండాలో భాగంగానే మరోసారి దాడికి ప్రయత్నించిందని వివిధ దేశాలు తప్పుబట్టాయి. ఏళ్ల తరబడి ప్రశాంతంగా ఉన్న సరిహద్దుల్లో చైనాయే నిప్పు రాజేసిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. మన దేశానికి, మన సైన్యానికి ఎదురు దెబ్బ తగిలిందని దేశ ప్రజలంతా ఆగ్రహావేశాల్లో ఉన్నారు. చైనాను దెబ్బ తీయడం ఎలా అనే అంతర్మథనంలో ఉన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా దీనిని మోదీకి జరిగిన గర్వభంగంగా భావించిన వాళ్లు ఇద్దరే ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే మరొకరు సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్. చైనా దేశం బయట ఉండి వంచనకు పాల్పడుతుంటే, వీళ్లు దేశంలోనే ఉండి మన దేశాన్ని, దేశ ప్రజలనే వంచిస్తున్నారు. సరిహద్దుల ఆవల నుంచి చైనా విషం చిమ్ముతుంటే.. దేశంలో ఉండే వీరిద్దరూ కాలకూట విషాన్ని చిమ్ముతున్నారు. చైనాపై ప్రతీకారాన్ని ఎలా తీర్చుకోవాలని దేశ ప్రజలంతా ఆగ్రహంతో ఉంటే.. మోదీపై ప్రతీకారం ఎలా తీర్చుకోవాలని వీరిద్దరూ మనో వ్యథ చెందుతున్నారు. ఇందులో భాగంగానే రాజ్‌దీప్ సర్దేశాయ్ తన వ్యాసంలో (జూన్‌ 19) విషం చిమ్మాడు.


గల్వన్ లోయలో ప్రధాని మోదీకి గర్వభంగం జరిగిందని రాజ్‌దీప్ సర్దేశాయ్ రాశాడు. ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రి గా మొత్తం 9 సార్లు మోదీ చైనాకు వెళ్లారని, చైనా నాయకులతో సన్నిహిత సంబంధాలను నెలకొల్పుకోవడానికి వ్యక్తిగత స్థాయిలో అనితర సాధ్యమైన కృషి చేశారని అన్నారు. అయినా, గల్వన్‌లో చైనా దాడి చేసిందని రాశారు. నిజమే. నరేంద్ర మోదీ మాత్రమే కాదు.. నెహ్రూ నుంచి ఇప్పటి వరకూ భారతదేశానికి ప్రధానులుగా వ్యవహరించిన అందరూ చైనా, ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాలను నెలకొల్పుకోవడానికే ప్రయత్నించారు. కానీ, అన్ని సందర్భాల్లోనూ నమ్మక ద్రోహం చేయడానికే చైనా పెద్దపీట వేసింది. అయినా, ఆ దేశానికి మనం స్నేహ హస్తాన్ని చాస్తూనే ఉంటాం. నాయకులు ఎవరైనా ఇది భారతదేశ సంస్కృతి. భారత్, చీనీ భాయీ భాయీ అని నెహ్రూ అన్నా.. తొమ్మిదిసార్లు మోదీ పర్యటించినా పరమార్థం ఇదే. భారతదేశానికి ఒక విదేశాంగ విధానం ఉంది. మనం ఏ దేశంలోనూ శత్రుత్వం కొని తెచ్చుకోం. అందరికీ మిత్రుడుగానే ఉంటాం. అదే సమయంలో, మనపైకి దండయాత్ర చేస్తే తిప్పికొడతాం. మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం. నెహ్రూ అలీన ఉద్యమ నినాదం ఇదే. పంచశీల సూత్రాల సారమూ ఇదే. పంచశీల సూత్రాలను ఉల్లంఘించి మరీ చైనా మన దేశంపైకి దాడి చేసింది. ఇందుకు కారణం 1959లో దలైలామాకు భారతదేశం ఆశ్రయం ఇవ్వడం. టిబెట్ సార్వభౌమత్వాన్ని గుర్తించడం. ఈ రెండు అంశాలను నెహ్రూ కూడా సమర్థించాడు. అందుకే, భారతదేశ నాయకత్వంపై చైనాకు కక్ష. దీనికితోడు, టిబెట్‌కు అదనంగా లద్దాఖ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, నేపాల్, భూటాన్‌లనూ చెరబట్టాలని మావో జెడాంగ్ కాలం నుంచే ఆ దేశం కుట్రలు పన్నుతూ ఉంది. ఆ దేశంతో రెండు యుద్ధాలు ఇందులో భాగమే. లెక్కకు మిక్కిలి ఒప్పందాలూ మన భూభాగాలను రక్షించుకోవడానికే. సరిహద్దుల్లో మన సైనికులు పోరాటమూ చేస్తున్నారు. ఈ విషయంలో ఇంతకుముందు నాయకులు అనుసరించిన మార్గాన్నే మోదీ కూడా పాటిస్తున్నారు. చైనాతో మిత్రత్వం కొనసాగిస్తూనే మన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నాం. అయితే, కొంతమంది వామపక్ష మేధావులు, కుహనా మేధావుల ప్రచారం కారణంగా అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు మోదీ విషయంలో కొంతకాలం ఒక అపోహలో ఉన్న విషయం నిజమే. కానీ, కొన్ని సంవత్సరాల్లోనే అవన్నీ దీని నుంచి బయటపడ్డాయి.


మోదీ నిజాయతీ, నిష్పాక్షికతను గుర్తించాయి. అందుకే, మోదీకి రెడ్ కార్పెట్ పరిచాయి. నెహ్రూ, రాజీవ్ ఒరవడిననే ప్రధాని అయిన తర్వాత మోదీ కూడా కొనసాగించారు. తన ప్రమాణ స్వీకారానికి సరిహద్దు దేశాలన్నిటినీ పిలిచారు. సరిహద్దు దేశాలు మాత్రమే కాదు.. ప్రపంచ దేశాలు అన్నిటితోనూ ఒక సామరస్యపూర్వక వాతావరణం ఏర్పరిచారు. సరిహద్దు దేశాలతో సఖ్యతగా ఉండాలని చైనాకు వెళ్లారు. దీనిలో భాగంగానే ‘వూహాన్ స్ఫూర్తి’ తెరపైకి వచ్చింది. ఏ సమస్య అయినా సామరస్యంగా పరిష్కరించుకోవాలనేది దీని లక్ష్యం. నెహ్రూ హయాంలో పంచశీలను తుంగలో తొక్కినట్లే ఇప్పుడు వూహాన్ స్ఫూర్తినీ చైనా తుంగలో తొక్కింది. అప్పట్లో నమ్మక ద్రోహం చేసినట్లే ఇప్పుడు కూడా వంచనకు పాల్పడింది. చైనా నమ్మక ద్రోహం చేస్తుందని తెలుసు. అందుకు దీటుగా జవాబు చెప్పే మార్గాలూ భారత్ వద్ద ఉన్నాయి.


మన దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే విషయంలో మోదీ సర్కారు ఏనాడూ రాజీ పడలేదు. సందర్భం వచ్చిన ప్రతిసారీ ఈ విషయంలో మన సత్తాను నిరూపించుకుంటూనే ఉన్నాం, నిరూపించుకుంటూనే ఉంటాం. ఇప్పటికే మేజర్ జనరల్ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈనెల 27న రష్యా, చైనా, భారత విదేశాంగ శాఖ మంత్రుల మధ్య సమావేశం ఉంది. ఆ సమావేశంలో మన వాదనను గట్టిగా వినిపిస్తాం. దీనికితోడు, ఎటువంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కొనేందుకూ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇది నెహ్రూ ప్రభుత్వం కాదు, నరేంద్ర మోదీ ప్రభుత్వం. కొత్తగా భారత భూభాగాన్ని ఆక్రమించే అవకాశాన్ని మోదీ ప్రభుత్వం ఇవ్వదు. ఒక్క ఇంచీ భూమిని కూడా చైనాకు కానీ ఇంకా ఏ దేశానికి కానీ వదిలే ప్రసక్తే లేదు. నేపాల్, చైనా, పాకిస్థాన్ కలిసికట్టుగా పోరాడినా విజయం మనదే. అటువంటి మిలటరీ శక్తి మనకుంది. 130 కోట్ల భారతీయుల దృఢ సంకల్పం మోదీకే అనుకూలంగా ఉంది. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉంది. కానీ, ప్రతిపక్ష నేత, కొందరు జర్నలిస్టులు మాత్రం విపత్కర సమయంలో విదేశాలకు ఆయుధాలు అందిస్తున్నారు. 1962, 1971 సంవత్సరాల్లో చైనాతో యుద్ధం జరిగినప్పుడు అప్పటి ప్రధానులు నెహ్రూ, ఇందిరా గాంధీలకు అప్పటి ప్రతిపక్ష నేత అటల్ బిహారీ వాజపేయి అండగా నిలిచారు. ఇందిరను అపర కాళికగా అభివర్ణించారు. కానీ, ఇప్పుడు రాహుల్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాడు. భారత ప్రభుత్వాన్ని తప్పుబడుతూ చైనాకు ఆయుధాలు అందిస్తున్నాడు. అటువంటి రాహుల్‌కు మద్దతు ఇచ్చేలా రాజ్‌దీప్ సర్దేశాయ్ వ్యవహరించడం దారుణం. దేశ ప్రయోజనాలను, ప్రజల సెంటిమెంట్లను త్రోసిరాజని వ్యక్తిగతంగా విషం చిమ్మడం అభ్యంతరకరం. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో రాజ్‌దీప్ వంటి జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. దేశానికి నష్టం కలిగించే ఇలాంటి రచనలు మానుకోవాలి. ఏమైనా నిర్మాణాత్మక సూచనలు ఉంటే వేరే రూపంలో తెలియచేయాలి. కానీ, ఇలా గర్వభంగమని రాయడం దేశాన్ని, దేశ ఐక్యతాస్ఫూర్తిని అవమానించడమే.




(కేంద్ర హోంశాఖ సహాయమంత్రి)

జి. కిషన్‌ రెడ్డి

Updated Date - 2020-06-20T05:42:16+05:30 IST