10 మంది.. 3 రోజులు..!

ABN , First Publish Date - 2020-06-26T18:39:05+05:30 IST

గల్వాన్‌లోయలో చైనా కుట్రపూరితంగా దాడి చేయడమే కాదు.. ఘర్షణలో భాగంగా వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) దాటిన మన సైనికులను తిరిగి

10 మంది.. 3 రోజులు..!

మన సైనికులను బందీలుగా ఉంచిన చైనా 

16నే చైనా జవాన్లను అప్పగించిన భారత్‌

మన వాళ్లను పంపడంలో మాత్రం డ్రాగన్‌ జాప్యం


న్యూఢిల్లీ: గల్వాన్‌లోయలో చైనా కుట్రపూరితంగా దాడి చేయడమే కాదు.. ఘర్షణలో భాగంగా వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) దాటిన మన సైనికులను తిరిగి అప్పగించడంలోనూ తన దుర్బుద్ధిని చాటుకుంది. ఈ నెల 15న రాత్రి చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో కల్నల్‌ సంతో్‌షబాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఆ రోజు రాత్రి గస్తీ కేంద్రం (పీపీ) 14 వద్ద వేసిన టెంట్లను తొలగించాలని చెప్పడానికి వెళ్లిన కల్నల్‌ సంతో్‌షబాబు బృందంపై చైనా సైనికులు హఠాత్తుగా దాడికి దిగారు. ఇనుపరాడ్లు, మేకులు కొట్టిన కర్రలు, బ్యాట్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. కల్నల్‌ సంతో్‌షపై దాడితో రెచ్చిపోయిన మన 16 బిహార్‌ రెజిమెంట్‌ సైనికులు చైనా జవాన్లను వెంటాడి వెంటాడి కొట్టారు. ఆ రాత్రి జరిగిన ఘర్షణలో చైనా సైనికులు 40 మందికి పైగానే మరణించినట్లు నిఘా వర్గాల సమాచారం. అయితే చైనా ఇప్పటికీ మరణాల సంఖ్యను వెల్లడించకపోవడంతో అంతకంటే ఎక్కువ మందే చనిపోయి ఉంటారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరుదేశాల మధ్య జరిగిన ఈ భీకర ఘర్షణలో గాయపడిన 50 మంది మన సైనికులను అప్పగించడంలో చైనా జాప్యం చేసింది. 16వ తేదీనే పదుల సంఖ్యలో చైనా సైనికులను మన సైన్యం తిరిగి వారికి అప్పగించింది. మన జవాన్లు 50 మంది దాదాపు ఒకరోజు తర్వాత అప్పగించింది. ఆలస్యంగానైనా చైనా సైన్యం మన జవాన్లందరినీ తిరిగి పంపలేదు. వాస్తవ నియంత్రణ రేఖ దాటిన వారిలో నలుగురు అధికారులు సహా పది మందిని తన వద్దే ఉంచుకుంది. వారిని పంపుతామని చెబుతూనే జాప్యం చేసింది. మన సైనికాధికారులు మూడు రోజులు తీవ్రంగా చర్చలు జరిపారు. ఎట్టకేలకు 18న ఆ పది మంది సైనికులను సురక్షితంగా అప్పగించిందని తెలిపాయి. కాగా, వాస్తవాధీన రేఖ వద్ద నెలకొన్న ప్రతిష్టంభనకు చైనాయే కారణమని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఆరోపించింది. ఇరుదేశాల మధ్య కుదిరిన పరస్పర ఒప్పందాలన్నింటినీ చైనా ఉల్లంఘించిందని పేర్కొంది. ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు, ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధమని భారత్‌లోని చైనా రాయబారి సన్‌ వీడాంగ్‌ తెలిపారు. సరిహద్దు వివాదాన్ని భారత్‌, చైనా దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పిలుపునిచ్చారు. కాగా, గల్వాన్‌లో జరిగిన ఘర్షణలో సహచరుడ్ని కాపాడబోయిన మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన జవాను మరణించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సజీత్‌ పాటిల్‌ గురువారం వెల్లడించారు. నదిలో పడిపోయిన ఇద్దరు జవాన్లను కాపాడే ప్రయత్నంలో సచిన్‌ మోరే కన్నుమూసినట్లు తెలిపారు.  


పార్లమెంటును సమావేశ పరచాలి

చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన సహా కరోనా వ్యాప్తి తదితర ప్రధానమైన సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం వెంటనే పార్లమెంటును వర్చువల్‌గా సమావేశపరచాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. కాగా, ప్రధాని మోదీ అసమర్ధత వల్లే భారత భూభాగాన్ని చైనా ఆక్రమించే ప్రయత్నం చేస్తోందని మజ్లిస్‌పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు.   

Updated Date - 2020-06-26T18:39:05+05:30 IST