Abn logo
Jul 8 2020 @ 01:59AM

భారతీయ కంపెనీలపై డ్రాగన్‌ కన్ను!

  • లాక్‌డౌన్‌ సమయంలో కుయుక్తులు
  • షేర్‌ మార్కెట్లు కుప్పకూలగానే బడా కంపెనీల షేర్ల కొనుగోలు
  • గుర్తించిన భారత్‌.. విదేశీ పెట్టుబడుల నిబంధనల సవరణ


సామ్రాజ్యవాద ధోరణితో ఓ వైపు భారత్‌లోని భూభాగాలను కబళించాల ని కుయుక్తులకు పాల్పడుతున్న చైనా..మరోవైపు భారతీయ కంపెనీలను తన అదుపాజ్ఞల్లో పెట్టుకునేందుకు కుతంత్రాలకు పాల్పడింది. కరోనా లాక్‌డౌన్‌తో షేర్‌ మార్కెట్లు ఢమాల్‌ అయిన కాలాన్ని తనకు అనుకూలంగా మలచుకుం ది. విడతల వారీగా వందలు, వేల కోట్ల పెట్టుబడులతో బడా కంపెనీల షేర్లు కొనుగోలు చేసి, వాటిని గుప్పిట పెట్టుకునేందుకు ప్రయత్నించింది. కొన్ని కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసింది. ఈ పన్నాగాన్ని గుర్తించిన భారత సర్కారు వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టి.. డ్రాగన్‌ ఆటను కట్టించింది. కరోనా వైర్‌సకు పుట్టినిల్లు అయిన వూహాన్‌లో కొవిడ్‌-19 ఒక కుదుపు కుదిపినప్పుడు అక్కడి విదేశీ కంపెనీలు బెంబేలెత్తిపోయిన విషయం గుర్తుందా? అప్పుడు డ్రాగన్‌ దేశం ఏం చేసిందో తెలుసా? షేర్‌ మార్కెట్లో ఆ కంపెనీల విలువ పతనం కాగానే వాటిని ఏకపక్షంగా కొనేసింది. కొన్ని విదేశీ కంపెనీలైతే పెట్టెబేడా సర్దుకుని వెళ్లిపోయాయి. మావో కాలంలో దీన్నే ‘కాలిపోతున్న ఇంటిని దోచుకో’ అనే సిద్ధాంతంగా పేర్కొనేవారు. అచ్చంగా అదే కుట్రను భారత కంపెనీలపైనా అమలు చేయడానికి డ్రాగన్‌ వ్యూహం పన్నింది. భారత్‌లోని షేర్‌ మార్కెట్లలో పెట్టుబడులకు చైనాకు రెండేళ్ల కింద టే అనుమతి వచ్చింది. కానీ, ఇక్కడి మార్కెట్లపై ఆసక్తిచూపలేదు.


భారత్‌లో కరోనా కల్లో లం ప్రారంభమయ్యాక.. షేర్‌ మార్కెట్లలో వరుసగా నష్టాలు మొదలయ్యాక.. చైనా సెంట్రల్‌ బ్యాంకు అయిన.. పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా(పీబీఓసీ) రంగంలోకి దిగింది. ఏప్రిల్‌ నెలలో 10-12 తేదీల మధ్య పెట్టుబడుల వరదను పొంగించింది. బడా బ్యాంకులు, దిగ్గజ కంపెనీలను టార్గెట్‌గా చేసుకుంది. ఎంతలా అంటే.. కొన్ని కంపెనీల్లో వందల కోట్లు పెట్టి 1శాతం వరకు షేర్లను హస్తగతం చేసుకుంది. హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకులో ఏకంగా రూ.3,100 కోట్ల పెట్టుబడులు పెట్టింది. అంబుజా సిమెంట్‌లో 0.32శాతం (రూ.122 కోట్లు), పిర్మల్‌ ఎంటర్‌ ప్రైజె్‌సలో 0.43శాతం(రూ.137 కోట్లు) షేర్లను కొనుగోలు చేసింది. అలా క్రమంగా పెట్టుబడులు పెడుతూ.. ఆయా కంపెనీల్లో ప్రధాన షేర్‌ హోల్డర్‌ అవ్వాలని ఎత్తుగడ వేసింది. అయితే.. ఏప్రిల్‌ 14న కేంద్ర ప్రభుత్వం ఆ కుట్రను గుర్తించింది. ఆగమేఘాల మీద విదేశీ పెట్టుబడుల విధానాన్ని సవరించింది. భారత్‌తో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు ఇక్కడి మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలంటే కేంద్రం అనుమతి కావాలని ప్రకటించి.. డ్రాగన్‌ కుట్రను అడ్డుకుంది.


స్టార్ట్‌పలపై డేగ కన్ను

భారత్‌లోని స్టార్టప్‌ కంపెనీలపై డ్రాగన్‌ దేశం డేగ కన్నువేసింది. గేట్‌ వే హౌస్‌ సంస్థ రూపొందించిన ఓ నివేదికలో చైనా కంపెనీలన్నీ భారత్‌లోని స్టార్ట్‌పలను పెట్టుబడులకు స్వర్గధామాలుగా ఎంచుకున్నట్లు వెల్లడించింది. అద్భుతమైన ఆలోచనలు ఉన్నా.. ఆర్థిక ప్రోత్సాహం లేనివారిని గుర్తించి, పెట్టుబడులు పెట్టింది. అలా చాలా స్టార్టప్‌ కంపెనీల్లో చైనాకు చెందిన అలీబాబా, టెన్సెంట్‌ వంటి సంస్థలు పాగా వేశాయి. అలా 2014 నుంచి ఇప్పటి వరకు చైనా కంపెనీలు పెట్టిన పెట్టుబడుల విలువ అధికారిక లెక్కల ప్రకారం అక్షరాలా 2 లక్షల కోట్ల రూపాయలు. అనధికారికంగా ఈ లెక్క ఇంకా ఎక్కువగానే ఉంటుంది. నిర్మాణ రంగంలోనూ రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులకు చైనా ప్రణాళిక రూపొందించుకుంది. సాంకేతిక రంగంలోనూ ఇన్వె్‌స్టమెంట్లకు సిద్ధమైంది. కానీ, విదేశీ పెట్టుబడుల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించాక ఆ కుట్రలకు బ్రేకులు పడ్డాయి. - సెంట్రల్‌ డెస్క్‌

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement