Abn logo
Sep 28 2021 @ 00:19AM

పాక్, చైనాలను బోనెక్కించారు!

డెబ్భయ్యొక్క సంవత్సరాల వయస్సులో మోదీ 65 గంటల సుడిగాలి అమెరికా పర్యటనలో అగ్రదేశాధినేతలతో పాటు అయిదుగురు అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో సమావేశం కావడం, నిర్విరామంగా 24 సమావేశాలు నిర్వహించడం, తిరిగి వచ్చిన వెంటనే నూతన పార్లమెంటు భవన నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించడం... అలసట ఎరుగని ఆయన వ్యక్తిత్వాన్ని స్పష్టం చేస్తోంది.


‘భారతదేశంలో చాయ్ అమ్మినవాడు ఇవాళ మీ ముందు నాలుగోసారి నిలుచుని మాట్లాడగలుగుతున్నాడు. ఇది మా దేశ ప్రజాస్వామ్య ఘనత’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత శనివారం నాడు ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో చెప్పారు. ఒక చాయ్ వాలా గుజరాత్ రాష్ట్రంలో పదమూడేళ్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నెరవేర్చి, తర్వాత ఏడేళ్లుగా ప్రధానమంత్రిగా కొనసాగుతుండడం, మొత్తం ఇరవైయేళ్ళపాటు అధికారంలో నిరాఘాటంగా కొనసాగడం, నాలుగు సార్లు ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో ప్రసంగించడం– ప్రజాస్వామ్యంలో అద్భుతం. అసలు మోదీ ప్రయాణమే ప్రజాస్వామ్య విజయానికి చిహ్నం. 


76వ ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో ఇటీవల నరేంద్ర మోదీ తొలివక్తగా ఇరవైరెండు నిమిషాలు ప్రసంగించారు. అందులోనూ ఆయన ప్రతిమాటలో భారతదేశ ఔన్నత్యం తొణికిసలాడింది. ‘భారతదేశం అభివృద్ధి చెందితే ప్రపంచం అభివృద్ధి చెందుతుంది. భారత్‍లో పరివర్తన జరిగితే ప్రపంచంలో పరివర్తన జరుగుతుంది’ అని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలను మోదీ చీల్చి చెండాడారు. తిరోగమన ఆలోచనా విధానం ఉన్న దేశాలు ఉగ్రవాదాన్ని ఒక రాజకీయ ఉపకరణంగా వాడుకుంటున్న విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారు.


అఫ్ఘానిస్థాన్‌లో ఉన్న సున్నితమైన పరిస్థితిని స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోకుండా అన్ని దేశాలూ కలిసికట్టుగా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. సముద్ర జలాలను, జలవనరులను పరిరక్షించుకోవాలని, సముద్ర జలాలను ఎవరూ తమ విస్తరణకు ఉపయోగించుకోకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. మోదీ ఈ మాటల ద్వారా ఏ దేశాలపై తన దాడి ఎక్కుపెట్టారో ప్రపంచానికి అర్థమైంది. ఉగ్రవాదాన్ని పావుగా వాడుకుంటూ, అఫ్ఘాన్ నేలను స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్న పాకిస్థాన్‌ను, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దుందుడుకుగా చేస్తున్న విస్తరణనూ ఆయన తీవ్రంగా విమర్శించారు. ‘సరైన చర్యను సరైన సమయంలో తీసుకోకపోతే కాలమే ఆ చర్యల్ని విఫలం చేస్తుంది’ అని క్రీస్తు పుట్టకముందు 375 బిసిలో భారతీయ మేధావి చాణక్యుడు చెప్పిన మాటల్ని ఆయన ఐక్యరాజ్యసమితిలో 109 దేశాల ప్రతినిధుల ముందు గుర్తు చేశారు. ‘ఐక్యరాజ్యసమితి కూడా తన ఉనికిని అర్థవంతం చేసుకోవాలంటే తన సామర్థ్యాన్ని, విశ్వసనీయతను పెంచుకోవాలి’ అని ధైర్యంగా ప్రకటించారు.

 

అమెరికాలో మోదీ మూడు రోజుల పర్యటన ఆయన లక్ష్యాలకు అనుగుణంగా సాగింది. అఫ్ఘాన్‌లో ఉగ్రవాదానికి చేయూతనిచ్చి పబ్బం గడుపుకోవాలనుకుంటున్న పాకిస్థాన్ ప్రయత్నాలనూ అన్ని దేశాలు గమనిస్తున్నాయి. నిజానికి పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా తీర్మానించాలని భారత్ గతంలో చేసిన వాదనలను అగ్రరాజ్యాలు ఒకప్పుడు పట్టించుకోలేదు. సెప్టెంబర్ నెల ప్రపంచం మరిచిపోలేని నెల. ఇరవయ్యేళ్ళ క్రితం ఇదే సెప్టెంబరు 11న అమెరికాలో ఉగ్రవాదం సృష్టించి భీభత్సం ప్రపంచమంతటికీ గుర్తుంది. ఇవాళ ఉగ్రవాదమే జీవనోపాధిగా బతుకుతున్న పాకిస్థాన్ ఈ భీభత్సానికి కారకులైన వారిని ప్రోత్సహించిన విషయం కూడా ప్రపంచానికి తెలిసిన విషయమే.


అయినప్పటికీ సాధారణ అసెంబ్లీలో కశ్మీరు అంశాన్ని లేవనెత్తి, ఉగ్రవాదులను స్వాతంత్ర్య పోరాటయోధులుగా అభివర్ణించేందుకు వీడియో ప్రసంగం ద్వారా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతకుముందు చేసిన విఫలయత్నాన్ని పాకిస్థాన్ జర్నలిస్టులే తీవ్రంగా విమర్శించారు. ముజాహిదీన్లను ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు రీగన్ వైట్ హౌసుకు పిలిపించారంటూ ఆయన తప్పుడు సమాచారాన్ని ప్రకటించడం హాస్యాస్పదంగా మారింది. అత్యంత ప్రతిష్ఠాత్మక వేదికపై ఫేక్ న్యూస్ ద్వారా స్వదేశాన్ని సమర్థించే ప్రయత్నం చేయడం వల్ల అంతర్జాతీయంగా పాక్ పరువు పోయిందని ఆ దేశపు మహిళా జర్నలిస్టు ఘరీదా ఫరూఖీ ట్వీట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాన్ని భారత్ పూచికపుల్లలా తీసి పారేసింది.


ఐక్యరాజ్యసమితిలో భారత్ తరఫున ఫస్ట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఒక పాతికేళ్ళ యువతి స్నేహా దుబే ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాన్ని తీవ్రంగా ఖండించి ఒక్కో మాటనూ తుత్తునియలు చేశారు: ‘ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాదుల్లో అత్యధికులకు పాకిస్థాన్ ఆశ్రయమిస్తున్న మాట వాస్తవం కాదా? ఒసామా బిన్ లాడెన్ పాక్‌లో తలదాచుకున్న మాట వాస్తవం కాదా? ఆయనను ఇప్పటికీ అమరుడుగా పాక్ నాయకత్వం కీర్తిస్తున్న మాట సత్యం కాదా? ఇమ్రాన్ ఖాన్ జీ, భారత్ గురించి తప్పుడు ప్రచారం చేయకండి. భారత్ కోట్లాదిమంది మైనారిటీలు సురక్షితంగా నివసిస్తున్న బహుళ ప్రజాస్వామ్య దేశం. ముందు మీరు కశ్మీరులో అక్రమంగా స్వాధీనపరుచుకున్న ప్రాంతాలను ఖాళీ చేయండి,’ అని ఈ యువ దౌత్యవేత్త గర్జించడం మొత్తం ప్రపంచంలో భారతీయులను గర్వపడేలా చేసింది. 


మోదీ తన మూడురోజుల పర్యటనలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిగా సుగే... వీరితో వాషింగ్టన్ డీసీలో అమెరికా అధ్యక్ష నివాసమైన వైట్ హౌసులో విజయవంతంగా చర్చలు జరిపారు. క్వాడ్ గ్రూప్ దేశాల తొలి ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. సాధారణ అసెంబ్లీలో మోదీ పరోక్షంగా ప్రస్తావించిన అంశాలపైనే ఈ దేశాధినేతలు అత్యంత కీలక సమాలోచనలు జరిపారు. చైనా విస్తరణ, అఫ్ఘాన్‌లో పరిణామాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఈ పర్యటనలో భారత దేశానికి ఇచ్చిన ప్రాధాన్యత సామాన్యమైనది కాదు.


ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఉగ్రవాదం, విస్తరణ, మాదకద్రవ్యాలు మొదలైన విషయాల్లో భారత్‍ను భాగస్వామి చేసుకోవడం మన దేశానికి అంతర్జాతీయ సంబంధాల్లో లభిస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‍కు శాశ్వతసభ్యత్వం లభించేందుకు మద్దతునిస్తామని, అణు సరఫరాల దేశాల్లో భారత్‍ను చేర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించడమే కాక, భద్రతామండలికి గత ఆగస్టులో బలమైన నాయకత్వం అందించినందుకు మోదీని ప్రశంసించారు. డెబ్భయ్యొక్క సంవత్సరాల వయస్సులో మోదీ 65 గంటల సుడిగాలి అమెరికా పర్యటనలో అగ్రదేశాధినేతలతో పాటు అయిదుగురు అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో సమావేశం కావడం, నిర్విరామంగా 24 సమావేశాలు నిర్వహించడం, తిరిగి వచ్చిన వెంటనే నూతన పార్లమెంటు భవన నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించడం... అలసట ఎరుగని ఆయన వ్యక్తిత్వాన్ని స్పష్టం చేస్తోంది. ఈ అలుపెరగని యోధుడు మనదేశానికి నాయకత్వం వహించడం మనం గర్వించదగ్గ విషయం.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)