సీడీఎస్ జనరల్ రావత్ వ్యాఖ్యలపై చైనా నిరసన

ABN , First Publish Date - 2021-11-26T01:46:58+05:30 IST

భారత దేశ భద్రతకు అతి పెద్ద ముప్పు చైనాయేనని

సీడీఎస్ జనరల్ రావత్ వ్యాఖ్యలపై చైనా నిరసన

బీజింగ్ : భారత దేశ భద్రతకు అతి పెద్ద ముప్పు చైనాయేనని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ చెప్పడంపై చైనా నిరసన తెలిపింది. ఆయన భౌగోళిక, రాజకీయ ఘర్షణను పురిగొలుపుతున్నారని ఆరోపించింది. ఇరు దేశాలు ఏర్పాటు చేసుకున్న మార్గదర్శకాలను ఆయన ఉల్లంఘిస్తున్నారని పేర్కొంది. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారహితం, ప్రమాదకరం అని పేర్కొంటూ, దౌత్యపరంగా అసంతృప్తిని భారత ప్రభుత్వానికి తెలియజేసినట్లు తెలిపింది. 


సీడీఎస్ జనరల్ రావత్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, భారత దేశం ఎదుర్కొంటున్న భద్రతాపరమైన ముప్పుల్లో అతి పెద్దది చైనాయేనని చెప్పారు. పాకిస్థాన్ నుంచి కన్నా చైనా నుంచి ముప్పు ఎక్కువగా ఉందన్నారు. భూమి సరిహద్దుల్లో కానీ, సముద్రాల్లో కానీ ఎలాంటి దుస్సాహసాన్ని అయినా దీటుగా ఎదుర్కొనేందుకు భారత దేశం సంసిద్ధంగా ఉందని చెప్పారు. భారత దేశానికి అత్యంత ప్రధాన శత్రువు చైనాయేనా? అని అడిగినపుడు రావత్ మాట్లాడుతూ, ‘‘సందేహం లేదు. ఉత్తర సరిహద్దుల్లో ముప్పు చాలా ఎక్కువ’’ అని చెప్పారు. నమ్మకం లేకపోవడం, అనుమానం పెరుగుతుండటం ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం పరిష్కారం కాకుండా అడ్డుకుంటున్న అంశాలని తెలిపారు. 


చైనా రక్షణ మంత్రిత్వ శాఖ బీజింగ్‌లో నెలవారీ నిర్వహించే పత్రికా సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో ఈ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ వూ కియాన్ మాట్లాడుతూ, రావత్ వ్యాఖ్యలపై స్పందించారు. ఒకరికొకరు ముప్పు కాదనే ఇరు దేశాల నేతల వ్యూహాత్మక మార్గదర్శకాలను భారత దేశ అధికారుల వ్యాఖ్యలు ఉల్లంఘిస్తున్నాయన్నారు. ‘చైనా సైన్యం ముప్పు’ అనే వ్యాఖ్యలు ఇరు దేశాల నేతల మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. భౌగోళిక, రాజకీయ ఘర్షణను రెచ్చగొట్టడం బాధ్యతారహితం, ప్రమాదకరం అని చెప్పారు. దీనిపై భారత దేశానికి తమ తీవ్ర నిరసనను తెలియజేశామని, దౌత్యపరంగా అసంతృప్తిని వ్యక్తం చేశామని చెప్పారు. చైనా-భారత్ సరిహద్దు వివాదంలో చైనా వైఖరి సుస్పష్టంగా ఉందని, ఎటువంటి సందిగ్ధత లేదని చెప్పారు. చైనా సరిహద్దు దళాలు దేశ సార్వభౌమాధికారం, భద్రతలను కాపాడటానికి దృఢ నిశ్చయంతో ఉన్నాయన్నారు. అదే సమయంలో సరిహద్దు ప్రాంతంలో శాంతి, సామరస్యాలను కొనసాగించడానికి కట్టుబడి ఉన్నాయని చెప్పారు. పరిస్థితిని చక్కదిద్దడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - 2021-11-26T01:46:58+05:30 IST