డబ్ల్యూహెచ్ఓ ప్లాన్‌ను తిరస్కరించిన చైనా

ABN , First Publish Date - 2021-07-22T18:46:48+05:30 IST

కరోనా వైరస్ ప్రారంభ స్థానాన్ని గుర్తించేందుకు రెండో

డబ్ల్యూహెచ్ఓ ప్లాన్‌ను తిరస్కరించిన చైనా

బీజింగ్ : కరోనా వైరస్ ప్రారంభ స్థానాన్ని గుర్తించేందుకు రెండో దశ దర్యాప్తు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించిన ప్రణాళికను చైనా తిరస్కరించింది. చైనాలోని ఓ ప్రయోగశాల నుంచి ఈ వైరస్ బయటకు వెళ్ళిందనే కోణంలో దర్యాప్తు జరపాలని డబ్ల్యూహెచ్ఓ ప్రతిపాదించింది. ఈ అధ్యయనంలో భాగంగా చైనాలోని ప్రయోగశాలలు, మార్కెట్లలో ఆడిట్ చేయాలని ప్రతిపాదించింది. కానీ ఈ ప్రతిపాదనలను చైనా తిరస్కరించినట్లు నేషనల్ హెల్త్ కమిషన్ వైస్ మినిస్టర్ జెంగ్ యిక్సిన్ గురువారం విలేకర్లకు తెలిపారు. 


కరోనా వైరస్ ప్రారంభ స్థానాన్ని గుర్తించేందుకు రెండోసారి అధ్యయనం చేయాలని డబ్ల్యూహెచ్ఓ తాజాగా ప్రతిపాదించింది. చైనాలోని వూహన్ నగరంలో ఉన్న ప్రయోగశాలలు, మార్కెట్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని తెలిపింది. 


ఈ నేపథ్యంలో జెంగ్ యిక్సిన్ మాట్లాడుతూ, తాము ఇటువంటి ప్రారంభ స్థానాల జాడను గుర్తించే ప్రణాళికను అంగీకరించబోమని తెలిపారు. ఈ ప్రణాళిక ఇంగితజ్ఞానాన్ని లక్ష్యపెట్టడం లేదని, సైన్స్‌ను ధిక్కరిస్తోందని చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ ప్లాన్‌ను చదివి తాను అవాక్కయ్యానన్నారు. ప్రయోగశాలలో పరిశోధన జరిగే సమయంలో నిబంధనలను చైనా ఉల్లంఘించడం వల్ల వైరస్ లీక్ అయ్యిందనే ఊహా కల్పనతో దర్యాప్తు జరపాలని ఈ ప్రణాళికలో ఉందన్నారు. 


చైనాలో కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైన తొలి రోజులనాటి సమాచారం లేకపోవడం వల్ల చైనాలో ఈ మహమ్మారి ప్రారంభంపై దర్యాప్తు జరపడానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ ఇటీవల పేర్కొంది. దీనిపై జెంగ్ స్పందిస్తూ, గోప్యతకు సంబంధించిన కారణాల వల్ల కొంత సమాచారాన్ని పూర్తిగా పంచుకోవడం సాధ్యం కాదన్నారు. చైనా నిపుణులు ఇచ్చిన సలహాలను డబ్ల్యూహెచ్ఓ శ్రద్ధగా పరిశీలిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ అధ్యయనాన్ని రాజకీయం చేయడాన్ని చైనా వ్యతిరేకిస్తోందని చెప్పారు. 


Updated Date - 2021-07-22T18:46:48+05:30 IST