కరోనాతోనే చస్తోంటే.. డ్రాగన్ నుంచి భారత్‌కు మరో ముప్పు.. ఢిల్లీ నెత్తిన ‘చైనా రాకెట్’..!

ABN , First Publish Date - 2021-05-07T17:30:31+05:30 IST

చైనాకు, అమెరికాకు మధ్య కొంతకాలంగా స్పర్థలు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా మహమ్మారి విజృంభించిన తరుణంలో అమెరికా అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనాను దుయ్యబట్టారు. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.

కరోనాతోనే చస్తోంటే.. డ్రాగన్ నుంచి భారత్‌కు మరో ముప్పు.. ఢిల్లీ నెత్తిన ‘చైనా రాకెట్’..!

చైనాకు, అమెరికాకు మధ్య కొంతకాలంగా స్పర్థలు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా మహమ్మారి విజృంభించిన తరుణంలో అమెరికా అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనాను దుయ్యబట్టారు. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ దేశాల మధ్య గొడవ అంతరిక్షానికి చేరింది. కొన్ని రోజుల క్రితం చైనా ఒక రాకెట్‌ను ప్రయోగించింది. అయితే అదుపుతప్పిన ఆ రాకెట్ భూమిపై కూలే దిశగా వేగంగా దూసుకొస్తోంది. ఈ క్రమంలో రాకెట్ శకలాలు భూమిపై పడతాయని, అవి ఎక్కడ పడతాయో అప్పుడే చెప్పడం కష్టమని కొందరు నిపుణులు అంటున్నారు. ఈ విషయాన్ని లేవనెత్తిన అమెరికా ‘బాధ్యత కలిగిన అంతరిక్ష ప్రవర్తన’ కోసం పిలుపునిచ్చింది. చైనా మాత్రం భూ వాతావరణంలోకి ప్రవేశించే సమయంలోనే రాకెట్ శకలాలు నాశనమైపోతాయని, దీనిపై ఇంత చర్చ అవసరం లేదని అంటోంది. ఈ విషయంలో ఆందోళన మొత్తం ‘పాశ్చాత్య హైప్’ అంటూ కొట్టి పారేస్తోంది.


అంతరిక్షంలో తమ దేశానికి ప్రత్యేకంగా ఒక స్పేస్ సెంటర్ నిర్మించుకోవాలని చైనా భావిస్తోంది. దీనికి ‘టియాన్హే’ అని పేరు పెట్టింది. దీనికోసం ఏప్రిల్ 29న లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ ప్రయోగించింది. ఈ రాకెట్‌లో టియాన్హే ప్రధాన మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి చేర్చింది. ఇలా మరో పది రాకెట్లు పంపి టియాన్హేను పూర్తి చేయడమే చైనా లక్ష్యం. అయితే దీనికోసం తాజాగా పంపిన రాకెట్ అదుపుతప్పి భూమిపై కూలిపోనుంది. ఇది మే నెల 8వ తారీఖున శనివారం భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే ఈ రాకెట్ ఎక్కడ కూలుతుంది? ఎంత నష్టం జరుగుతుంది? అని చాలా దేశాలు అంచనాలు వేస్తున్నాయి. చైనా మాత్రం ఎటువంటి ఆందోళనా అక్కర్లేదని, రాకెట్‌ చాలా భాగం భూవాతావరణంలోకి ప్రవేశించగానే నాశనమైపోతుందని చెప్పింది. అలాగే కొద్దోగొప్పో భాగాలు మిగిలినా అవి ఏ సముద్రంలోనో కూలతాయని, రాకెట్‌లో తాము వాడిన ఇంధనం వల్ల సముద్ర జలాలకు కూడా ఎటువంటి నష్టమూ ఉండదని హామీ ఇస్తోంది.


అమెరికా స్పందన ఏంటి..?

ఈ రాకెట్‌ దూసుకొస్తున్న మార్గాన్ని యూఎస్ స్పేస్ కమాండ్ ట్రాక్ చేస్తోంది. భూమిపై పడే దీని శకలాల్లో 30 మీటర్ల పొడవైన వేదిక ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి మాట్లాడుతూ.. ‘‘అంతరిక్ష శిధిలాలు, అంతరిక్షంలో పెరుగుతున్న కార్యకలాపాల కారణంగా పెరుగుతున్న రద్దీ వల్ల ఎదురయ్యే ప్రమాదాలను నివారించడానికి యూఎస్ కట్టుబడి ఉంది. ఈ విషయంలో నాయకత్వాన్ని, బాధ్యతాయుతమైన అంతరిక్ష ప్రవర్తనను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ కమ్యూనిటీతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాం’’ అని తెలిపారు. ఈ రాకెట్ భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాతే ఎక్కడ పడేదీ తెలుస్తుందని అమెరికా పరిశోధకులు చెప్తున్నారు.


రాకెట్ శకలాలు ఎక్కడ పడబోతున్నాయి..

అదుపు తప్పిన చైనా రాకెట్‌ ‘లాంగ్‌ మార్చ్‌ 5బీ’పైనే ఇప్పుడు యావత్‌ ప్రపంచం దృష్టి ఉంది. ఇది మరో 48 గంటల్లో (మే 8 నాటికి) భూమిని తాకొచ్చని అమెరికా రక్షణ శాఖ ప్రకటించడంతో.. రాకెట్‌ ఏ దేశంలో పడుతుందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని హార్వర్డ్‌ స్మితోజియన్‌ ఆస్ట్రోఫిజికల్‌ అబ్జర్వేటరీ  ఖగోళ శాస్త్రజ్ఞుడు జొనాథన్‌ మెక్‌డోవెల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా రాకెట్‌.. భారత రాజధాని ఢిల్లీపైనా పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. బీజింగ్‌, ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం, బ్రెజిల్‌లోని రియో డీ జెనీరియో నగరాలపై పడే అవకాశాలను కూడా కొట్టిపారేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆ రాకెట్‌ సెకనుకు 4 మైళ్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోందని, భూమధ్యరేఖకు ఉత్తర, దక్షిణ భాగాలలో 41 డిగ్రీల మధ్య ఉండే ప్రాంతాల్లో ఎక్కడైనా లాంగ్‌ మార్చ్‌ 5బీ కుప్పకూలొచ్చన్నారు. అయితే దాన్ని అదుపులోకి తీసుకొని, నిర్జన ప్రదేశాల వైపు మళ్లించే ప్రయత్నాల్లో చైనా నిమగ్నమై ఉండొచ్చని జొనాథన్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. 


చైనా ఏమంటోంది..?

ప్రస్తుతం ఈ రాకెట్ భూమికి 165 నుంచి 292 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో ఉందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ హెడ్ హోల్గర్ క్రాగ్ తెలిపారు. ఆస్ట్రియాకు చెందిన ఒక లేజర్.. ఈ రాకెట్‌ను ట్రేస్ చేసినట్లు ఆయన చెప్పారు. ఈ రాకెట్ అదుపు తప్పిందని, దీని వల్ల చాలా నష్టం కలగొచ్చని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని చైనా స్పష్టంగా చెప్పేసింది. ఈ విషయంలో నిపుణుల మాటలు వినాలని, వారి అభిప్రాయం ప్రకారం రాకెట్ చాలా భాగం భూ వాతావరణంలో ప్రవేశించగానే మండిపోతుందని చైనా అంటోంది. ఒక వేళ చిన్న చిన్న భాగాలు ఉన్నా అవి పసిఫిక్ మహాసముద్రంలో పడతాయని, దీని వల్ల ఎవరికీ నష్టం లేదని వాదిస్తోంది. అయితే ఈ రాకెట్ కచ్చితంగా ఎక్కడ పడుతుందో అప్పుడే చెప్పలేమని అమెరికా, తదితర పాశ్చాత్య దేశాలు చెప్తున్నాయి. ఈ రాకెట్ ఎక్కడ కూలుతుందో తెలియాలంటే మరో రోజు ఆగాల్సిందే.

Updated Date - 2021-05-07T17:30:31+05:30 IST