Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆర్థిక ఉద్దీపనలకు చైనా ససేమిరా

సంక్షోభాలను ఎదుర్కొనే తీరుతెన్నులే దేశాల పురోగమన, తిరోగమనాలను నిర్ణయిస్తాయి. చైనా ప్రస్తుతం రెండు రంగాలలో సంక్షోభాల నెదుర్కొంటోంది. ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’ (బిఆర్ఐ)లో భాగంగా దేశదేశాల్లో చైనా చేపట్టిన వివిధ ప్రాజెక్ట్‌లు రద్దవుతున్నాయి. ఇది మొదటి సంక్షోభం. రెండో సంక్షోభం ‘ఎవర్ గ్రాండె’తో ముడివడి ఉంది. రియల్‌ఎస్టేట్ రంగంలో ప్రపంచ అగ్రగ్రామి అయిన ఈ కంపెనీ క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఇక మూడో సంక్షోభం చైనీస్ పరిశ్రమలు, నగరాలు ఎదుర్కొంటున్న విద్యుత్ కోతలు. 


ఎగుమతుల ద్వారా లభిస్తున్న ఆదాయం, పొదుపుమొత్తాలే చైనా చేపట్టిన అంతర్జాతీయ ప్రాజెక్టు బిఆర్‌ఐకి మూలాధారాలు. మనం మన పొదుపు మొత్తాలను వాటాలు, ఆస్తులలో మదుపు చేసిన విధంగానే అపారంగా సంచితమవుతున్న డబ్బును ఏదో ఒక విధంగా వినియోగించవలసిన అవసరం చైనాకు ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులలో ఆ ధనాన్ని మదుపు చేసేందుకు బీజింగ్ నిర్ణయించింది. బిఆర్‌ఐకి ఒక భౌగోళిక రాజకీయ కోణం కూడా ఉంది. చైనా ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా చౌకగా, శీఘ్రంగా సమకూర్చడం ద్వారా అమెరికాపై ఆర్థికంగా పైచేయి సాధించడమే బీజింగ్ లక్ష్యం. చైనీస్ నిర్మాణ రంగ కంపెనీలకు భారీ లాభార్జనావకాశాలను కల్పించడం మరొక లక్ష్యం. చైనా నుంచి ఐరోపాకు నిర్మిస్తున్న రైల్వే మార్గం వెంబడి పలు పారిశ్రామిక కేంద్రాలను పోలెండ్, కజకస్తాన్‌లు ఇప్పటికే నిర్మించాయని 2019లో ప్రపంచబ్యాంకు అధ్యయనం ఒకటి వెల్లడించింది.


రవాణా ఖర్చులు తగ్గడం వినియోగదారులు, ఉత్పత్తిదారులు ఇరువురికీ ప్రయోజనకరమే కదా. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని చైనాతో భారీఎత్తున వాణిజ్యం చేస్తున్న భారత్ కూడా ఆ దేశానికి రైల్వే మార్గాన్ని నిర్మించే విషయమై శ్రద్ధ చూపాల్సిన అవసరమున్నది. అయితే అధికారిక అస్తవ్యస్తతకు చైనా సైతం మినహాయింపు కాదు. బిఆర్‌ఐ ప్రాజెక్టులు అనేకం నాసిరకంగా అమలవుతున్నాయి. దీనికి తోడు అవినీతి. ఈ కారణంగా ఆతిథేయి దేశాలు చైనా కంపెనీలపై తీవ్రచర్యలు చేపడుతున్నాయి. అసలు ప్రాజెక్టులనే రద్దు చేస్తున్నాయి. 


మౌలిక సమస్యేమిటంటే బిఆర్ఐ ప్రాజెక్టులలో అనేకం ఆర్థికంగా ఆచరణాత్మకమైనవి కావు. అవి, ఆతిథేయి దేశాలపై భారీ రుణభారాన్ని మోపుతున్నాయి. ఈ బిఆర్ఐ గురించి రెండు విరుద్ధ సూచనలు ఉన్నాయి. బిఆర్ఐతో తమకు విశేష లబ్ధి సమకూరగలదని కజకస్తాన్, పోలెండ్ లాంటి దేశాలు ఆశిస్తున్నాయి. అయితే పలు దేశాలు  వ్యతిరేకిస్తున్నాయి. దాంతో చైనా ముందు రెండు మార్గాంతరాలు ఉన్నాయి. వివాదాస్పద ప్రాజె క్టులను విరమించి ఆచరణీయ ప్రాజెక్టులను మాత్రమే కొనసాగించాలని చైనా నిర్ణయిస్తే బిఆర్ఐ లక్ష్య పరిపూర్తి అసాధ్యం. అలా కాకుండా ఆచరణీయం కాని ప్రాజెక్టులను సైతం కొనసాగించాలని బీజింగ్ నిర్ణయిస్తే అసలు బిఆర్ఐ పూర్తిగా కుప్పకూలుతుంది. 


ఇప్పుడు ‘ఎవర్ గ్రాండె’ సంక్షోభం విషయం చూద్దాం. జిన్‌పింగ్ విధానాల వల్లే ఇది నెలకొన్నది. వ్యాపారసంస్థల ప్రయోజనాల కంటే కాలుష్యం, అసమానతల నిర్మూలన, ఆర్థిక సుస్థిరత్వానికి ఆయన ప్రాధాన్యమిస్తున్నారు. చైనా ఆర్థికవ్యవస్థకు హాని కలిగించేలా ప్రైవేట్ కంపెనీలు మితిమీరిన స్థాయిలో రుణాలు తీసుకోవడంపై జిన్‌పింగ్ ఆంక్షలు విధించారు. రుణాలు తీసుకోవడానికి మూడు ప్రమాణాలను నిర్దేశిస్తూ చైనా ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకున్నది. అవి: తీసుకునే రుణాల కంటే ఆస్తులు అత్యధికంగా ఉండి తీరాలి; స్వల్పకాలిక రుణాల కంటే నగదు నిల్వలూ అత్యధిక స్థాయిలో ఉండి తీరాలి; మూలధనం వాటాతో పోలిస్తే మొత్తం రుణాల నిష్పత్తి సహేతుకంగా ఉండాలి. ఈ మూడు అర్హతల్లో ఏ ఒక్కటీ ‘ఎవర్ గ్రాండె’కు లేదు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడానికి అది పూర్తిగా అనర్హమైపోయింది. దీనికితోడు కొవిడ్ ఉపద్రవంతో ఆ కంపెనీ వ్యాపారం బాగా దెబ్బతింది. తీసుకున్న రుణాలపై వడ్డీని సైతం చెల్లించలేని దుస్థితిలో చిక్కుకుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు తన ఆస్తులు కొన్నిటిని విక్రయించేందుకు ‘ఎవర్ గ్రాండె’ సంకల్పించింది. వాటిని కొనుగోలు చేయాలని ప్రభుత్వరంగ సంస్థలను చైనా ప్రభుత్వం ఆదేశించింది. నష్టాలతో కుదేలయిన యెస్ బ్యాంక్, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ ఆస్తులను కొనుగోలు చేయాలని మన జాతీయ బ్యాంకులను కేంద్రప్రభుత్వం ఆదేశించడం లాంటిదే చైనా పాలకుల నిర్ణయం కూడా. ‘ఎవర్ గ్రాండె’ను ఆర్థికంగా ఆదుకునేందుకు చైనా ప్రభుత్వం సుముఖంగా లేక పోవడం గమనార్హం. అమెరికా ప్రభుత్వం అనుసరించిన విధానానికి ఇది పూర్తిగా విరుద్ధం. 2008 ఆర్థిక సంక్షోభంలో జనరల్ మోటార్స్ కంపెనీ మొదలైన వాటిని వాషింగ్టన్ పాలకులు పెద్దఎత్తున ఆదుకున్నారు. ‘ఎవర్ గ్రాండె’కు చైనా ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక ఉద్దీపనలు ఇవ్వడం లేదు. 


మూడో సంక్షోభం విద్యుత్ కోతలు. పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న థర్మల్ విద్యుత్కేంద్రాలపై చైనా ప్రభుత్వం తీవ్రచర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా అనేక థర్మల్ విద్యుత్కేంద్రాలను మూసివేయించింది. గృహావసరాలకు విద్యుత్ సరఫరా చేసేందుకై ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేయాలని ఆనేక పరిశ్రమలకు విద్యుత్ కంపెనీలు స్పష్టం చేశాయి. అయినప్పటికీ చైనావ్యాప్తంగా అనేక నగరాలు విద్యుత్ కోతలతో సతమతమవుతున్నాయి. గమనార్హమైన విషయమేమిటంటే ఇది ఆర్థిక సంక్షోభం కాదు. కాలుష్య నిరోధక నిబంధనలను పాటించని విద్యుత్కేంద్రాలపై చర్యలు చేపట్టడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమయింది. దీనివల్ల తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో విశేష మేలు జరిగే విధానాలను చైనా ప్రభుత్వం అనుసరిస్తోంది.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)


Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మరిన్ని...