ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసి.. తీరిగ్గా క్లారిటీ ఇచ్చిన చైనా..!

ABN , First Publish Date - 2021-10-18T23:49:48+05:30 IST

క్షిపణి ప్రయోగంపై క్లారిటీ ఇచ్చిన చైనా

ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసి..  తీరిగ్గా క్లారిటీ ఇచ్చిన చైనా..!

బీజింగ్:హైపర్‌సానిక్ మిస్సైల్ ప్రయోగం చేపట్టిన చైనా.. భూమి చుట్టూ ప్రదక్షిణం చేసొచ్చిన క్షిపణి! ప్రపంచం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన వార్త ఇది. ప్రముఖ అంతర్జాతీయ వార్తాపత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ ఇటీవల ఈ కథనాన్ని ప్రచురించింది. ప్రయోగం దాదాపు సలఫలమైనట్టేనని, అనుకున్న లక్ష్యానికి కేవలం 24 మైళ్ల దూరంలో గురితప్పిందని పేర్కొంది. చైనా ఈ ప్రయోగాన్ని అత్యంత రహస్యంగా చేపట్టినట్టు తెలిపింది. అమెరికా నిఘా వర్గాలతో పాటూ యావత్ ప్రపంచాన్ని కలవరపెట్టిన కథనం ఇది. అయితే.. చైనా తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది.


 తాము క్షిపణి ప్రయోగం చేపట్టలేదని, ఓ కొత్త వ్యోమనౌకలోని పునర్వినియోగ సాంకేతికతలను మాత్రమే పరీక్షించామని చెప్పుకొచ్చింది. ‘‘నాకు తెలిసినంత వరకూ.. ఇదో సాధారణ ప్రయోగమే. పునర్వినియోగ సాంకేతికతను పరీక్షించాం.’’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఆగస్టులో ఈ ప్రయోగం జరగ్గా ఇన్నాళ్లకు చైనా ఈ విషయమై తీరిగ్గా ప్రపంచానికి వివరణ ఇచ్చింది.


అమెరికా, రష్యా, చైనాతో పాటూ మరో ఐదు దేశాలు ఈ హైపర్‌సానిక్ సాంకేతికతపై పట్టు సాధించాయి. ధ్వని కంటే ఐదు రెట్లు అధిక వేగం కలిగిన హైపర్‌సానిక్ క్షిపణులు..అణ్వాయుధాలనూ మోసుకెళ్లగలవు. బాలిస్టిక్ మిస్సైల్స్ లాగా కాకుండా.. ఈ మిస్సైళ్లు మార్గమధ్యంలో అవసరమైనప్పుడల్లా తమ దిశను మార్చుకుంటూ శత్రు దేశపు క్షిపణుల బారిన పడకుండా లక్ష్యాన్ని చేరుకోగలవు. బాలిస్టిక్ క్షిపణులు, ఇతర క్రూయిజ్ మిస్సైళ్లను మార్గమధ్యంలోనే తుత్తునియలు చేయగలిగే టెక్నాలజీని అమెరికా ఎప్పుడో అభివృద్ధి చేసుకుంది. అయితే..హైపర్‌సానిక్ క్షిపణులను అడ్డుకోగలిగే టెక్నాలజీ మాత్రం అగ్రరాజ్యం వద్ద కూడా లేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే హైపర్‌సానిక్ క్షిపణి సాంకేతికతను సొంతం చేసుకునేందుకు చైనా విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీంతో..చైనా ప్రయోగానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.  

Updated Date - 2021-10-18T23:49:48+05:30 IST