డ్రాగన్‌ శాంతి మంత్రం

ABN , First Publish Date - 2020-07-07T08:07:40+05:30 IST

గల్వాన్‌ లోయలో తాను వేసిన గుడారాలను చైనా సైన్యం తొలగించింది. అక్కడ చేపట్టిన నిర్మాణాలను కూల్చేస్తోంది. అక్కడి నుంచి బలగాలను ఉపసంహరించింది...

డ్రాగన్‌ శాంతి మంత్రం

  • గల్వాన్‌ లోయ నుంచి బలగాలు వెనక్కి
  • కిలోమీటరుపైగా వెనక్కి ఉపసంహరణ
  • గుడారాల తొలగింపు, నిర్మాణాలు ధ్వంసం
  • ఉపసంహరణకు భారత బలగాలూ శ్రీకారం
  • ఫలించిన ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ దోభాల్‌ చర్చలు
  • చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో 
  • రెండు గంటలపాటు ఫోన్లో మంతనాలు
  • ఘటనలు పునరావృతం కానివ్వద్దని నిర్ణయం


న్యూఢిల్లీ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): గల్వాన్‌ లోయలో తాను వేసిన గుడారాలను చైనా సైన్యం తొలగించింది. అక్కడ చేపట్టిన నిర్మాణాలను కూల్చేస్తోంది. అక్కడి నుంచి బలగాలను ఉపసంహరించింది. దాంతో, భారత బలగాలూ ఉపసంహరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. గతంలోలాగే ఇరు దేశాల సరిహద్దుల మధ్య బఫర్‌ జోన్‌ ఏర్పడింది. వెరసి, తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు తగ్గుతున్నాయి. గల్వాన్‌ లోయలోని పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 వద్ద ఇరు దేశాల సైన్యాలూ జూన్‌ 15వ తేదీన బాహాబాహీకి తలపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కల్నల్‌ సంతోష్‌ బాబు సహా 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అప్పటి నుంచి అక్కడ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మిలటరీ, దౌత్య వర్గాలు వివిధ దఫాలుగా చర్చలు జరిపాయి. కమాండర్ల స్థాయిలో మూడుసార్లు చర్చలు జరిగాయి. అయినా, అక్కడ చైనా గుడారాలను ఏర్పాటు చేస్తోందని, సైనిక సామగ్రిని తరలిస్తోందని కథనాలు వచ్చాయి. దాంతో, అనూహ్యంగా లద్ధాఖ్‌ వెళ్లిన ప్రధాని మోదీ.. ‘విస్తరణ శకం ముగిసింది’ అంటూ పరోక్షంగా చైనాకు హెచ్చరిక సంకేతాలు పంపారు. ఆ తర్వాత 3 రోజులకే.. ఉద్రిక్తతల ఉపశమనానికి సోమవారం తొలి సంకేతాలు కనిపించాయి.


పెట్రోలింగ్‌ పాయింట్‌ 14 వద్ద వేసిన గుడారాలు, ఇతర నిర్మాణాలను చైనాకు చెందిన పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ తొలగిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గల్వాన్‌, గోగ్రా హాట్‌ స్ర్పింగ్స్‌లోని సాధారణ ప్రాంతాల్లో చైనా వాహనాలు వెనక్కి వెళ్లడం కనిపించిందని వివరించాయి. చైనా బలగాలు కిలోమీటరుకుపైగా వెనక్కి వెళ్లినట్లు కనిపించిందని పేర్కొన్నాయి. అయితే, చైనా బలగాలు ఎంత దూరం వెనక్కి వెళ్లాయనే విషయం ఇప్పటికిప్పుడు సుస్పష్టంగా తెలియదని, దీనిపై పక్కాగా తనిఖీ చేపట్టిన తర్వాతే స్పష్టత వస్తుందని వివరించాయి. మరోవైపు, భారత బలగాలు కూడా అక్కడి నుంచి వెనక్కి వచ్చాయి. ఇరు దేశాల బలగాలూ ఎంతమేర వెనక్కి తగ్గాయనే అంశంపై వివిధ కథనాలు వెలువడుతు న్నా.. సరిహద్దుల్లో మాత్రం గతంలోలాగే బఫర్‌ జోన్‌ ఏర్పడింది. ఇరు దేశాల కార్ప్స్‌ కమాండర్‌ స్థాయిలో జరిగిన చర్చల మేరకు ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ఇక, చైనా బలగాలు మోహరించిన పాంగాంగ్‌ టీఎ్‌సవోలోనూ బలగాల ఉపసంహర ణ ప్రారంభమైందా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.


గల్వాన్‌లో 800 మీటర్లపై చైనా కన్ను

నిజానికి చైనా ఓ 800 మీటర్ల కోసమే ప్రయత్నాలు చేసింది. ఏప్రిల్‌లో జరిగిన ఇరు దేశాల సైన్యాధికారుల భేటీలో.. భారత్‌ అధీనంలో ఉన్న పెట్రోలింగ్‌ పాయిం ట్‌ నుంచి భారత్‌వైపు 800 మీటర్ల భూభాగం తమదేనని పేర్కొంది. మన అధికారులు 1961 నాటి రికార్డులను ప్రస్తావించడంతో అప్పటికి ఊరకుండిపోయింది. కానీ, మే నెలలో కవ్వింపు చర్యలను ప్రారంభించింది. గల్వాన్‌ లోయ మొత్తం తమదేనంటూ కొత్తగా గళం అందుకుంది. 1961 నాటి ప్రధాన పత్రికల కథనాలను సైతం పలువురు నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. 


మా బలగాల ఉపసంహరణ: లిజియాన్‌

గల్వాన్‌ వ్యాలీలో చైనా బలగాల ఉపసంహరణ నిజమేనని ఆ దేశ అధికార వర్గాలు కూడా ధ్రువీకరించాయి. వ్యాలీలో ఉద్రిక్తతలు తగ్గించడానికి, బలగాల ఉపసంహరణకు తమ సైన్యం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని, ఈ విషయంలో కొంత పురోగతి సాధించాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్‌ సోమవారం ప్రకటించారు.  చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయాన్ని అమలు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయని చెప్పారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల ఉపసంహరణకు భారత్‌ కూడా దౌత్య, మిలటరీ మార్గాల్లో ముందుకు వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.


60 రోజుల ఉద్రిక్తతలకు చెక్‌

డోక్లాంలో ఉద్రిక్తతలు ఉపశమించడానికి 73 రోజు లు పట్టింది. కానీ, లద్ధాఖ్‌లో 60 రోజులకే పరిస్థితి కొలిక్కి వచ్చింది. నిజానికి, లద్ధాఖ్‌లోని ప్యాంగాంగ్‌ టీఎ్‌సవోలో మే ఐదారు తేదీల్లోనే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పట్లో 150 మంది బలగాలు బాహాబాహీ తలపడ్డారు.  అప్పటి నుంచి ఘర్షణ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మే 19న హాట్‌ స్ర్పింగ్స్‌ ప్రాంతంలో ఇరు వర్గాలకు ఘర్షణ జరిగింది. మిలటరీ స్థాయిలో జరిగిన చర్చలను చైనా తరచూ ఉల్లంఘిస్తూనే ఉంది. జూన్‌ 15న ఇనుప రాడ్లు, ముళ్ల కర్రలతో భారత బలగాలపై విరుచుకుపడింది.


ఒప్పందంలో 5 ప్రధానాంశాలు

  1. వాస్తవ అధీన రేఖ అంతటా బలగాల ఉపసంహరణ జరగాలి
  2. ఈ ఉపసంహరణ క్రమం వేగంగా జరగాలి
  3. సరిహద్దులో దశలవారీగా, క్రమంగా ఉద్రిక్తతలు తగ్గాలి.
  4. భవిష్యత్తులో ఏ సంఘటనా జరగకుండా కలిసికట్టుగా పనిచేయాలి
  5. ఇరు దేశాల దౌత్య ప్రతినిధులు, సైనికాధికారులు చర్చలను కొనసాగించాలి.

Updated Date - 2020-07-07T08:07:40+05:30 IST