శాస్త్రవేత్తల్లో ఆందోళన.. చైనాలో మరో సంక్షోభం తప్పదా..?

ABN , First Publish Date - 2020-12-04T18:41:06+05:30 IST

చైనాలో కొత్త సంక్షోభం తలెత్తబోతోందా..? ప్రభుత్వం మేల్కొనకపోతే ప్రమాదం తప్పదా అంటే.. అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. వారి హెచ్చరికలకు కారణం..

శాస్త్రవేత్తల్లో ఆందోళన.. చైనాలో మరో సంక్షోభం తప్పదా..?

న్యూఢిల్లీ: చైనాలో కొత్త సంక్షోభం తలెత్తే అవకాశం ఉందా..? ప్రభుత్వం మేల్కొనకపోతే ప్రమాదం తప్పదా అంటే.. అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. వారి హెచ్చరికలకు కారణం.. చైనాలో ప్రమాదకర స్థాయికి పడిపోయిన పునరుత్పత్తి రేటు. ఈ అంశంపై అక్కడి పౌర వ్యవహారాల మంత్రి లీ జిహ్యాంగ్ ఇటీవల చేసిన కీలక వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. దేశంలోని పునరుత్పత్తి రేటు 1.5 కంటే తక్కువగా ఉందని, జనాభా వృద్ధి రేటు కీలక దశకు చేరుకుందని ఆయన తెలిపారు. దీంతో చైనా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం మేల్కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టని పక్షంలో చైనా జనాభా సంఖ్య వేగంగా తగ్గిపోవచ్చని, ఓసారి ఈ దశ ప్రారంభమైతే దిద్దుబాటుకు అవకాశం చాలా తక్కువని హెచ్చరిస్తున్నారు. 


నేడు చైనా ఎదుర్కొంటున్న ఈ ప్రమాదానికి మూలాలు రెండు దశాబ్దాల క్రితం ప్రవేశ పెట్టిన పాలసీలో ఉన్నాయి. విపరీతంగా పెరిగిపోతున్న జనాభా తగ్గించాలనుకున్న అప్పటి ప్రభుత్వం వన్ చైల్డ్ పాలసీ తీసుకొచ్చింది. దీని ద్వారా దంపతులకు ఒకరే సంతానం ఉండాలంటూ కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది. వివిధ మార్గాల్లో ఈ విధానాన్ని కఠినంగా అమలు చేసింది. ఈ విధానం మొదట్లో ఆశించిన ఫలితం వచ్చినప్పటికీ రాను రాను అందులోని ప్రమాదాలు బయటపడసాగాయి. పరిస్థితి ఇదే రీతిలో కొనసాగితే..మానవనరుల లభ్యత తగ్గిపోవచ్చని వారికి అర్థమైంది. ఈ నేపథ్యంలోనే 2016లో చైనా ఈ పాలసీకి ముగింపు పలికింది.


అయితే..చైనా సామాజంలో చోటుచేసుకున్న ఆర్థిక, సామాజిక మార్పుల కారణంగా..జీవన వ్యయం భారీగా పెరిగిపోయింది. దీంతో యువత పెళ్లిళ్లను, దంపతులు పిల్లల్ని కనడాన్ని వాయిదా వేసుకోవడం ప్రారంభించారు. దీంతో తాజాగా అక్కడ పునరుత్పత్తి రేటు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. చైనా జనాభా దృష్ట్యా పునురుత్పత్తి రేటు 2.1గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇక 1.5 కంటే దిగువకు చేరుకుంటే ప్రమాదం ముంచుకొస్తున్నట్టే అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు చైనా ప్రభుత్వం తక్షణం మేల్కోవాలంటూ హెచ్చరిస్తున్నారు. 

Updated Date - 2020-12-04T18:41:06+05:30 IST