అమెరికాలో సింహాభాగం భారత్, చైనా విద్యార్థులదే..!

ABN , First Publish Date - 2021-03-21T13:56:51+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల జనాభాలో భారత్, చైనా విద్యార్థులదే సింహాభాగమని తాజాగా స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (ఎస్ఈవీపీ) నివేదిక తేల్చింది.

అమెరికాలో సింహాభాగం భారత్, చైనా విద్యార్థులదే..!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల జనాభాలో భారత్, చైనా విద్యార్థులదే సింహాభాగమని తాజాగా స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (ఎస్ఈవీపీ) నివేదిక తేల్చింది. 2020 ఏడాదిలో మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో కేవలం ఈ రెండు దేశాల నుంచి 47 శాతం మంది విద్యార్థులు వివిధ విద్యసంస్థలలో చేరినట్లు ఈ నివేదిక పేర్కొంది. అయితే, అంతకుముందు ఏడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గినట్లు ఈ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఈ) భాగమైన స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (ఎస్ఈవీపీ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 2020లో మొత్తం 1.25 మిలియన్ల మంది అంతర్జాతీయ విద్యార్థులు(ఎఫ్-1, ఎం-1) ఉన్నట్లు పేర్కొంది.


ఇక్కడ ఎఫ్-1 వీసా అనేది అంతర్జాతీయ విద్యార్థులు ఎవరైతే యూఎస్ కళాశాలలు, యూనివర్శిటీలలో అకాడమిక్ ప్రోగ్రాం లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రోగ్రాం కోసం చేరుతారో వారికి జారీ చేస్తారు. అలాగే ఎం-1 వీసా అనేది యూఎస్ ఒకేషనల్ స్కూల్స్, అండ్ టెక్నికల్ స్కూల్స్‌కు హాజరయ్యే అంతర్జాతీయ విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఈవీపీ నివేదిక ప్రకారం ప్రస్తుతం అగ్రరాజ్యంలో అంతర్జాతీయ విద్యార్థుల గణంకాలు ఇలా ఉన్నాయి. చైనా 3,82,561 మంది విద్యార్థులతో మొదటి స్థానంలో ఉంటే.. 2,07,460 మంది విద్యార్థులతో ఇండియా రెండో స్థానంలో ఉంది. ఆ తరువాత ఈ జాబితాలో వరుసగా దక్షిణ కొరియా (68,217), సౌదీ అరేబియా (38,039), కెనడా (35,508), బ్రెజిల్ (34,892) ఉన్నాయి. 2020 ఏడాదిలో మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో 47 శాతం (5,90,021).. చైనా(3,82,561), భారత్( 2,07,460) ఉన్నట్లు ఎస్ఈవీపీ నివేదిక పేర్కొంది. కాగా, 2019తో పోలిస్తే ఇది ఒక శాతం తగ్గింది.  

Updated Date - 2021-03-21T13:56:51+05:30 IST