చైనా వైద్యుని చర్మపు రంగు తిరిగొచ్చింది

ABN , First Publish Date - 2020-10-28T12:30:12+05:30 IST

కరోనా మహమ్మారి బాధితుల శరీరంపై పలు రకాలుగా ప్రభావం చూపుతోంది.

చైనా వైద్యుని చర్మపు రంగు తిరిగొచ్చింది

బీజింగ్: కరోనా మహమ్మారి బాధితుల శరీరంపై పలు రకాలుగా ప్రభావం చూపుతోంది. దీనిపై ముమ్మరంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో చైనాలో ఒక విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. కరోనా బారిన పడిన కారణంగా ఒక వైద్యుని చర్మపు రంగు నల్లగా మారిపోయింది. అయితే కరోనా నుంచి కోలుకున్న కొన్ని రోజుల తరువాత అతని చర్మం తిరిగి పూర్వపు రంగులోనికి వచ్చింది. దీంతో ఆ వైద్యుని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 


బాధిత వైద్యుని పేరు యీ ఫ్యాన్. ఆయన హృద్రోగ నిపుణుడు. కరోనా బాధితులకు చికిత్స అందిస్తూ డాక్టర్ యీ ఫ్యాన్... వైరస్ బారిన పడ్డారు. ఈ సందర్భంగా అతనితో పాటు పనిచేస్తున్న వైద్యుడొకరు మాట్లాడుతూ... డాక్టర్ యీ ఫ్యాన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్నప్పుడు యాంటీ బయోటిక్ ఔషధం తీసుకున్నారని, ఈ కారణంగానే అతని చర్మం నల్లబడిందన్నారు. కాగా డాక్టర్ యీ ఫ్యాన్ ఒక వీడియోను విడుదల చేశారు. దానిలో కరోనా వైరస్ ఎంత ప్రమాదకారో తెలియజేశారు. కరోనా గురించి చాలా విషయాలు తెలుసుకున్నాక... తనకు ఎంతో భయం కలిగిందని అన్నారు. చైనా వైద్యుడు యీ ఫ్యాన్ ఈ ఏడాది జనవరి 18న కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరారు. 39 రోజుల పాటు చికిత్స పొందిన అనంతరం డాక్టర్ యీ ఫ్యాన్ వ్యాధి నుంచి బయటపడ్డారు.

Updated Date - 2020-10-28T12:30:12+05:30 IST