భారత వ్యాక్సిన్లపై చైనా మీడియా ఏడుపు

ABN , First Publish Date - 2021-01-27T21:15:18+05:30 IST

కోవిడ్-19 వ్యాక్సిన్లను ఉదారంగా పంచుతున్న భారత దేశంపై

భారత వ్యాక్సిన్లపై చైనా మీడియా ఏడుపు

బీజింగ్ : కోవిడ్-19 వ్యాక్సిన్లను ఉదారంగా పంచుతున్న భారత దేశంపై చైనా మీడియా ఏడుస్తోంది. వ్యాక్సిన్లతో ఇతర దేశాల మీద పట్టు సాధించాలనుకున్న చైనాకు ఎదురు దెబ్బ తగలడంతో అక్కసు వెళ్ళగక్కుతోంది. భారత్ అనవసరంగా జోక్యం చేసుకోవడం వల్లే బంగ్లాదేశ్‌లో కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్‌కు సినోవాక్ బయోటెక్ చేసిన కృషి సర్వనాశనమైపోయిందని విలపిస్తోంది. 


చైనా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘గ్లోబల్ టైమ్స్’ మంగళవారం ప్రచురించిన, ఓ కథనంలో భారత దేశం అనవసరంగా జోక్యం చేసుకోవడం వల్ల బంగ్లాదేశ్‌లో చైనా కంపెనీ సినోవాక్ బయోటెక్ నిర్వహించాలనుకున్న కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్‌కు విఘాతం కలిగిందని పేర్కొంది. 


ఒప్పందానికి విరుద్ధంగా...

చైనా సంస్థ సినోవాక్ బయోటెక్ గత ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించాలనుకుంది. దీనికయ్యే ఖర్చును పూర్తిగా ఆ కంపెనీయే భరించడానికి మొదట ఒప్పందం కుదిరింది. టెక్నాలజీని కూడా బంగ్లాదేశ్‌కు ఇవ్వడానికి, ఆ టెక్నాలజీ ఆధారంగా బంగ్లాదేశ్‌లోని ఫార్మా కంపెనీల్లో ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. కానీ చివరి క్షణంలో ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు నిదులు సమకూర్చాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని సినోవాక్ కోరింది. సినోవాక్ బయోటెక్ గత ఏడాది సెప్టెంబరు 22న బంగ్లాదేశ్ ప్రభుత్వానికి రాసిన లేఖలో, బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంలో జాప్యం చేయడం వల్ల షెడ్యూలు ప్రకారం ఆగస్టులో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించలేకపోయినట్లు పేర్కొంది. బంగ్లాదేశ్‌లో ట్రయల్స్ కోసం కేటాయించిన నిధులను ఇతర దేశాల్లో ట్రయల్స్ కోసం వినియోగిస్తున్నట్లు పేర్కొంది. బంగ్లాదేశ్‌లో ట్రయల్స్‌కు తుది అనుమతులపై అనిశ్చితి నెలకొందని పేర్కొంది. గత ఏడాది అక్టోబరు లేదా నవంబరు ప్రారంభం నాటికి నిదుల పరిస్థితిని పాక్షికంగా సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, తమకు బంగ్లాదేశ్‌లో ట్రయల్స్ పూర్తి చేయడానికి నిధుల సహకారం అవసరమని పేర్కొంది.


నిధులను సమకూర్చలేం : బంగ్లాదేశ్  

దీనిపై గత ఏడాది అక్టోబరులో బంగ్లాదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి జాహిద్ మలేకీ మీడియాతో మాట్లాడుతూ,  సినోవాక్ బయోటెక్ తమతో కుదుర్చుకున్న ఒప్పందంలో నిదులను కోరలేదని, అందువల్ల వ్యాక్సిన్ ట్రయల్స్‌ నిర్వహణపై ముందుకు వెళ్లేది లేదని చెప్పారు. తాము నిదులను సమకూర్చబోమని చెప్పారు. ఒప్పందంలో నిదులను సమకూర్చాలనే నిబంధన లేదన్నారు. మొదట్లో తమను సంప్రదించినపుడు నిధుల గురించి మాట్లాడలేదన్నారు. ఒప్పందం ప్రకారం  వ్యాక్సిన్ ట్రయల్స్‌కు అయ్యే ఖర్చులన్నిటినీ ఆ కంపెనీయే భరించాలని, 1,10,000 వ్యాక్సిన్ డోసులను ఉచితంగా తమకు ఇవ్వాలని చెప్పారు. బంగ్లాదేశ్ ఫార్మా కంపెనీల్లో వ్యాక్సిన్లను తయారు చేసేందుకు టెక్నాలజీని కూడా పంచుకుంటామని ఒప్పందంలో ఆ కంపెనీ పేర్కొందని చెప్పారు. 


భారత్ తీరు ఆదర్శప్రాయం

బంగ్లాదేశ్‌తో చైనా వ్యవహరించిన తీరుకు పూర్తి భిన్నంగా మన దేశం వ్యవహరించింది.  రెండు మిలియన్ల కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఈ నెల 21న ఉచితంగా బహుమతిగా బంగ్లాదేశ్‌కు ఇచ్చింది. అంతేకాకుండా 30 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ సరఫరాకు ఒప్పందం కుదుర్చుకుంది. 


ఈ నేపథ్యంలో చైనా మీడియా భారత దేశంపై అక్కసు వెళ్లగక్కుతోంది. చైనాకు రావలసిన అవకాశాలు దెబ్బతింటున్నాయని ఏడుస్తోంది. బంగ్లాదేశ్‌తో గత ఏడాది జూలైలో కుదిరిన ఒప్పందం ప్రకారం, వ్యాక్సిన్ ట్రయల్స్ గత ఏడాది ఆగస్టులో ప్రారంభం కావలసి ఉందని పేర్కొంది. ఈ ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ నిదులు సమకూర్చవలసిన అవసరం లేదన్న విషయాన్ని ధ్రువీకరించింది. అయితే బంగ్లాదేశ్-చైనా మధ్య  భారత దేశం అనవసరంగా జోక్యం చేసుకోవడంతో క్లినికల్ ట్రయల్స్ గత ఏడాది  అక్టోబరు వరకు వాయిదా పడ్డాయని తెలిపింది. 


చైనా మీడియాపై కట్టుదిట్టమైన నియంత్రణలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. మన దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లను లక్ష్యంగా చేసుకుంటూ ఇటువంటి కథనాలు అనేకం వెలువడుతున్నాయి. 


Updated Date - 2021-01-27T21:15:18+05:30 IST