2015 నుంచి క‌రోనా వైర‌స్‌పై చైనా ప‌రిశోధ‌న‌లు

ABN , First Publish Date - 2021-05-10T15:18:18+05:30 IST

కరోనా వైరస్ అనేది 2020లో అకస్మాత్తుగా ఊడిప‌డ‌లేదు.

2015 నుంచి క‌రోనా వైర‌స్‌పై చైనా ప‌రిశోధ‌న‌లు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ అనేది 2020లో అకస్మాత్తుగా ఊడిప‌డ‌లేదు. 2015 నుంచి చైనా క‌రోనా వైర‌స్‌పై ప‌లు ప‌రిశోధ‌న‌లు సాగిస్తోంది. చైనా సైన్యం ఆరేళ్ల క్రితమే కోవిడ్-19 వైరస్‌ను జీవ ఆయుధంగా ఉపయోగించడానికి కుట్ర పన్నింది. ఈ విష‌యాన్ని ది వీకెండ్ ఆస్ట్రేలియన్ తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక‌ను చైనా పరిశోధనా పత్రాన్ని ఆధారం చేసుకుని రూపొందించారు. ఆరేళ్ల క్రితం సార్స్ వైరస్ సహాయంతో చైనా జీవ ఆయుధాలను తయారు చేయడానికి ప్రయత్నించింద‌ని ఈ నివేదిక తెలిపింది. చైనా శాస్త్రవేత్తలు, ఆరోగ్య అధికారులు 2015 నుంచే కరోనాకు సంబంధించిన వివిధ స్ట్రెయిన్ల గురించి చర్చించారు. ఆ సమయంలో చైనా శాస్త్రవేత్తలు దీనిని మూడవ ప్రపంచ యుద్ధంలో జీవ ఆయుధంగా ఉపయోగించనున్నట్లు తెలిపారు. దీనిని అంటువ్యాధిగా ఎలా మార్చవచ్చ‌నే దానిపై కూడా అప్ప‌ట్లో చర్చ జరిగింది.


దీని గురించి ఆస్ట్రేలియా సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రాబర్ట్ పాటర్ మాట్లాడుతూ ఈ వైరస్‌ను జంతు మార్కెట్ నుంచి వ్యాప్తి చేయలేమని తెలిపారు. ఆ సిద్ధాంతం పూర్తిగా తప్ప‌న్నారు. తాము చైనీస్ పరిశోధనా పత్రాల‌ను అధ్యయనం చేస్తూనే ఉన్నామ‌ని, చైనా శాస్త్రవేత్తల ఆలోచ‌నా తీరు దీనిలో వెల్ల‌డ‌వుతున్న‌ద‌న్నారు. ఆస్ట్రేలియా మీడియా నివేదికను కొట్టిపారేయలేమ‌న్నారు. గత ఏడాది అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా కరోనాను 'చైనీస్ వైరస్' అని పిలిచారు. ఇది చైనా ల్యాబ్ లో రూపొందించార‌ని, ఇది ప్రపంచ ఆరోగ్య రంగాన్ని నాశనం చేస్తుందని, అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్ప‌కూలుతాయ‌ని ఆయన అన్నారు. అమెరికా గూఢచార సంస్థల ద‌గ్గ‌ర‌ దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, వాటిని తగిన సమయంలో ప్రపంచం ముందు ఉంచుతామని ట్రంప్ అప్ప‌ట్లో చెప్పారు. అయితే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయి, బైడెన్ అధికారం చేప‌ట్టాక అత‌ని అడ్మినిస్ట్రేషన్ దీని గురించి స్పందించ‌లేదు. అయితే ఈ విషయమై అమెరికా ముమ్మ‌రంగా దర్యాప్తు చేస్తున్నద‌ని బ్లూమ్ బెర్గ్ ఇటీవల తెలిపింది. 

Updated Date - 2021-05-10T15:18:18+05:30 IST