చైనా సైనికుణ్ని సురక్షితంగా తిరిగి అప్పగించిన భారత్

ABN , First Publish Date - 2020-10-21T15:25:59+05:30 IST

భారత సైన్యం తన ఉదారతను చాటుకుంది. ‘వసుధైక కుటుంబకం’ అన్న సూక్తిని కేవలం పెదాల మీదే ఉంచుకోలేదు. ఆచరణలో పెట్టి చూపించింది.

చైనా సైనికుణ్ని సురక్షితంగా తిరిగి అప్పగించిన భారత్

లడఖ్ : భారత సైన్యం తన ఉదారతను చాటుకుంది. ‘వసుధైవ కుటుంబకం’ అన్న సూక్తిని కేవలం పెదాల మీదే ఉంచుకోలేదు. ఆచరణలో పెట్టి చూపించింది. ‘యుద్ధం త్యజతాం... స్పర్ధాం త్యజతాం... త్యజత పరేశ్వా...క్రమమా క్రమణం..’’ అని ప్రముఖ గాయని ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ఐక్యరాజ్య సమితిలో పాడిన ఈ పాటను అక్షరాలా భారత సైన్యం మంగళవారం చేసి చూపించింది. అనుకోకుండా... తెలియకుండా... అటు ఆర్మీ జవాన్లు గానీ... ఇటు సాధారణ పౌరులు గానీ.. సరిహద్దులు దాటితే... దాయాది పాకిస్తాన్ వ్యవహరించినట్లుగా చైనా సైనికుడితో మన సైన్యం వ్యవహరించలేదు. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ... అవసరాలు తీర్చి... తిరిగి క్షేమంగా చైనాకు అప్పగించింది ఆ జవాన్‌ను. అవును ఇది నిజం. చైనాకు చెందిన ఓ సైనికుడు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఏసీ) దాటి మన భారత భూభాగంలోకి ప్రవేశించాడు. ఆ సైనికుణ్ని ‘కార్పొరల్ వాంగ్ యా లాంగ్’ గా గుర్తించారు.  తూర్పు లద్దాఖ్ లోని డెమ్‌చోక్ సెక్టార్‌లో భారత సైన్యం ఆ సైనికుడ్ని పట్టుకుంది. ఆ తర్వాత ఆ సైనికుణ్ని మంగళవారం అర్ధరాత్రి భారత ఆర్మీ అధికారులు క్షేమంగా చైనాకు తిరిగి అప్పగించారు.


కేవలం అప్పగించడమే కాదు... లద్దాఖ్ ప్రాంతంలోని వాతావరణానికి ఆయన తట్టుకునేలా... చైనా సైనికుడి ఆరోగ్యం దెబ్బతినకుండా భారత సైన్యం అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. ఆక్సిజన్ అందించడం, వైద్య సదుపాయం, ఆహారం, వెచ్చని దుప్పట్లు అందించడం... ఇలా... ఆ సైనికుడికి ఎక్కడా ఇబ్బంది కాకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. ఈ విషయాన్ని భారత ఆర్మీయే వెల్లడించింది.


ఇదిలా ఉండగా.. ఆ సైనికుడు భారత భూభాగంలోకి ఎందుకు వచ్చాడన్న దానిపై డ్రాగన్ వివరణ ఇచ్చుకుంది. చైనా సరిహద్దు ప్రాంతంలో... పశువుల కాపరికి చెందిన ఓ జంతువు తప్పి పోయిందని, ఈ క్రమంలో ఆ పశువుల కాపరికి సహాయం చేస్తూ.. చేస్తూ... పొరపాటున చైనా సైనికుడు భారత భూభాగంలోకి ప్రవేశించాడని చైనా అధికారులు భారత సైన్యానికి వివరణ ఇచ్చారు. అయితే.. పొరపాటున సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించాడని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. 

Updated Date - 2020-10-21T15:25:59+05:30 IST