Abn logo
Sep 28 2021 @ 20:14PM

ఉత్తరాఖండ్‌లో వంతెనను ధ్వంసం చేసిన చైనా సైనికులు!

న్యూఢిల్లీ : దాదాపు 100 మంది చైనా సైనికులు భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడి, ఉత్తరాఖండ్‌లోని ఓ వంతెనను ధ్వంసం చేశారు. టుంజున్-లా పాస్ గుండా వీరు సుమారు 5 కిలోమీటర్ల మేరకు భారత భూభాగంలోకి చొరబడ్డారు. వీరంతా 55 గుర్రాలపై వచ్చి, బారాహోటిలోని వంతెనను ధ్వంసం చేసి, తిరిగి చైనాలోకి వెళ్ళిపోయారు. ఈ వివరాలను సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ పత్రిక మంగళవారం వెల్లడించింది. 


పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు దాదాపు 3 గంటలపాటు ఈ విధ్వంసకాండకు పాల్పడినట్లు ఈ పత్రిక తెలిపింది. బారాహోటిలోని వంతెనను చైనా సైనికులు ధ్వంసం చేస్తున్నారని స్థానికులు భారతీయ భద్రతా దళాలకు సమాచారం అందించినట్లు తెలిపింది. వెంటనే భారత సైన్యం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ బృందాలు ఈ ప్రాంతానికి వెళ్ళినట్లు తెలిపింది. 


హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లతో టిబెట్ సరిహద్దు 545 కిలోమీటర్ల మేరకు సెంట్రల్ సెక్టర్‌లో ఉంది. దీనిలో దాదాపు 2,000 చదరపు కిలోమీటర్ల భూభాగంపై  భారత్-చైనా మధ్య వివాదం ఉంది. ఈ భూభాగం ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో ఉంది. ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో బారాహోటి ఉంది. ఇది చైనా సరిహద్దుల్లో ఉంది. నందా దేవి నేషనల్ పార్క్‌కు ఉత్తర దిశలో ఉంది. 2017 జూలైలో చైనా సైనికులు రెండుసార్లు ఈ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడ్డారు. అప్పట్లో డోక్లాం వద్ద చైనా-భారత్ మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. 


ఇవి కూడా చదవండిImage Caption