చిన్నజీయర్‌ స్వామీజీ ఆశ్రమంలో అద్భుత ఘట్టం.. ఆహ్వానాల పరంపర

ABN , First Publish Date - 2021-09-17T02:13:50+05:30 IST

చిన్నజీయర్‌ స్వామీజీ ఆశ్రమంలో అద్భుత ఘట్టం.. ఆహ్వానాల పరంపర

చిన్నజీయర్‌ స్వామీజీ ఆశ్రమంలో అద్భుత ఘట్టం.. ఆహ్వానాల పరంపర

న్యూఢిల్లీ: బంధనాలను పక్కకు తోసి భక్తులను భగవంతుడికి అనుసంధానం చేసిన ఆధ్మాత్మక విప్లవమూర్తి, సమతా మూర్తి భగవాద్రామానుజులు నడయాడిన నేల పునీతమవబోతోంది. శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని శ్రీరామనగర్‌లో త్రిదండి చిన జీయర్‌స్వామి ఆశ్రమంలో ఆవిష్కృతం కానున్న అద్భుత ఘట్టానికి ఆహ్వాన కార్యక్రమాల పరంపర కొనసాగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు భగవద్రామానుజుల సహస్రాబ్ది వేడుకతో పాటు 200 ఎకరాల్లో వెయ్యికోట్ల వ్యయంతో నిర్మించిన 216 అడుగుల  భగవద్రామానుజ పంచలోహ విగ్రహావిష్కరణ మహోత్సవం జరగనుంది. అతిరథమహారథులను స్వయంగా కలిసి ఆహ్వాన పత్రికలను త్రిదండి చిన్నజీయర్‌ స్వామీజీ స్వయంగా అందిస్తున్నారు.  మైహోం గ్రూపు అధినేత డాక్టర్‌ జూపల్లి రామేశ్వర్‌రావు, డైరెక్టర్లు రంజిత్‌రావు, రామూరావు కూడా స్వామీజీ వెంట వెళ్లి అతిధులకు ఆహ్వానం పలుకుతున్నారు.


మంగళవారం రామానుజాచార్య సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆహ్వానించారు త్రిదండి చిన్నజీయర్ స్వామి. రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్ కోవింద్‌ను స్వయంగా కలిసి ఆహ్వానపత్రం అందించారు. రామానుజాచార్య విగ్రహ విశేషాలను.. ఏర్పాటు చేయడానికి గల కారణాలను రాష్ట్రపతికి వివరించారు చిన్నజీయర్‌ స్వామీజీ. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తప్పక హాజరవుతానని హామీ ఇచ్చారు రామ్‌నాథ్‌ కోవింద్‌. 


రాష్ట్రపతిని కలిసిన అనంతరం... నేరుగా ఉప రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి రామానుజ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి వెంకయ్యనాయుడును కూడా ఆహ్వానించారు చిన్నజీయర్ స్వామి. కులమతవర్గ ఆర్థిక కారణాలతో సమాజం విచ్ఛిన్నమవుతున్న సమయంలో అందర్నీ ఏకం చేసేందుకే సమతామూర్తిని ఏర్పాటు చేసినట్లు వెంకయ్యనాయుడికి వివరించారు చిన్నజీయర్‌ స్వామి. సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపి సమానత్వ సాధన కోసం కృషిచేసిన భగవత్‌ రామానుజాచార్యులు సామాజిక సంస్కరణాభిలాషిగా చెరగని ముద్ర వేశారన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. భగవంతుడు అందరివాడు అంటూ వారు చూపిన మార్గం అందరికీ ఆచరణీయం అన్నారు. సామాజిక  చైతన్య ప్రభోదకులైన రామానుజుల వారి అతిపెద్ద ప్రతిమను ఏర్పాటు చేయడం ద్వారా వారి బోధనలు, సందేశం ప్రపంచవ్యాప్తంగా విస్తరించే  అవకాశం ఉంటుందని ఆకాంక్షించారు ఉపరాష్ట్రపతి. 


బుధవారం కేంద్ర ఉపరితల రవాణాశాఖమంత్రి నితిన్‌ గడ్కరీకి భగవత్‌ రామానుజాచార్య సమతామూర్తి ఆవిష్కరణ ఆహ్వాన పత్రాన్ని అందించారు చిన్నజీయర్ స్వామి. ఢిల్లీలో నితిన్‌ గడ్కరీని కలుసుకున్న చిన్నజీయర్‌ స్వామి.. సమతా మూర్తి విశిష్టతను వివరించారు.  అటు కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌ రెడ్డిని కూడా దివ్యసాకేతానికి ఆహ్వానించారు చిన్నజీయర్ స్వామి. రామానుజ విగ్రహ ఆవిష్కరణ ఆహ్వాన పత్రాన్ని స్వయంగా అందించారు. సమతామూర్తి  విగ్రహ ఏర్పాటు ద్వారా... వారి బోధనలు, సందేశం ప్రపంచవ్యాప్తంగా విస్తరించే  అవకాశం ఉంటుందన్నారు చిన్నజీయర్ స్వామీజీ. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విన్‌ చూబె, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజేకు కూడా ఆహ్వాన పత్రికలు అందించారు చిన్నజీయర్ స్వామి. ఆశ్రమంలో నిర్మిస్తున్న సమతామూర్తి ప్రాధాన్యతను తెలియజేశారు. వారికి మంగళశాసనాలను అందించారు.  


గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి.. భగవత్‌ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలకు రావాలని సాదరంగా ఆహ్వానించారు చిన్నజీయర్‌ స్వామి. రామానుజాచార్య జీవిత విశేషాలు..  ఆయన చేసిన మహత్కార్యాలను అమిత్‌ షాకు కూలంకశంగా వివరించారు. ముచ్చింతల్‌లో చేపట్టిన రామానుజ ప్రాజెక్ట్‌ వివరాలను, కార్యక్రమ విశిష్టతను గంటపాటు అమిత్‌షాకు వివరించారు చినజీయర్‌స్వామి. దీన్నంతటినీ ఆసక్తిగా ఆలకించారు  అమిత్‌ షా. విగ్రహావిష్కరణ మహోత్సవానికి తప్పకుండా వస్తానని చిన్నజీయర్‌  స్వామికి హామీ ఇచ్చారు అమిత్‌ షా.



అంతకు ముందు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు చిన్నజీయర్ స్వామి.  భగవాన్‌‌ రామానుజుల విగ్రహావిష్కరణ మహోత్సవ  విశేషాలను విని ఆనందం వ్యక్తం చేశారు రాజ్‌నాథ్‌ సింగ్‌. సమతామూర్తి విశిష్టతను, ప్రాజెక్టు పూర్తి వివరాలను అరగంటకుపైగా రాజ్‌నాథ్‌కు వివరించారు మైహోం గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి  రామేశ్వర్‌రావు. ఈ కార్యక్రమానికి హాజరవుతానని హామీ ఇచ్చారు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌.



అటు.. ఈ అద్వితీయ ఘట్టానికి విచ్చేయాలని RSS చీఫ్‌ మోహన్‌భగవత్‌ను కలిసి ఆహ్వానించారు చినజీయర్‌ స్వామి. జీయర్‌ స్వామి చేపట్టిన ఈ మహాయజ్ఞాన్ని అభినందించారు మోహన్‌భగవత్‌. భగవత్‌ రామానుజుల  ప్రాజెక్ట్‌ విశేషాలను ఆసక్తిగా ఆలకించారు.


భగవత్‌ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల సందర్భంగా శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని చిన్నజీయర్ స్వామీజీ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద సమతామూర్తి విగ్రహావిష్కరణ మహోత్సవాలను  వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 12 వరకూ నిర్వహిస్తున్నారు. స్టాట్చ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీగా ఏర్పాటు చేస్తోన్న 216 అడుగుల పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన ఈ సందర్భంగా జరగనుంది. మొత్తం 200 ఎకరాల్లో వేయి కోట్లతో సమతామూర్తి ప్రాజెక్టును నిర్మించారు. ఈ సందర్భంగా వేయీ35 హోమ గుండాలతో ప్రత్యేక యాగం నిర్వహించనున్నారు. దీని కోసం 2 లక్షల కిలోల ఆవు నెయ్యి వినియోగించనున్నారు.


Updated Date - 2021-09-17T02:13:50+05:30 IST