వసూళ్ల దందా!

ABN , First Publish Date - 2021-10-13T06:34:57+05:30 IST

ప్రభుత్వం ఇచ్చే ‘ఆసరా’ సొమ్ము డ్వాక్రా మహిళల ఖాతాలో జమ చేయాలంటే వాటా చెల్లించాలి.

వసూళ్ల దందా!
చిన్నాపురం యూనియన్‌ బ్యాంక్‌

చిన్నాపురం యూనియన్‌ బ్యాంకులో ఓ ప్రైవేటు ఉద్యోగి నిర్వాకం

డ్వాక్రా మహిళల నుంచి వసూళ్ల పర్వం

‘ఆసరా’ జమ చేయాలంటే రూ.2వేలు

ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసిన సభ్యులు 


ప్రభుత్వం ఇచ్చే ‘ఆసరా’ సొమ్ము డ్వాక్రా మహిళల ఖాతాలో జమ చేయాలంటే వాటా చెల్లించాలి. బ్యాంకులో ఇంకేదైనా పని కావాలంటే తను చెప్పినంతా ఇచ్చుకోవాలి. బందరు రూరల్‌ మండలం చిన్నాపురంలోని యూనియన్‌ బ్యాంకులో పనిచేసే ఓ ప్రైవేటు ఉద్యోగి నిర్వాకం ఇది. తను చెప్పినంతా ఇవ్వకుంటే పని జరగదని బాహాటంగా చెప్పేస్తాడు ఆ ఉద్యోగి. ఇవ్వకుంటే ఖాతాదారుల ఇళ్లకు వెళ్లిమరీ వేధిస్తుంటాడు. ఇంత జరుగుతున్నా ఆ బ్యాంకు అధికారులకు తెలియదనడం విచిత్రం. ఈ వ్యవహారంపై నేరుగా ముఖ్యమంత్రి జగన్‌కే డ్వాక్రా మహిళలు ఫిర్యాదు చేయడం గమనార్హం.


ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం : చిన్నాపురం యూనియన్‌ బ్యాంక్‌ (పాత ఆంధ్రాబ్యాంకు)లో ఓ ప్రైవేటు ఉద్యోగి వసూళ్ల దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రతిపనికీఒక రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నా అడ్డు చెప్పేవారే లేకుండా పోయారు. బ్యాంకుకు వెళితే ఈ ప్రైవేటు ఉద్యోగిని ప్రసన్నం చేసుకుంటేనే పనులు జరుగుతాయని, లేకుంటే జరగవని ఖాతాదారులు, డ్వాక్రా మహిళలు వాపోతున్నారు. ఈ ఉద్యోగి వేధింపులు భరించలేని ఖాతాదారులు నేరుగా ముఖ్యమంత్రికి ఫ్యాక్స్‌ ద్వారా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. 


రూ.2 వేలు చెల్లిస్తేనే ‘ఆసరా’!

ఈబ్యాంకులో చిన్నాపురం, పరిసర గ్రామాలకు చెందిన డ్వాక్రా గ్రూపులు ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటాయి. ఇటీవల డ్వాక్రా గ్రూపులకు ఆసరా రెండో విడత నగదును ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నగదును సభ్యుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. అయితే ఇందుకు బ్యాంకులో పనిచేసే ఓ ప్రైవేటు  ఉద్యోగి (మెస్సెంజర్‌) ఒక్కో డ్వాక్రా సంఘం నుంచి తన వాటాగా వెయ్యి, యానిమేటర్‌కు ఇవ్వాలని మరో వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నాడని, ఇదేమని ప్రశ్నిస్తే నగదు ఇస్తేనే పనవుతుందని, లేకుంటే ఫైలు ముందుకు వెళ్లదని తెగేసి చెబుతున్నాడని సభ్యులు వాపోతున్నారు. ఈ బ్యాంకులో వెయ్యి డ్వాక్రా సంఘాల వరకు ఉన్నాయని, వారందరి నుంచీ ఆ ఉద్యోగి వసూళ్లకు పాల్పడుతున్నాడని డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు. ఈ ఉద్యోగి ఆగడాలపై బ్యాంకు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశామని ఆ మహిళలు తెలిపారు. ఇటీవల చిన్నాపురంలో రెండో విడత ఆసరా చెక్కుల పంపిణీ జరిగింది. ఈ  కార్యక్రమానికి మంత్రి పేర్ని నాని హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోనే ఆ ప్రైవేటు ఉద్యోగి నిర్వాకాలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన డ్వాక్రా మహిళలను స్థానిక పెద్దలు అడ్డుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. బ్యాంకుకు వచ్చిన డ్వాక్రా మహిళలను ఈ ఉద్యోగి తనదైన శైలిలో వేధింపులకు గురిచేస్తున్నాడని, అతని అక్రమ వసూళ్లు, వేధింపులపై తగు విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి పంపిన లేఖలో మహిళలు పేర్కొన్నారు.


నా దృష్టికి రాలేదు

మా బ్యాంకులో పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగి (మెస్సెంజర్‌) ఆసరా నగదును డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమచేసేందుకు సభ్యుల నుంచి నగదు వసూలు చేస్తున్న విషయం నాదృష్టికి రాలేదు. దీనిపై విచారణ జరిపి, తగు చర్యలు తీసుకుంటాం. - రాహుల్‌, మేనేజర్‌, చిన్నాపురం యూనియన్‌ బ్యాంక్‌

Updated Date - 2021-10-13T06:34:57+05:30 IST